NIMS: నిమ్స్‌లో వెన్నెముకకు అరుదైన శస్త్రచికిత్స
ABN , Publish Date - Feb 23 , 2025 | 04:43 AM
రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి చక్రాల కుర్చీకే పరిమితమైన వ్యక్తికి నిమ్స్ వైద్యులు అరుదైన ‘స్పైనల్ కార్డ్ స్టిమ్యులేషన్’ శస్త్రచికిత్స నిర్వహించారు.

కాళ్లు చచ్చుబడిపోయిన వ్యక్తికి ‘స్పైనల్ కార్డ్ స్టిమ్యులేటర్’ అమరిక
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి చక్రాల కుర్చీకే పరిమితమైన వ్యక్తికి నిమ్స్ వైద్యులు అరుదైన ‘స్పైనల్ కార్డ్ స్టిమ్యులేషన్’ శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ సర్జరీ చేయడం ఇదే మొదటిసారి అని వైద్యులు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన అంజయ్యకు (42) రెండేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో వెన్నెముకకు తీవ్ర గాయమైంది. ఆ సమయంలో అతనికి నిమ్స్‌లో శస్త్రచికిత్స చేశారు. విరిగిన వెన్నును రాడ్‌లు, స్ర్కూలు వేసి సరిచేశారు. అయితే అతనికి కాళ్లలో శక్తి సన్నగిల్లి చచ్చుబడిపోవడంతో వీల్‌చైర్‌కే పరిమితమయ్యారు.
అతన్ని ఇటీవల నిమ్స్‌కు తీసుకురాగా.. న్యూరో సర్జరీ వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి ఖరీదైన ‘స్పైనల్ కార్డ్ స్టిమ్యులేటర్’ పరికరం అమర్చారు. ఇది వెన్నుపూస నొప్పిని తగ్గిస్తుందని, కండరాల కార్యకలాపాలను మెరుగుపరుస్తుందని వైద్యులు తెలిపారు. మూడు నాలుగు నెలల్లో సాధారణ స్థితికి వచ్చి నడిచే సామర్థ్యం వస్తుందని చెప్పారు. ఈ అరుదైన, క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసిన వైద్యులను నిమ్స్ సంచాలకులు ఫ్రొఫెసర్ నగరి భీరప్ప అభినందించారు. ప్రొఫెసర్ సుచంద భట్టాచార్జీ, డాక్టర్ రాంనాథ రెడ్డి బృందం, ప్రొఫెసర్ శ్రీలత, డాక్టర్ స్వప్న, డాక్టర్ అవినాష్ ఈ శస్త్రచికిత్స నిర్వహించారు.