భక్తి శ్రద్ధలతో రంజాన్
ABN , Publish Date - Mar 31 , 2025 | 11:46 PM
నెల రోజుల ఉపవాసాల అనంతరం ముస్లింలు సోమవారం రంజాన్ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. ఉదయమే జిల్లా వ్యాప్తంగా నమాజులు చేశారు. మసీదులు, ఈద్గాల వద్ద సామూహిక ప్రార్థనలు చేపట్టారు.

కిటకిటలాడిన ఈద్గా మైదానాలు
మహబూబ్‌నగర్ అర్బన్, మార్చి 31(ఆంధ్రజ్యోతి): నెల రోజుల ఉపవాసాల అనంతరం ముస్లింలు సోమవారం రంజాన్ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. ఉదయమే జిల్లా వ్యాప్తంగా నమాజులు చేశారు. మసీదులు, ఈద్గాల వద్ద సామూహిక ప్రార్థనలు చేపట్టారు. మసీదులు, ఈద్గాలకు ముస్లింలు తరలిరావడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. మత సామరస్యానికి ప్రతీకగా పలు చోట్ల హిందువులు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.
శుభాకాంక్షలు తెలిపిన ప్రజా ప్రతినిధులు..
మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి వానగుట్ట ఈద్గా వద్ద ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ తెలంగాణ రాతను మార్చుకున్నామని, అలాగే భారతదేశ తలరాతను మార్చుకునేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. మహబూబ్‌నగర్ ప్రేమ, ఆప్యాయతలకు నిలయమని, అందరూ కలిసి మెలిసి సోదరభావాన్ని చాటాలన్నారు. మాజీ మంత్రి వి.శ్రీనివా్‌సగౌడ్ మాట్లాడుతూ హిందూ ముస్లింలు గంగా జమున తెహజీబ్‌లా జీవనం సాగిస్తున్నారని గుర్తు చేశారు. ఏఐసీసీ వంశీచంద్‌రెడ్డి మాట్లాడుతూ భారత దేశం హిందూ, ముస్లింల ఐక్యతకు ప్రతీక అని, ఒకరి పండుగ ఒకరు జరుపుకొని ఐక్యతను చాటాలన్నారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, మునిసిపల్ మాజీ చైర్మన్ ఆనంద్‌కుమార్‌గౌడ్ తదితరులు ఉన్నారు.