ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో వేగం పెంచాలి
ABN , Publish Date - Mar 10 , 2025 | 03:42 AM
ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో వేగం పెంచాలని, కలెక్టర్లు క్రియాశీలకంగా వ్యవహరించాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. అక్రమాలకు తావులేకుండా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని, రెండు, మూడ్రోజుల్లో ప్రక్రియను పూర్తిచేయాలన్నారు.

మూడ్రోజుల్లో లబ్ధిదారుల ఎంపిక: మంత్రి పొంగులేటి
హైదరాబాద్, మార్చి 9(ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో వేగం పెంచాలని, కలెక్టర్లు క్రియాశీలకంగా వ్యవహరించాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. అక్రమాలకు తావులేకుండా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని, రెండు, మూడ్రోజుల్లో ప్రక్రియను పూర్తిచేయాలన్నారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని తన నివాసంలో మంత్రి కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం.నరేందర్‌రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కలెక్టర్లకు సందేహాలుంటే నేరుగా తనను సంప్రదించాలని, పథకం అమల్లో మాత్రం కాలయాపన చేయకూడదన్నారు.
లబ్ధిదారుల ఎంపికలో స్థానిక ఎమ్మెల్యే అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని, కలెక్టర్లే తుది నిర్ణయం తీసుకోవాలని సూచించారు. నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు కూడా లబ్ధిదారులను ఎంపిక పూర్తిచేయాలని, అసంపూర్తిగా ఉన్న ఇళ్లను కాంట్రాక్టర్లు పూర్తిచేయకపోతే లబ్ధి దారులే పూర్తిచేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వరంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్‌పోర్టు, ఔటర్, ఇన్నర్ రింగురోడ్డులకు భూసేకరణను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా, రెవెన్యూ ఉద్యోగులు కష్టపడి పనిచేస్తూ, ప్రజలకు ఉత్తమ సేవల అందిస్తూ, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని మంత్రి పొంగులేటి అన్నారు. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ సంఘాల నేతలు మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉద్యోగులకు ఇచ్చిన ప్రతీ హామీని ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు.