మేలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనుల పునఃప్రారంభం!
ABN , Publish Date - Apr 06 , 2025 | 11:42 PM
ఎస్‌ఎల్‌బీసీ సొరంగమార్గం పనులు మే నెలలో పునఃప్రార ంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అవుట్‌లెట్‌లో పెండింగ్ ఉన్న సొరంగమార్గాన్ని టీబీఎం (టన్నెల్ బోరింగ్ మిషన్) ద్వారానే కొనసాగించాలని తాజాగా, ఈ నెల 5న జరిగిన సమీక్షలో నీటిపారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. మంత్రి ఆదేశంతో ఈ పనుల పునరుద్ధరణకు అవసరమైన కార్యాచరణ వేగంగా కొనసాగించాలని ఏజెన్సీకి ఎస్‌ఎల్‌బీసీ అధికారులు సూచించారు.

టీబీఎం ద్వారా అవుట్‌లెట్ పనులు ప్రారంభించాలని ప్రభుత్వ నిర్ణయం
నెలాఖరులోగా మన్నెవారిపల్లికి చేరనున్న టీబీఎం బేరింగ్, ఇతర సామగ్రి
అవుట్‌లెట్‌వైపు టీబీఎం ద్వారానే పనులు కొనసాగించాలని మంత్రి ఉత్తమ్ స్పష్టీకరణ
సహాయక చర్యలు పూర్తయ్యాక ఇన్‌లెట్ వైపు డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ విధానంలో పనులు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి,నల్లగొండ) : ఎస్‌ఎల్‌బీసీ సొరంగమార్గం పనులు మే నెలలో పునఃప్రార ంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అవుట్‌లెట్‌లో పెండింగ్ ఉన్న సొరంగమార్గాన్ని టీబీఎం (టన్నెల్ బోరింగ్ మిషన్) ద్వారానే కొనసాగించాలని తాజాగా, ఈ నెల 5న జరిగిన సమీక్షలో నీటిపారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. మంత్రి ఆదేశంతో ఈ పనుల పునరుద్ధరణకు అవసరమైన కార్యాచరణ వేగంగా కొనసాగించాలని ఏజెన్సీకి ఎస్‌ఎల్‌బీసీ అధికారులు సూచించారు.
ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గం పనుల పునఃప్రారంభానికి అవసరమైన బేరింగ్ ఇప్పటికే చెన్నై పోర్ట్‌కు చేరుకోగా, ఈ నెలాఖరులోగా అది మన్నెవారిపల్లికి చేరుతుందని కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఇన్‌లెట్ వైపున ఫిబ్రవరి 22న జరిగిన ప్రమాదంలో టన్నెల్ కూలిపోగా, అక్కడ 42 రోజులుగా సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యలు పూర్తయ్యేందుకు మరో నెల సమయం పట్టే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. సహాయక చర్యలు పూర్తయ్యాక, ఇన్‌లెట్ వైపున డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ విధానంలో పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతించింది. ఇన్‌లెట్‌లో టన్నెల్ కూలిన ఘటన, బేరింగ్ రావడంలో జాప్యం తో పనుల పూర్తికి ప్రభుత్వం నిర్ణయించిన గడువు కంటే మరో ఏడాది పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
అవుట్‌లెట్ వైపు 3.545కిలోమీటర్లు
మన్నేవారిపల్లి నుంచి (నీరు విడుదలయ్యే వైపు) చేపట్టిన అవుట్‌లెట్ టన్నెల్ 23.980కిలోమీటర్లకు ఇప్పటి వరకు 20.435 కిలోమీటర్ల తవ్వకం పూర్తయింది. ఇంకా 3.545 కిలోమీటర్లు మా త్రమే సొరంగ మార్గం తవ్వాల్సి ఉంది. పూర్తి విదేశీ సాంకేతి క పరిజ్ఞానంతో టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం) ద్వారా ఈ పను లు చేపట్టారు. ఈ యంత్రం ఎలాంటి ఆటంకాల్లేకుండా పనిచేస్తే ఏడాది కాలంలో అవుట్‌లెట్ పనులను పూర్తిచేయవచ్చని ఎస్‌ఎల్‌బీసీ ఇంజనీర్లు చెబుతున్నారు. అయితే టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం) మరమ్మతుకు గురైతే పరికరాలు, బేరింగుల కోసం సం వత్సరాల తరబడి వేచి రావాల్సి ఉండటంతో పనులకు తీవ్రస్థాయిలో ఆటంకం కలుగుతోంది. టీబీఎంలో కీలకమైన బేరింగ్ ఇప్పటికే మూడోసారి మరమ్మతుకు గురికాగా, పనులు నిలిచిపోయా యి. ఏడుమీటర్ల వ్యాసంతో,37 మెట్రిక్ టన్నుల బరువు ఉండే ఈ బేరింగ్‌ను అమెరికా నుంచి తెప్పించారు. ఎనిమిదినెలల క్రితం రాష్ట్రరోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ బేరిం గ్ తయారీకి రాబిన్‌సన్ కంపెనీతో చర్చించి, అగ్రిమెంట్ చేయించే నిమిత్తం స్వయంగా అమెరికా వెళ్లారు. ఆకంపెనీని సందర్శించి బే రింగ్‌కు, ఇతర పరికరాలకు ఆర్డర్ కోసం అగ్రిమెంట్ చేయించారు. ఈబేరింగ్ రెండునెలల క్రితమే చెన్నై పోర్టుకు చేరిందని, ఈ నెలాఖరులోగా మన్నెవారిపల్లికి చేరుతుందని, అది రాగానే ఇన్‌స్టాల్ చేసి పనులు ప్రారంభిస్తామని ఎస్‌ఎల్‌బీసీ ఇంజనీర్లు చెబుతున్నారు.
క్వార్ట్ ్జ రాక్ కారణంగా పనుల్లో ఇబ్బందులు...
ఎస్‌ఎల్‌బీసీ అవుట్‌లెట్ వైపు ప్రస్తుతం పెండింగ్ ఉన్న 3.545 కిలోమీటర్ల మేర క్వార్ట్ ్జ రాక్ ఉందని, హార్డ్‌రాక్ ఉన్నంతవరకు పని సాఫీగా సాగిందని, క్వార్ట్ ్జ రాక్ ప్రారంభయ్యాక 3 కిలోమీటర్ల పరిధిలోనే రెండుసార్లు బేరింగ్ మరమ్మతుకు గురైందని చెబుతున్నారు. బేరింగ్, ఇతర సామగ్రి అమెరికా నుంచే రావాల్సి ఉండడంతో పనులు నిలిచిన ప్రతి సారీ సంవత్సరాల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్వయంగా అమెరికాలోని రాబిన్స్ కంపెనీ వద్దకు వెళ్లి మరీ బేరింగ్, ఇతర సామగ్రికి ఆర్డర్ అగ్రిమెంట్ చేయించిన నేపథ్యంలో రెండు నెలల క్రితం బేరింగ్ చెన్నై పోర్ట్‌కు చేరింది. తాజాగా ఔట్‌లెట్ వైపు ప్రమాదం జరగడం, అక్కడ సహాయక చర్యలు ముగిశాక పనులను డ్రిల్లింగ్, అండ్ బ్లాస్టింగ్ విధానంలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటువైపు కూడా పెండింగ్ పనులు అలాగే చేపట్టాలని కాంట్రాక్ట్ సంస్థ తాజాగా శనివారం జరిగిన సమీక్షలో మంత్రి దృష్టికి తీసురాగా, దాన్ని ఆయన తిరస్కరించారు. ఇప్పటికే బేరింగ్ అందుబాటులోకి వచ్చిందని, దాన్ని తీసుకువచ్చి పనులు ప్రారంభించాలని స్పష్టం చేయడంతో ఔట్‌లెట్ వైపు పనులు టీబీఎం ద్వారానే చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇన్‌లెట్ వైపు పనులకు మరికొంత సమయం
ఇన్‌లెట్ వైపు (శ్రీశైలం నుంచి నీరు తీసుకునే ప్రాంతం) పనులు పునఃప్రారంభించాక ఫిబ్రవరి 22న 14వ కిలోమీటర్ ప్రాంతంలో సొరంగం కుప్పకూలింది. దీంతో పనులన్నీ నిలిచిపోయగా, ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సహాయక చర్యలు మరో నెలపాటు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఇన్‌లెట్ వైపు మొత్తం 19.500 కిలోమీటర్ల టన్నెల్ తవ్వాల్సి ఉండగా, 13.935 కిలోమీటర్లు పూర్తయింది. ఫిబ్రవరిలో అక్కడి నుంచి పనులు తిరిగి ప్రారంభించగానే టన్నెల్ కుప్పకూలింది. 2019 నుంచి ఇక్కడ ఊటనీరు వచ్చి చేరుతుండడంతో పాటు, పనులు చేస్తున్నప్పుడు మట్టి, రాళ్లు కూలుతుండడంతో పనులు ముందుకు సాగడంలేదు. ఊటనీటిని తోడివేస్తూ, మట్టిని తొలగించడంతో పాటు, ఊటనీరు మళ్లీ రాకుండా, మట్టి, రాళ్లు పడకుండా ఉండేలా సిమెంట్, పాలియేరిథిన్‌తో గ్రౌటింగ్ చేయించారు. గ్రౌంటింగ్ చేస్తున్నప్పటికీ అది కప్పును బలంగా ఉంచలేకపోయిందని, అందువల్లే టన్నెల్ కూలిపోయిందని నిపుణులు అంచనాకు వచ్చారు. ఇక్కడ బ్యాలెన్స్ ఉన్న సుమారు ఐదు కిలోమీటర్ల టన్నెల్‌ను టీబీఎం పద్ధతిలో కొనసాగించలేమని ఇంజనీర్లు, ఏజెన్సీ స్పష్టం చేయడంతో ఇక్కడ ప్రత్యామ్నాయంగా డీబీఎం (డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ మెథడ్) ద్వారా పనులు కొనసాగించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే సహాయకచర్యలు పూర్తయ్యాక ఈ పనులు చేపట్టనున్నారు. అందుకు సంబంధించి ప్రత్యామ్నాయంగా 13వ కిలోమీటర్ నుంచి ప్రస్తుత టన్నెల్‌కు కుడివైపున 100 మీటర్ల వరకు పక్కకు జరిగి, అక్కడి నుంచి ఔట్‌లెట్ నుంచి టన్నెల్ కలిసేంతవరకు అవసరమైన మేరకు తవ్వాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన మేరకు డిజైన్ ఖరారుచేసి సహాయక చర్యలు పూర్తయ్యాక ఇన్‌లెట్ వైపు పనులు మొదలుపెట్టాల్సి ఉందని, దీనికి మరో మూడు, నాలుగు నెలల సమయం పట్టే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఎస్‌ఎల్‌బీసీ సొరంగమార్గాన్ని తమ హయంలో పూర్తిచేయించి చూపాలనేదే ఏకైక లక్ష్యమని, ఏడాది ఆలస్యమైనా ఈ పనులు పూర్తిచేయిస్తామని మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సైతం ఇటీవల పలు సందర్భాల్లో పేర్కొన్నారు. దీంతో ఈ పనులపై జిల్లా రైతుల్లో ఆశలు సజీవంగా ఉన్నాయి.