Ponguleti: ధరణిలో అవకతవకలను నిగ్గు తేల్చే ఫోరెన్సిక్ ఆడిట్ ఏజెన్సీ ఎంపిక ఎప్పుడో?
ABN , Publish Date - Feb 28 , 2025 | 03:42 AM
ధరణి పోర్టల్‌లో జరిగిన అవకతవకల నిగ్గు తేల్చేందుకు ఫోరెన్సిక్ ఆడిట్‌ను నిర్వహించే ఏజెన్సీని ఎంపిక చేసే ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఏజెన్సీ ఎంపికకు సంబంధించిన టెండర్ల దశ దాటకపోవడంతో ఇటీవల సీసీఎల్‌ఏ అధికారుల సమీక్షలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఒకింత అసహనం వ్యక్తం చేశారు.

టెండర్లలో జాప్యంపై మంత్రి పొంగులేటి ఆగ్రహం
త్వరలో టెండర్లు పూర్తి చేసే యోచనలో సీసీఎల్‌ఏ
హైదరాబాద్, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): ధరణి పోర్టల్‌లో జరిగిన అవకతవకల నిగ్గు తేల్చేందుకు ఫోరెన్సిక్ ఆడిట్‌ను నిర్వహించే ఏజెన్సీని ఎంపిక చేసే ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఏజెన్సీ ఎంపికకు సంబంధించిన టెండర్ల దశ దాటకపోవడంతో ఇటీవల సీసీఎల్‌ఏ అధికారుల సమీక్షలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిబ్రవరి చివరికల్లా టెండర్లు పూర్తి చేయాలని ఆదేశించారు. అయినా టెండర్ల ప్రక్రియ ముందుకుకదల్లేదు. ఇప్పటికీ ప్రతిపాదన ఆహ్వాన (ఆర్‌ఎ్‌ఫపీ-రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్) దశ దాటలేదు. ఈ విషయంలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ధరణి పోర్టల్‌లో అవకతవకలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని.. గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయల భూములు చేతులు మారాయని, శాస్ర్తీయంగా ఆ అక్రమాల నిగ్గు తేల్చేందుకు ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని గత డిసెంబరు 20న అసెంబ్లీలో మంత్రి ప్రకటించారు.
ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణకు తెలంగాణ, మహారాష్ట్రకు చెందిన రెండు సంస్థలను పరిగణనలోకి తీసుకున్నామని, త్వరలోనే ఉత్తర్వులు ఇస్తామని ఫిబ్రవరి 14న పేర్కొన్నారు. మంత్రి పదేపదే చెబుతున్నా ఫోరెన్సిక్ ఆడిట్ ఏజెన్సీ ఎంపిక ప్రక్రియ వేగవంతంకావడం లేదు. ఈ నేపథ్యంలో జాప్యానికి తావులేకుండా తక్షణమే ఏజెన్సీని ఎంపిక చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి మార్చి 5న తిరిగి రానున్నారు. ఈలోగా టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలన్న యోచనలో సీసీఎల్‌ఏ అధికారులు ఉన్నట్లు తెలిసింది.