Share News

రూ.600 కోట్లతో గంధమల్ల పూర్తి చేస్తాం

ABN , Publish Date - Apr 02 , 2025 | 12:43 AM

రూ.600కోట్లతో గంధమల్ల రిజర్వాయర్‌ను నెల రోజుల్లో పూర్తిచేసి, లక్షన్నర ఎకరాలకు సాగునీరందిస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. మంగళవారం యాదగిరిగుట్టలో సన్నబియ్యం పంపిణీలో పాల్గొని మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో ఆలేరు ఎడారిగా మారిందన్నారు.

రూ.600 కోట్లతో గంధమల్ల పూర్తి చేస్తాం

లక్షన్నర ఎకరాలకు సాగునీరందిస్తాం

సన్న బియ్యం పంపిణీ దేశ చరిత్రలో నిలుస్తుంది

రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

యాదగిరిగుట్ట రూరల్‌, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): రూ.600కోట్లతో గంధమల్ల రిజర్వాయర్‌ను నెల రోజుల్లో పూర్తిచేసి, లక్షన్నర ఎకరాలకు సాగునీరందిస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. మంగళవారం యాదగిరిగుట్టలో సన్నబియ్యం పంపిణీలో పాల్గొని మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో ఆలేరు ఎడారిగా మారిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు కలిసి ప్రజాశ్రేయస్సుకు కృషి చేస్తున్నారని, 15 నెలల్లోనే 20లక్షల రేషన్‌కార్డులు ఇచ్చామని, దేశంలో సన్నబియ్యం ఇప్పటివరకు ఏ రాష్ట్రం ఇవ్వలేదని, తెలంగాణ రాష్ట్రమే ఆదర్శమన్నారు. నిరుద్యోగులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ యువతీ, యువకులకు రాజీవ్‌ యువ వికాసంతో రూ. 5లక్షల వరకు సబ్సిడీతో బ్యాంకు ద్వారా రుణాలు అందజేస్తామని, వాటిని వినియోగించుకొని స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలన్నారు.

రాష్ట్రంలో 84 శాతం మందికి సన్నబియ్యం అందించనున్నామని ప్రభుత్వ విప్‌ బీర్ల అయిల య్య అన్నారు. అధికారంలోకి రాగానే ఆరు గ్యా రంటీలను అంచలవారీగా అమలు చేస్తున్నామన్నారు. ఈ నెల 11న ఆలేరు బీసీ డిక్లరేషన్‌ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని పెద్దఎత్తున మహిళలు, అందరు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. భునగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజా పాలనలో పేదలకు సన్నబియ్యం పంపిణీ చేయడం గొప్ప కార్యక్రమమన్నారు. కలెక్టర్‌ హనుమంతరావు మాట్లాడుతూ సన్నబియ్యం అందుకోబోతున్న ప్రతీ పేద కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపా రు. ఇళ్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అం దజేస్తామన్నారు. అనంతరం నియోజకవర్గంలో ప్రతిమండలానికి నలుగురి చొప్పున సన్నబి య్యం అందజేవారు. మహిళ సంఘాలకు రూ. 23కోట్ల చెక్కును అంజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి, మహిళా కార్పొరేషన్‌ చైర్మ న్‌ బండ్రు శోభారాణి, మదర్‌ డెయిరీ చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి, ఆలేరు, మోత్కుర్‌ మార్కెట్‌ కమిటీల చైర్మన్లు ఐనాల చైతన్యమహేందర్‌రెడ్డి, నూనెముంతల విజయ, డీఏవో సత్యనారాయణ, డీఆర్‌డీఏ నాగిరెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డి, తహసీల్దార్‌ దేశ్యనాయక్‌, నాయకులు నీలం పద్మ, నీలం వెంకటస్వామి, కానుగు బాలరాజ్‌గౌడ్‌, చీర శ్రీశైలం, దుంబాల వెంకట్‌రెడ్డి, శిఖ ఉపేందర్‌గౌడ్‌, గుండ్లపల్లి భరత్‌గౌడ్‌, ఎరుకల హేమేందర్‌గౌడ్‌, ముక్కెర్ల మల్లేశ్‌యాదవ్‌, బంగారపు భిక్షపతిగౌడ్‌, గుడ్ల వరలక్ష్మీ, సుడుగు జీవన్‌రెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి, శ్రీవల్లి అధికారులు పాల్గొన్నారు.

ప్రారంభోత్సవంలో వివాదం

భువనగిరి టౌన్‌: భువనగిరిలో సన్నబియ్యం ప్రారంభోత్సవంలో వివాదం నెలకొన్నది. ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి ప్రసంగాన్ని ప్రారంభించిన వెంటనే నిధులు కేంద్రానివి, సోకులు రాష్ట్రానివా అంటూ బీజేపీ నాయకులు నినాదాలు చేశారు. ఫ్లెక్సీలో ప్రధాని మోదీ ఫొటోను ఎందుకు ముద్రించలేదంటూ ఎమ్మెల్యే అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో కాంగ్రెస్‌ కార్యకర్తల ప్రతినినాదాలు, ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు చేసిన ప్రయాత్నాలతో ఉద్రిక్తత నెలకొన్నది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే జోక్యం చేసుకుంటూ కార్యక్రమానికి అడ్డుపడితే సహించబోమంటూ హెచ్చరించారు.

అన్నంలో ప్రభుత్వాన్ని చూసుకోవాలి : కలెక్టర్‌

భువనగిరి టౌన్‌: దొడ్డు బియ్యంతో ఆకలికి అలమటించిన పేదలు ఇకనుంచి సన్నబియ్యం అన్నంలో ప్రభుత్వాన్ని చూసుకుంటూ కడుపు నింపుకోవాలని కలెక్టర్‌ ఎం.హనుమంతరావు అన్నారు. ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డితో కలిసి మంగళవారం భువనగిరిలో సన్నబియ్యం పంపిణీ ఆయన ప్రారంభించి మాట్లాడారు. సన్నబియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందరికీ గూడు కల్పించే ప్రభుత్వ లక్ష్యం మేరకు జిల్లాలో దశలవారీగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు లభిస్తాయని, ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. ఎమ్మెల్యే కుంభం మాట్లాడుతూ ప్రజల కడుపు నింపేందుకే ప్రభుత్వం కిలోకి రూ.40 ఖర్చుతో సన్నబియ్యం అందిస్తున్నదని, ఇందుకు ప్రతి ఏటా సుమారు రూ.11వేల కోట్ల వెచ్చిస్తుందన్నారు.

Updated Date - Apr 02 , 2025 | 12:43 AM