Share News

ఆదమరిస్తే కన్నీరే

ABN , Publish Date - Mar 20 , 2025 | 12:54 AM

హైదరాబాద్‌ -వరంగల్‌ జాతీయ రహదారిని ఆనుకుని 60 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న బీబీనగర్‌ చెరువు ప్రజలకు ఆదరవే కాదు. ఆదమరిస్తే ప్రాణాలు తీసేంత ప్రమాదకారి కూడా.

ఆదమరిస్తే కన్నీరే
గూడూరు శివారులో ఇద్దరు యువకుల ప్రాణాలు బలిగొన్న చిన్నేటి వాగులోని నీటి కుంట

ఆహ్లాదానికి నీటివనరుల వద్దకు విద్యార్థులు, యువత

చెరువులు, వాగుల్లో పొంచి ఉన్న గుంతలు

కన్నీటి జ్ఞాపకాలను మిగుల్చుతున్న ఘటనలు

ఈత సరదా కాకూడదు విషాదం

(ఆంధ్రజ్యోతి-బీబీనగర్‌)

హైదరాబాద్‌ -వరంగల్‌ జాతీయ రహదారిని ఆనుకుని 60 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న బీబీనగర్‌ చెరువు ప్రజలకు ఆదరవే కాదు. ఆదమరిస్తే ప్రాణాలు తీసేంత ప్రమాదకారి కూడా. రోడ్డు వెంట ప్రయాణించే వాహనాదారులు చెరువులో ఈత కొట్టేందుకు, స్నానం చేసేందుకు ఆసక్తి చూపుతారు. అయితే అలా చెరువులో సరదా కోసం ఈతకు వెళ్లిన ఎంతోమంది యువకులను తనలో ముంచేసుకుని ప్రాణాలు తీసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. చెరువు లోతైన గోతులు, నీటితో నిండి ఉంది. ఎవరైనా తెలియక చెరువులోకి దిగితే ప్రాణాలు కబలించే ప్రమాదం లేకపోలేదు. అయినా ఇక్కడ ప్రమాద హెచ్చరికలు ఏర్పాటుచేయడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. దాంతో గడిచిన పదేళ్లలో 18మందికి పైగా యువకులు నీటిలో మునిగి చనిపోయారు.

పెళ్లింట విషాదం..

హైదరాబాద్‌లోని ఓల్డ్‌ మలక్‌పేట ప్రాంతానికి చెందిన పాపగల్ల దశరథ కుమార్తె స్వాతిని అక్క కుమారుడు నర్సింగ్‌రావు(28)కు ఇచ్చి 2009 మార్చి 28న యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి సన్నిధిలో వివాహం జరిపించారు. రోజంతా అక్కడే గడిపి మరుసటి రోజు రెండు కుటుంబాలు ట్రాలీ ఆటోలో మలక్‌పేటకు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో బీబీనగర్‌ చెరువు వద్ద ఆటో టైరు పంక్చర్‌ కావడంతో టైరు మార్చేందుకు ఆపారు. ఆలోగా చెరువులోకి వెళ్లి స్నానం చేసి వద్దామని నవవరుడు నర్సింగ్‌రావు, అతడి బావ బుజన చెరువులోకి వెళ్లారు. వీళ్లు దిగిన చోట లోతైన గుంతలు ఉండటంతో మునిగిపోతూ పైకి చేతులెత్తి సైగ చేశారు. అదే సమయంలో అక్కడే స్నానం చేస్తున్న హైదరాబాద్‌ యూసు్‌ఫగూడ కృపానగర్‌కు చెందిన ఆవుల ప్రవీణ్‌కుమార్‌ వారిని కాపాడేందుకు దగ్గరకు వెళ్లగా నీటిలో మునిగిపోతున్న ఇద్దరు ప్రాణభయంతో ప్రవీణ్‌కుమార్‌ను గట్టిగా హత్తుకున్నారు. ఊపిరాడక ముగ్గురు నీటిలో మునిగి చనిపోయారు. అప్పటి వరకు పెళ్లి సంబరాలలో మునిగి తేలుతున్న ఆ కుటుంబాల్లో విషాదం నెలకొన్నది. నవవధువు స్వాతి పెళ్లి అయిన మరుసటి రోజే భర్తను కోల్పోయి కన్నీరు మున్నీరైంది. ఇద్దరు యువకుల ప్రాణాలను కాపాడబోయి మృతి చెందిన ప్రవీణ్‌ కుటుంబం, చేతికొచ్చిన కుమారుడిని కోల్పోయి పుత్రశోకం మిగిలింది.

ప్రాణాలు తీసిన ఈర సరదా ..

భువనగిరి పట్టణంలోని ఆర్‌బీనగర్‌కు చెందిన మేడిగ భాస్కర్‌, మాధవి దంపతుల కుమారుడు సాయినిఖిల్‌(15), కిసాననగర్‌కు చెందిన సోమారపు నర్సింహ, సంధ్య దంపతుల కుమారుడు సాయికుమార్‌(15) స్థానిక ప్రెసిడెన్సీ హైస్కూల్‌లో 10వ తరగతి చదువుతున్నారు. 2016 అక్టోబరు 23న స్నేహితుడు రేపాల రంజిత పుట్టినరోజున ఆనందంగా గడిపేందుకు బీబీనగర్‌ మండలం గూడూరు గ్రామానికి చెందిన క్లాస్‌మెంట్‌ ఇంటికి 11మంది స్నేహితులతో వచ్చారు. ఊరు సమీపంలోని చిన్నేటి వాగు వద్ద వారు ఆహ్లాదంగా గడిపారు. అక్కడే వాగులో ఓ నీటి గుంతలో స్నానం చేసేందుకు సాయినిఖిల్‌, సాయికుమార్‌ వాగులో దిగారు. ఆ ప్రదేశం లోతు ఎక్కువగా ఉండడంతో ఇద్దరూ నీటి మునిగారు. తోటి విద్యార్థులు కాపాడే ప్రయత్నం చేసినా వారిలో ఏ ఒక్కరికీ ఈత రాక లోపలికి వెళ్లలేకపోయారు. దాంతో సాయికుమార్‌, సాయినిఖిల్‌ ఇద్దరు నీటమునిగి మృతి చెందారు. దీంతో రెండు కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది

ఆదరువు కోల్పోయారు

(ఆంధ్రజ్యోతి-డిండి)

చేతికంది వస్తోన్న పిల్లలు. ఇంటితో పాటు భవిష్యతకు భరోసాగా కనిపిస్తున్న వారు నీట మునిగి కన్నీటిని జ్ఞాపకాలుగా మిగిలిపోయారు. సరదా కోసం డిండి రిజర్వాయర్‌కు వెళ్లిన అన్నదమ్ముల పిల్లలు నలుగురూ మునిగి ఆయాకుటుంబాల్లో తీరని దుఃఖాన్ని మిగిల్చారు. నల్లగొండ జిల్లా డిండి మండలకేంద్రానికి చెందిన దౌపది కర్ణాకర్‌రెడ్డి, అనిత దంపతులకు జోత్స్న, దేవమణి ఇద్దరు కుమార్తెలు. కాగా ఆయన సోదరుడు దౌపది దత్తారెడ్డికి హర్షవర్ధనరెడ్డి, ప్రణీతరెడ్డి ఇద్దరు కుమారులు. తమ తాత కర్మకాండకు వచ్చి ఈ నలుగురు పిల్లలు 30 జూలై 2014లో డిండి రిజర్వాయర్‌ బ్యాక్‌వాటర్‌లో మునిగిచనిపోయారు.మొదట జోత్స్న, దేవమణి నీటిలో ముందుకు వెళ్లి మునిగిపోతుండటంతో వారిని కాపాడే ప్రయత్నంలో ప్రణీతరెడ్డి, హర్షవర్ధనరెడ్డి నీటమునిగారు. ఈ ఘటన ఆయా కుటుంబాల్లో చెరగని జ్ఞాపకాలను మిగిల్చింది.

ఉద్యోగాలు చేస్తున్న కుమారులు ప్రణీతరెడ్డి, హర్షవర్ధనరెడ్డి నీటమునిగి చనిపోవడంతో వారి తల్లిదండ్రులు మానసిక వేదనతో మృతి చెందారు. ప్రమాదం అనంతరం రిజర్వాయర్‌ వద్ద నీటిపారుదల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. మట్టి తవ్వకాలను నిషేధించడంతో పాటు హెచ్చరిక బోర్డులతో పాటు ఎర్త్‌ డ్యాంపై ఇనుప జాలిని ఏర్పాటు చేశారు.

కదిలిస్తే కన్నీరే

చనిపోయిన పిల్లల తల్లిదండ్రులను పలకరిస్తే వారి కళ్లలో కన్నీటి సుడులు తిరిగాయి. ఆనాటి దుర్ఘటనను ‘ఆంధ్రజ్యోతి’తో గుర్తుచేసుకుంటూ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇద్దరు కుమార్తెలు బాగా చదువుకొని కుమారుల్లేని లోటు తీరుస్తారని అనుకున్నాం. కానీ ఆ చెరువు మా పిల్లలను పొట్టన పెట్టుకుందని బాలికల తండ్రి కర్ణాకర్‌రెడ్డి, అనితలు కన్నీటి పర్యంతమయ్యారు. టైలర్‌ వృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్న కర్ణాకర్‌రెడ్డికి ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటును అందించలేదు.

Updated Date - Mar 20 , 2025 | 12:54 AM