Drone Training: మహిళలకు డ్రోన్లు!’
ABN , Publish Date - Apr 05 , 2025 | 04:46 AM
మహిళలకు అన్నిరంగాల్లో అవకాశాలు కల్పించి ప్రోత్సహించే దిశగా చర్యలు చేపడుతున్న ప్రభుత్వాలు.. డ్రోన్లను ఆపరేట్ చేయడంలోనూ వారికి శిక్షణ ఇస్తున్నాయి. పంట పొలాల్లో పురుగు మందులను పిచికారీ చేసేందుకు డ్రోన్లను వినియోగించడంపై మహిళలకు తర్ఫీదునిస్తున్నాయి.

పంటలకు మందుల పిచికారీలో వినియోగం.. కొనుగోలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాయం
10 లక్షల డ్రోన్ కొనుగోలుకు 80 శాతం సబ్సిడీ
డ్రోన్ల నిర్వహణపై మహిళలకు శిక్షణ
‘నమో డ్రోన్ దీదీ’ పథకం కింద తర్ఫీదు
సంగారెడ్డి జిల్లా జోగిపేటలో తొలిసారి ట్రైనింగ్
జోగిపేట, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): మహిళలకు అన్నిరంగాల్లో అవకాశాలు కల్పించి ప్రోత్సహించే దిశగా చర్యలు చేపడుతున్న ప్రభుత్వాలు.. డ్రోన్లను ఆపరేట్ చేయడంలోనూ వారికి శిక్షణ ఇస్తున్నాయి. పంట పొలాల్లో పురుగు మందులను పిచికారీ చేసేందుకు డ్రోన్లను వినియోగించడంపై మహిళలకు తర్ఫీదునిస్తున్నాయి. అంతేకాదు.. 80 శాతం సబ్సిడీ ఇస్తూ మహిళలు వాటిని కొనుగోలు చేసేందుకూ అవకాశం కల్పిస్తున్నాయి. పంటలకు పురుగు మందుల పిచికారీలో అధునాతన ఆవిష్కరణ అయిన డ్రోన్‌ను వినియోగించాలని శాస్త్రవేత్తలు నిర్ణయించిన నేపథ్యంలో.. ఇందులో స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలను భాగస్వాములను చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘నమో డ్రోన్ దీదీ’ పేరిట పథకాన్ని చేపట్టింది. ఎస్‌హెచ్‌జీ సభ్యులకు డ్రోన్ ఆపరేటింగ్‌పై శిక్షణ ఇచ్చి ఆదాయం లభించేలా చేయడం, వ్యవసాయంలో సాంకేతికత, యాంత్రీకరణ ద్వారా పని భారాన్ని, పెట్టుబడి వ్యయాన్ని గణనీయంగా తగ్గించడమే ఈ పథకం ఉద్దేశం. ఇందులో భాగంగా రాష్ట్రంలోనే తొలిసారిగా సంగారెడ్డి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో హెటిరో గ్రూప్ సౌజన్యంతో మహిళలకు శిక్షణ కార్యక్రమం చేపట్టారు. జోగిపేటలోని మహిళా సమాఖ్య భవనంలో 9 రోజులపాటు డ్రోన్ నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. ఫ్లయింగ్ వెడ్జ్ (డ్రోన్ ఆపరేటింగ్), సింక్రో (టెక్నికల్ సపోర్ట్) అనే రెండు సంస్థల సహకారంతో హెటిరో డ్రగ్స్ పరిశ్రమ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాలోని 10 మండలాలకు చెందిన 50 మంది స్వయం సహాయక సంఘాల మహిళలు ఈ శిక్షణలో పాల్గొన్నారు. మార్చి 20న జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి శిక్షణను ప్రారంభించారు. మార్చి నెలాఖరు వరకు కొనసాగిన ఈ శిక్షణలో డ్రోన్ ఫ్లయింగ్‌పై సైద్ధాంతిక, ఆచరణాత్మక శిక్షణ ఇచ్చారు. తొమ్మిది రోజుల శిక్షణలో తొలుత డ్రోన్ గురించి పూర్తి పరిజ్ఞానాన్ని మహిళలకు వివరించారు. అనంతరం పంట పొలాల వద్దకు తీసుకెళ్లి.. డ్రోన్ ఎగుర వేయడంపై క్షేత్రస్థాయిలో తర్ఫీదు ఇచ్చారు.
80 శాతం సబ్సిడీతో డ్రోన్లు..
‘నమో డ్రోన్ దీదీ’ పథకం కింద శిక్షణ పొందిన మహిళలకు డ్రోన్ కొనుగోలు చేసే అవకాశం కూడా ప్రభుత్వం కల్పిస్తోంది. రూ.10 లక్షల విలువైన డ్రోన్‌ను బ్యాంకు రుణం ద్వారా కొనుగోలు చేసే వీలు కల్పిస్తూ.. అందులో 80 శాతం సబ్సిడీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వనున్నాయి. మిగిలిన రూ.2 లక్షల రుణ మొత్తాన్ని వాయిదాల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. కాగా, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి చొరవ చూపి ప్రభుత్వ నిధులతో 10 డ్రోన్లను కొనుగోలు చేసి వాటి ద్వారా మహిళలకు శిక్షణ ఇప్పించారు. శిక్షణలో పాల్గొన్న వారినుంచి ఔత్సాహికులైన 20 మంది మహిళలను ఎంపిక చేసి ఈ డ్రోన్‌లను వారికి ఇవ్వనున్నారు. ఒక్కో డ్రోన్ ద్వారా ఒకరు ఆపరేటర్‌గా, మరొకరు సహాయకురాలిగా వ్యవహరిస్తూ ఇద్దరు మహిళలు ఉపాధి పొందే వీలుంటుంది. డ్రోన్లతో పండ్ల తోటలు, కూరగాయల సాగు, పత్తి, లాంటి పంటలకూ మందులు పిచికారీ చేయడం, ద్రవరూపంలోని ఎరువులు వేయవచ్చు. దీంతో ఏడాది పొడవునా పనులు దొరుకుతాయి. కాగా, డ్రోన్ నడపడం ఎంతో ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని శిక్షణ పొందిన బేగరి అనిత అనే మహిళ అన్నారు. డ్రోన్ నడపడం ద్వారా.. దానికోసం దీసుకున్న రుణం వాయిదా, ఖర్చులు పోను నెలకు రూ.లక్ష దాకా ఆదాయం పొందే అవకాశం ఉంటుందన్నారు.
ఇవి కూడా చదవండి:
Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కి మరో దెబ్బ.. అమెరికా వస్తువులపై కూడా 34% సుంకం..
Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..
Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు
Read More Business News and Latest Telugu News