Share News

రాజీవ్‌ యువ వికాసం సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Mar 26 , 2025 | 11:44 PM

ప్రభుత్వం యువత ఉపాధి కోసం ప్రవేశపెట్టిన రాజీవ్‌ యువ వికాసం పథకాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ విజయేందిర బోయి అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ మండల కేంద్రంలోని పదవ తరగతి పరీక్ష కేంద్రాలను కలెక్టర్‌ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

రాజీవ్‌ యువ వికాసం సద్వినియోగం చేసుకోవాలి
రాజీవ్‌ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన వారితో మాట్లాడుతున్న కలెక్టర్‌

కలెక్టర్‌ విజయేందిర బోయి

మిడ్జిల్‌, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం యువత ఉపాధి కోసం ప్రవేశపెట్టిన రాజీవ్‌ యువ వికాసం పథకాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ విజయేందిర బోయి అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ మండల కేంద్రంలోని పదవ తరగతి పరీక్ష కేంద్రాలను కలెక్టర్‌ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు కల్పిస్తున్న వసతుల గురించి ఆరా తీశారు. జిల్లా పరిషత్‌ పాఠశాల ప్రహరీ వద్ద అధికంగా పార్కింగ్‌ చేసిన ద్విచక్ర వాహనాల గురించి అక్కడే ఉన్న ఎస్‌ఐ శివనాగేశ్వర్‌నాయుడిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలని అధికారులకు చెప్పారు. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. వంట గది వద్ద పరిశుభ్రతను పాటించాలన్నారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయంలో మండల అధికారులతో సమీక్ష చేశారు. వేసవిలో ప్రజలకు తాగునీరు, విద్యుత్‌ సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. శాఖల వారీగా జరుగుతున్న పనుల గురించి ఆరా తీశారు. మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో సర్వే నెంబర్‌ 36లో గల 16 గుంటల భూమికి నష్టపరిహారం చెల్లించాలని, అదే విధంగా సర్వే నెం 10లో నష్ట పరిహారంగా ఇస్తానన్న 5 గుంటల భూమిని వెంటనే తమ పేరుమీద చేయాలని పల్లె పెద్ద జంగయ్య, పల్లె శ్రీను, పల్లె తిరుపతి కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు. స్పందించిన కలెక్టర్‌ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. తహసీల్దార్‌, ఎంపీడీవో కార్యాలయాల ఆవరణలో ఉన్న డబ్బాలను తొలగించే ముందు వారికి ప్రత్యా మ్నాయంగా స్థలం చూపించాలని పలువురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. ఎంపీడీవో కార్యాలయం గోడలకు ఉన్న మర్రి చెట్లను తొలగించాలని, తహసీల్దార్‌ కార్యలయం, ఎంపీడీవో కార్యాలయం ప్రహరీ నిర్మాణానికి ఎస్టిమేషన్‌ వేయాలని పీఆర్‌ఏఈ అశ్రుత్‌రాయ్‌ని ఆదేశించారు. కలెక్టర్‌ వెంట సీసీ రాధాకృష్ణ, తహసీల్దార్‌ రాజు, ఎస్‌ఐ శివనాగేశ్వర్‌నాయుడు, ఎంపీడీవో గీతాంజలి, ఏవో సిద్ధార్థ, ఎంఈవో వెంకటయ్య, ఎంపీవో జగదీశ్వర్‌, డాక్టర్‌ శివకాంత్‌, వెటర్నరీ డాక్టర్‌ శివరాజ్‌, ఆర్‌ఐ అంబిక ఉన్నారు.

Updated Date - Mar 26 , 2025 | 11:44 PM