Share News

రాజకీయ ఆధిపత్యం కోసమే చక్రయ్య హత్య

ABN , Publish Date - Mar 25 , 2025 | 12:13 AM

సూర్యాపేట జిల్లా నూతనకల్‌ మండలం మిర్యాల గ్రామంలో ఇటీవల జరిగిన మాజీ సర్పంచ మెంచు చక్రయ్య హత్య కేసులో ప్రధాన సూత్రదారి అల్లుడేనని పోలీసులు గుర్తించారు.

రాజకీయ ఆధిపత్యం కోసమే చక్రయ్య హత్య
నిందితుల వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ నర్సింహ, పక్క డీఎస్పీ రవి

ఘటనలో 13మంది అరెస్టు

హత్యకు అల్లుడే ప్రధాన సూత్రదారి

సూర్యాపేట క్రైం, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లా నూతనకల్‌ మండలం మిర్యాల గ్రామంలో ఇటీవల జరిగిన మాజీ సర్పంచ మెంచు చక్రయ్య హత్య కేసులో ప్రధాన సూత్రదారి అల్లుడేనని పోలీసులు గుర్తించారు. గ్రామంలో రాజకీయ ఆధిపత్యం కోసం ఈ హత్య జరిగిందని పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో 13మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం జిల్లా పోలీస్‌ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలను ఎస్పీ కొత్తపల్లి నర్సింహ వెల్లడించారు. మిర్యాల గ్రామానికి చెందిన మెంచు చక్రయ్య గతంలో కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో సర్పంచగా విజయం సాధించారు. అనంతరం టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత తన మూడో కుమార్తె కనకటి సునీతకు మద్దతు, సహకారం ఇచ్చి 2018లో గ్రామ సర్పంచగా గెలిపించారు. తర్వాత 2020లో అల్లుడు కనకటి వెంకన్నకు సహకరించి నూతనకల్‌ పీఏసీఎస్‌ చైర్మనగా ఎన్నిక చేశారు. పీఏసీఎ్‌సగా చైర్మన పదవి రావడంతో అల్లుడు బీఆర్‌ఎ్‌సలో మండల నాయకుడిగా ఎదిగాడు. ఈ నేపథ్యంలో చక్రయ్య, వెంకన్న మధ్య పలుమార్లు బేదాభిప్రాయాలు వచ్చాయి. దీంతో చక్రయ్య 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్‌ఎ్‌సను వీడి తిరిగి కాంగ్రె్‌సలో చేరాడు. వెంకన్న మాత్రం బీఆర్‌ఎ్‌సలోనే ఉన్నాడు. ఎన్నికల అనంతరం ఇద్దరి మధ్య గ్రామంలో స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి. 2023లో వెంకన్న ఆధ్వర్యంలో బొడ్రాయిని ప్రతిష్ఠించారు. ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే అల్లుడు వెంకన్న కూడా కాంగ్రె్‌సలో చేరాడు. అయితే గ్రామంలో మాత్రం చక్రయ్య ఆధిపత్యమే ఉంది. 2024 మార్చి 13న గ్రామంలో బొడ్రాయి రెండో వార్షికోత్సవం వెంకన్న ఆధ్వర్యంలో జరిగింది. ఈ ఏడాది మార్చిలో మాత్రం బొడ్రాయి పండుగ మూడో వార్షికోత్సవాన్ని అల్లుడు వెంకన్న సమాచారం ఇవ్వకుండా చక్రయ్య నిర్వహించారు. దీంతో ఆగ్రహంతో వెంకన్న ఉన్న చక్రయ్యను హతమార్చాలని తన కుటుంబ సభ్యులు, అనుచ రులతో కలిసి ఈ నెల 13వ తేదీన కుట్ర పన్నాడు. ఈ నెల 17న చక్రయ్య తన పొలం వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా వెంకన్న ప్రధాన అనుచరులైన కనకటి శ్రవణ్‌, కనకటి లింగయ్య, కనకటి శ్రీకాంత, గంధసిరి వెంకటేష్‌, కనకటి ఉప్పలయ్య, పెద్దింటి మధు, పెద్దింటి గణేష్‌ కలిసి చక్రయ్యను కర్రలు, ఇతర మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారు. హత్యకు సంబంధించి మృతుడు చక్రయ్య కుమార్తె గునగంటి అనిత ఫిర్యాదు మేరకు పలువురు అనుమానితులపై కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు గ్రామం నుంచి పరారై సోమవారం రెండు కార్లలో తుంగతుర్తికి వస్తూ వెలుగుపల్లి వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు పట్టుబడ్డారు. నిందితులను విచారించగా చక్రయ్యను హత్య చేయించింది తామేనని అంగీకరించారు. చక్రయ్యను హతమార్చిన వెంటనే నిందితులు తమ సెల్‌ఫోన్లను పారేసి, కొత్త సిమ్‌కార్డులు, ఫోన్లు కొనుగోలు చేసి వినియోగించుకున్నారు. మరిచిపోకుండా ఓ కాగితంపై రాసి పెట్టుకున్నారు. ఈ హత్య కేసులో13మందిని అరెస్టుచేసి, నిందితుల నుంచి రెండు కార్లు, 10సెల్‌ఫోన్లతో పాటు నూతన సెల్‌ఫోన నెంబర్లు రాసిపెట్టుకున్న పేపర్‌ను స్వాధీనం చేసుకుని కోర్టుకు రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న కనకటి శ్రవణ్‌, కనకటి లింగయ్య, కనకటి శ్రీకాంత, గంధసిరి వెంకటేష్‌, పెద్దింటి మధు, పెద్దింటి గణే్‌షలు ఇటీవల తుంగతుర్తి కోర్టులో లొంగిపోయారన్నారు. మిర్యాల గ్రామానికి చెందిన పీఏసీఎస్‌ మాజీ చైర్మన కనకటి వెంకన్నపై గతంలో అనేక కేసులు ఉన్నాయని, అదేవిధంగా రౌడీషీట్‌ ఉందన్నారు. గ్రామంలో వెంకన్న పలువురిని బెదిరించి భూమిని బలవంతంగా తీసుకున్నట్లు తనకు సమాచారముందని, బాధితులు ఫిర్యాదుచేస్తే విచారించి న్యాయం చేస్తామన్నారు. సమావేశంలో డీఎస్పీ గొల్లూరి రవి, తుంగతుర్తి సీఐ శ్రీనునాయక్‌, నూతనకల్‌ ఎస్‌ఐ మహేంద్రనాథ్‌, సిబ్బంది గోదేశి కర్ణాకర్‌, జోగు సైదులు, సందీప్‌ తదితరులు ఉన్నారు.

హత్య కేసులో కుటుంబ సభ్యులు

మిర్యాల గ్రామ మాజీ సర్పంచ మెంచు చక్రయ్య హత్య కేసులో నిందితుల్లో మృతుడి కుటుంబ సభ్యులు ఉన్నారు. చక్రయ్య పెద్ద కుమార్తె కనకటి స్వరూప, ఆమె భర్త ఉప్పలయ్య, కుమారుడు శ్రవణ్‌, మూడో కుమార్తె కనకటి సునీత ఆమె భర్త కనకటి వెంకన్న, వారి కుమార్తె శ్రావ్య, ఐదో కుమార్తె కనకటి కల్యాణి ఆమె భర్త లింగయ్య, చక్రయ్య పెద్ద కుమార్తె స్వరూప కుమార్తె అనూష, పెద్ద కుమార్తె స్వరూప, కుమారుడు శ్రవణ్‌ ఈ హత్య కేసులో నిందితులుగా ఉన్నారు.

Updated Date - Mar 25 , 2025 | 12:13 AM