Share News

TG High Court: గూప్‌-1... పునఃమూల్యాంకనం చేయాలి

ABN , Publish Date - Mar 25 , 2025 | 04:21 AM

గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష పత్రాలను పునఃమూల్యాంకనం చేసేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఎస్‌.నరేశ్‌ మరో 22 మంది అభ్యర్థులు ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.

TG High Court: గూప్‌-1... పునఃమూల్యాంకనం చేయాలి

  • హైకోర్టులో పిటిషన్‌.. టీజీపీఎస్సీకి నోటీసులు జారీ

హైదరాబాద్‌, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష పత్రాలను పునఃమూల్యాంకనం చేసేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఎస్‌.నరేశ్‌ మరో 22 మంది అభ్యర్థులు ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం విచారణ చేపట్టింది. పేపర్లు దిద్దడానికి టీజీపీఎస్సీ నియమించిన ఇవాల్యుయేటర్లు ఆయా సబ్జెక్టుల్లో విషయ నిపుణులు కాదని పిటిషనర్ల తరఫు న్యాయవాది పేర్కొన్నారు. మూల్యాంకనకర్తలకు అటు తెలుగు గానీ ఇటు ఉర్దూ కానీ రాదని.. వారు ఇక్కడి విషయ నిపుణులు కాదని తెలిపారు.


టీజీపీఎస్సీ మార్చి 13న ఇచ్చిన పత్రికా ప్రకటనలో దేశవ్యాప్తంగా 12 సబ్జెక్టుల్లో నిపుణులైన 351 మూల్యాంకనకర్తలను నియమించినట్లు తెలిపిందని, కానీ పరీక్షల్లో మొత్తం 18 సబ్జెక్టులు ఉన్నాయని పేర్కొన్నారు. దీనిపై టీజీపీఎస్సీ న్యాయవాది పీఎస్‌ రాజశేఖర్‌ వాదిస్తూ.. ఫలితాలు ఇంకా విడుదలే కాలేదని.. ఈ దశలో పిటిషన్‌ వేయడం తొందరపాటు చర్య అవుతుందని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. వివరణ ఇవ్వాలని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం, టీజీపీఎస్సీకి నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణ ఏప్రిల్‌ 21కి వాయిదా పడింది.

Updated Date - Mar 25 , 2025 | 04:22 AM