Share News

Hyderabad: ‘హైదరాబాద్‌ ఎమ్మెల్సీ’కి తప్పని పోరు!

ABN , Publish Date - Apr 05 , 2025 | 04:43 AM

రెండు దశాబ్దాలుగా ఏకగ్రీవంగా ఎన్నిక జరుగుతున్న హైదరాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఈసారి పోరు అనివార్యంగా మారింది.

Hyderabad: ‘హైదరాబాద్‌ ఎమ్మెల్సీ’కి తప్పని పోరు!

  • బరిలో ఎంఐఎం, బీజేపీతోపాటు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు

  • 23న పోలింగ్‌.. గెలుపుపై ఎంఐఎం ధీమా

  • బలం లేకున్నా బరిలో బీజేపీ

  • పోటీకి దూరంగా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌

  • వారి ఓట్లు ఎటువైపు అనే దానిపై ఆసక్తి

  • గులాంగిరీ చేసే వారికే పోస్టులు, టికెట్లా?

  • సీనియర్‌, సిన్సియర్‌ నేతలను ఇప్పటికైనా గుర్తించాలి: రాజాసింగ్‌

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): రెండు దశాబ్దాలుగా ఏకగ్రీవంగా ఎన్నిక జరుగుతున్న హైదరాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఈసారి పోరు అనివార్యంగా మారింది. బీజేపీ అభ్యర్థిగా విజ్ఞానభారతి విద్యా సంస్థల చైర్మన్‌ ఎన్‌.గౌతమ్‌రావు, ఎంఐఎం అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ మిర్జా రియాజుల్‌ ఎఫెండీ శుక్రవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఇంతకు ముందే స్వతంత్ర అభ్యర్థులుగా కంటె సాయన్న, చంద్రశేఖర్‌ చాలిక కూడా నామినేషన్లు వేశారు. మొత్తంగా ఇప్పటివరకు నాలుగు నామినేషన్లు వచ్చాయి. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 9వ తేదీవరకు గడువు ఉంది. 23న పోలింగ్‌, 25న ఓట్ల లెక్కింపు జరుగుతాయి. ఈ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో కార్పొరేటర్లతోపాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కలిపి 112 మంది ఓటర్లు ఉన్నారు.


ఇందులో ఎంఐఎంకు 40 మంది కార్పొరేటర్లు, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్సీ, ఏడుగురు ఎమ్మెల్యేలు కలసి 49 మంది ఓటర్లున్నారు. బీజేపీకి రాజ్యసభ సభ్యుడితో కలిపి నలుగురు ఎంపీలు, ఒక ఎమ్మెల్సీ, ఒక ఎమ్మెల్యే, 19 మంది కార్పొరేటర్లు కలిపి 25 మంది ఓటర్లు ఉన్నారు. ఇద్దరు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, ఐదుగురు ఎమ్మెల్యేలు, 15 మంది కార్పొరేటర్లతో కలిపి బీఆర్‌ఎ్‌సకు 24 మంది.. ఒక ఎంపీ, నలుగురు ఎమ్మెల్సీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఏడుగురు కార్పొరేటర్లతో కలిపి 14 మంది కాంగ్రెస్‌ ఓటర్లున్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పోటీకి దూరంగా ఉండగా.. సరిపడా బలం లేకున్నా బీజేపీ వ్యూహాత్మకంగా బరిలో నిలిచింది. ఈ క్రమంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ వైఖరి ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు మజ్లి్‌సకే అత్యధిక సంఖ్యలో ఓటర్లు ఉండటంతో.. తమ అభ్యర్థి ఎన్నిక లాంఛనమే అన్న ధీమాలో ఆ పార్టీ ఉంది.


టేబుళ్లు తుడిచే వారికే టికెట్లా?: రాజాసింగ్‌

పార్టీలో పార్లమెంట్‌ సభ్యుల అనుచరులకే పదవులు కట్టబెడుతున్నారని.. మిగతా సీనియర్‌ నేతలు, కార్యాకర్తలు కనిపించడం లేదా అని బీజేపీ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు వ్యక్తులకు గులాంగిరీ చేసేవారికి, సీనియర్‌ నేత ఆఫీసు టేబుల్‌ శుభ్రం చేసేవారికి పోస్టులు, టికెట్లు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా పార్టీలో సీనియర్‌, సిన్సియర్‌ నాయకులను గుర్తించాలని.. కొందరు సీనియర్‌ నాయకులను పాత సామానులా బయటికి పంపించేయాలని వ్యాఖ్యానించారు.

Updated Date - Apr 05 , 2025 | 04:43 AM