Organic Farming: సేంద్రియ సాగుతో ప్రకృతి సంరక్షణ
ABN , Publish Date - Apr 05 , 2025 | 04:50 AM
సేంద్రియ సాగుతో భూసారాన్ని కాపాడుకోవడమే కాక ప్రకృతిని సంరక్షించుకోవచ్చునని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. పరిశోధకులు, పారిశ్రామికవేత్తలు సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.

వ్యవసాయ యంత్రాల ఆవిష్కరణలు అవసరం
ప్రకృతి-సేంద్రియ రైతు సమ్మేళనంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
వ్యవసాయ యంత్రాల తయారీదారులను రాజ్‌భవన్‌లో సత్కరిస్తామని వెల్లడి
శంకర్‌పల్లి, ఏఫ్రిల్ 4(ఆంధ్రజ్యోతి): సేంద్రియ సాగుతో భూసారాన్ని కాపాడుకోవడమే కాక ప్రకృతిని సంరక్షించుకోవచ్చునని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. పరిశోధకులు, పారిశ్రామికవేత్తలు సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో శుక్రవారం జరిగిన రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ప్రకృతి మరియు సేంద్రీయ రైతు సమ్మేళనం-2025కు గవర్నర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సమ్మేళనంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ యంత్రాల స్టాళ్లను సందర్శించి, యంత్రాలను పరిశీలించారు. అనంతరం రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. గత డిసెంబరులో మెదక్‌లోని కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించినప్పుడు సేంద్రియ వ్యవసాయం కోసం ఎంతో తెలుసుకున్నానని గవర్నర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. వ్యవసాయ యంత్రాల ఆవిష్కరణలు విస్తృతంగా జరగాలని ఆకాంక్షించారు. సేంద్రియ వ్యవసాయాన్ని అనుసరించి సత్ఫలితాలు సాధించిన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, గుజరాత్ ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు తెలంగాణకు ఆదర్శం అన్నారు.
ప్రకృతి ఆధారిత సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పిస్తున్న ఏకలవ్య ఫౌండేషన్ సభ్యులను అభినందించారు. వికారాబాద్ జిల్లా జినుగుర్తిలో వ్యవసాయ పాలిటెక్నిక్ కశాశాలలో సేంద్రియ పద్ధతులను రాబోయే తరాలకు నేర్పిస్తున్నారని చెప్పారు. తెలంగాణ గ్రామీణ వికాస కేంద్రం వారు రసాయనాలు లేకుండా వనమూలికలతో షాంపు, సబ్బులు, ఫినాయిల్ వంటివి తయారు చేస్తున్నారని వివరించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 25 మండలాలలోని 650 మంది రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించడంలో ఏకలవ్య గ్రామీణ వికాస కేంద్రం సఫలీక ృతమైందని అభినందించారు. పోచంపల్లిలోని చేనేత కార్మికుల కోసం చింతకింది మల్లేశం నూతన యంత్రాన్ని తయారు చేసి వారికి బాసటగా నిలిచారని గవర్నర్ పేర్కొన్నారు. కాగా, నూతన వ్యవసాయ యంత్రాలను తయారు చేసిన వారిని ఏడాదికోసారి రాజ్‌భవన్‌లో సత్కరించాలని విశ్రాంత బ్రిగేడియర్ గణేశం ఈ సందర్భంగా చేసిన ప్రతిపాదనకు గవర్నర్ సానుకూలంగా స్పందించారు.