Share News

పసిమొగ్గలకు చచ్చేంత సమస్యలా?

ABN , Publish Date - Feb 28 , 2025 | 04:38 AM

మునుపు.. పిల్లల లేత మనసులు గాయపడితే ఇట్టే తెలిసిపోయేది. బుంగమూతి పెట్టుకోవడమో.. అలిగి ఆ పూట అన్నం మానేయడేమో.. చెప్పుకొని ఏడ్వడమో చేస్తే తల్లిదండ్రులు పసిగట్టేవారు.

పసిమొగ్గలకు చచ్చేంత సమస్యలా?

  • బైక్‌ కొనివ్వలేదని ఒకరు.. ఫోన్‌ ఇవ్వలేదని మరొకరు

  • శుభాకాంక్షలు చెబితే ఫ్రెండ్‌ కొట్టిందని ఇంకొకరు

  • చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు తీసుకుంటున్న పిల్లలు

  • రాష్ట్రంలో పెరుగుతున్న విద్యార్థుల బలవన్మరణాలు

  • గత 12 నెలల్లో ఒక్క ఆదిలాబాద్‌ జిల్లాలోనే 46 మంది ఆత్మహత్య

  • మందలింపునకే క్షణికావేశానికి లోనవుతున్న విద్యార్థులు

  • మరణంతోనే తమ విలువ తెలిసొస్తుందనే ఆలోచనతోనే.. నిపుణుల అభిప్రాయం

ఉదయం భోజనంలోకి రాత్రి వండిన కూర వడ్డించబోతే ఆ బాలిక తల్లిని వారించింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఆవేదనతో ఆ అమ్మాయి ఇంట్లో తన గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో ఈ ఘటన జరిగింది. మృతురాలు ఇంటర్‌ విద్యార్థిని రాజేశ్వరి సాయి (16).

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

మునుపు.. పిల్లల లేత మనసులు గాయపడితే ఇట్టే తెలిసిపోయేది. బుంగమూతి పెట్టుకోవడమో.. అలిగి ఆ పూట అన్నం మానేయడేమో.. చెప్పుకొని ఏడ్వడమో చేస్తే తల్లిదండ్రులు పసిగట్టేవారు. దగ్గరకు తీసుకొని లాలించి.. బుజ్జగిస్తే పిల్లలకు సగం బాధ పోయేది. కారణమేంటో కనుక్కొని, ఓస్‌ ఈ మాత్రం దానికే అలకా? నేనున్నాను కదా అని ఓ భరోసా ఇస్తే అప్పటిదాకా ఎర్రగా కందిన ఆ మోములో నవ్వులు విరిసేవి. ఈ పరిస్థితి ఇప్పుడుందా? పిల్లల మనసు గాయపడితే ముఖకవళికలు, ఉద్వేగాల ద్వారా బయటపడటం లేదు. ఫలానా విషయంలో బాధపడుతున్నామని ఆ పసిమొగ్గలు చెప్పడమూ లేదు. ఆ క్షణం దాకా మామూలుగానే ఉండి.. మరుక్షణంలో ఏకంగా ప్రాణాలను తీసుకుంటున్నారు. టీనేజర్లు చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. పొద్దున స్నానం చేయించి.. యూనిఫాం వేసి, తలదువ్వి.. టిఫిన్‌ తినిపించి.. పుస్తకాలు, నోటు బుక్కులు బ్యాగులో సర్ది.. లంచ్‌బాక్సు ఇచ్చి బడికి పంపితే.. ఆ బిడ్డడు ఆ స్కూలు భవనం మీద నుంచే దూకి ప్రాణాలు తీసుకున్నాడని ఆ తల్లికి ఫోనొస్తోంది. సెలవులు అయిపోయాక అమ్మాయిని హాస్టల్‌లో దిగబెట్టి ఇంటికొచ్చిన తల్లిదండ్రులకు తమ గారాలపట్టి ఇక లేదనే గుండె పగిలే వార్త చెవిన పడుతోంది. పుస్తకం ముందరేసుకొని కూర్చో అని కుమారుడికి చెప్పి పొద్దున పొలానికి వెళ్లి, సాయంత్రం ఇంటికి తిరిగొచ్చిన రైతు దంపతులకు ఆ బిడ్డ ఉరికి వేలాడుతున్న స్థితిలో కనిపిస్తున్నాడు. హాస్టల్లో స్నేహితురాళ్లతో అప్పటిదాకా కలిసి చదువుకున్న అమ్మాయి, తన గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరివేసుకుంటోంది. చదువు ఒత్తిడితోనో, ఉపాధ్యాయులు.. తల్లిదండ్రులు మందలించారనో, ఆన్‌లైన్‌ గేమ్‌లో డబ్బులు కోల్పోయామనో, హాస్టల్లో ఉండలేమన్న బాఽఽధతోనో, ర్యాగింగ్‌ పేరుతో సీనియర్లు వేధిస్తున్నారనో, పరీక్షలు బాగా రాయలేదనో, మార్కులు తక్కువొచ్చాయనో, చదువులో వెనుకబడ్డామనో, తల్లిదండ్రులు బైకో, సెల్‌ఫోనో కొనివ్వలేదనో, స్నేహితులతో గొడవ పడో, ప్రేమ విఫలమైందనో పిల్లలు ప్రాణాలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలు ఇటీవల బాగా పెరిగాయి. గత 12 నెలలో ఆదిలాబాద్‌ జిల్లాలోనే 46 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 34 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పదిమంది విద్యార్థులు, ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 11 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు.


తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి

పిల్లలకు కన్నవారికంటే ఆప్తులు ఇంకెవరుంటారు? అలాంటిది.. వారే తమను అర్థం చేసుకోలేకపోతున్నారనే భావన పిల్లల్లో ఒకసారి కలిగితే అది తీవ్ర మానసిక సమస్యలకు.. కొన్నిసార్లు ఆత్మహత్యకు పాల్పడే దాకా దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా వారికి చదువు పరంగా లక్ష్యాలను నిర్దేస్తుండటంతో వారిపై ఒత్తిడి పెరుగుతోందంటున్నారు. ఫలితంగా చదువులో వెనుకబడిపోయి, పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చిన సందర్భాల్లో తల్లిదండ్రులు మందలించడంతో పిల్లలు దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యకు పాల్పడుతున్నారని అంటున్నారు. ఇష్టం లేకుండా ఇంటికి దూరంగా హాస్టల్లో ఉంచడం.. ఇష్టంలేని గ్రూప్‌లో చదివించడం. వంటి ఘటనలతో ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతుండటం గమనార్హం. ఉద్యోగవ్యాపారాలతో బిజీగా ఉంటున్న తల్లిదండ్రులు, పిల్లలకు ఎక్కువ సమయం కేటాయించడం లేదు. ఫలితంగా పిల్లలు కొన్ని సందర్భాల్లో డిప్రెషన్‌లోకి వెళ్లడాన్ని వారు గమనించలేకపోతున్నారు.

భవనంపై నుంచి దూకేసి

ఆ విద్యార్థికి 13 ఏళ్లు. పేరు సంగారెడ్డి. ఉప్పల్‌ని ఓ స్కూల్లో ఎనిమిదో క్లాసు చదువుతున్నాడు. 21న బడిలో స్నేహితుల ప్రోద్బలంతో సీసీ కెమెరా యాంగిల్‌ను మార్చాడు. ఇది తెలిసి సంగారెడ్డిని పీఈటీ మందలించాడు. మర్నాడు, సంగారెడ్డి మళ్లీ అదేపని చేయడంతో ఈసారి పీఈటీ ఓ లెంపకాయ వేశాడు. సంగారెడ్డి, అదే పాఠశాల భవనం నాలుగో అంతస్తుపైకి వెళ్లి.. అక్కడి నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.


టీనేజర్లలో ఎక్కువగా క్షణికావేశంలోనే ..

టీనేజర్లలో ఎక్కువమంది తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలనే భావనతో ఉంటారు. ఇలాంటి వారు చదువు, పరీక్షలతో ఒత్తిడి గురవుతుంటారు. ఈ క్రమంలో ఇంట్లోవాళ్లు కాస్త మందలించినా కూడా క్షణికావేశానికి లోనవుతారు. ఒత్తిడిలో ఏం చేయాలో తెలియక తాము చనిపోతే తమ విలువేంటో కుటుంబసభ్యులకు తెలిసివస్తుందన్న అభిప్రాయానికొచ్చి ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇంకొందరిలో జన్యుపరమైన కారణాలుంటాయి. ఆత్మహత్యకు ప్రేరేపించే 12 రకాల జన్యుపరమైన కారణాలను పరిశోధకులు కనుగొన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం ఆత్మహత్య చేసుకోవాలనే వారి మెదడులో ఒక రకమైన రసాయనాలు వెలువడుతాయి. వాటిని అయా పరీక్షల ఆధారంగా గుర్తించి అటువంటి వారిని కాపాడొచ్చు. మనదేశంలో ఏటికేడు ఆత్మహత్యల సంఖ్య పెరుగుతోంది. నేషనల్‌ క్రైమ్‌ రిపోర్ట్‌ బ్యూరో 2022 గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఆ ఏడాది 1.71 లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారు. అందులో 15-22 ఏళ్ల మధ్యవయస్కులు 14వేల మంది ఉన్నారు. ఆత్మహత్య చేసుకుంటున్నవారిలో 40శాతం క్షణికావేశంతోనే బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఎలా ఆత్మహత్య చేసుకున్నాడు? అనే విషయాన్ని బహిర్గతపర్చకూడదు. అది బయటపెడితే ఆ పంథాలోనే ఆత్మహత్య చేసుకోవాలని కొందరు ప్రేరితులవుతారు

- డాక్టర్‌ వడ్లమాని నరేశ్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌ సైకియాట్రిస్ట్‌, అడ్వైయిజర్‌, నేషనల్‌ సూసైడ్‌ ప్రివెన్షన్‌ కమిటీ, ఇండియన్‌ సైకియాట్రిక్‌ సొసైటీ.


విద్యార్థుల ఆత్మహత్యల్లో కొన్ని..

  • మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం చిన్న చింతకుంటకు చెందిన పదో తరగతి విద్యార్థిని శ్రీకన్య (15)కు చదువుకోవడం ఇష్టం లేదు. కస్తూర్బా హాస్టల్‌ నుంచి ఇంటికొచ్చేయడంతో తల్లిదండ్రులు నచ్చజెప్పి హాస్టల్‌కు పంపారు. కన్నవారు తనను అర్థం చేసుకోలేకపోయారనే ఆవేదనతో ఈనెల 11న ఆమె హాస్టల్‌ గదిలో ఉరి వేసుకుని చనిపోయింది.

  • గోదావరిఖనికి చెందిన డిప్లొమా విద్యార్థి సాయి అవినాశ్‌ ఆన్‌లైన్‌లో గేమ్స్‌ ఆడుకుంటూ సమయం వృధా చేస్తున్నాడని తల్లిదండ్రులు మందలించడంతో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.

  • మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబుపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన టీనేజర్లు ప్రేమ విఫలమైందన్న అసంతృప్తితో ఒకేరోజు ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నారు.

  • మంచిర్యాల జిల్లా తాండూరు మండలం అచ్చలాపూర్‌ మైదం సాత్విక్‌ (18) ఇంటర్‌లో ఫెయిల్‌ కావడంతో మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. జనగామ జిల్లా జఫర్‌గఢ్‌ మండలం ఉప్పుగల్లుకు చెందిన రాజ్‌కుమార్‌ (15) స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం శివునిపల్లిలోని హాస్టల్లో ఉంటూ పదో తరగతి చదువుతున్నాడు. బయటివ్యక్తులు కొందరు హాస్టల్లో చొరబడి రాజ్‌కుమార్‌, అతడి స్నేహితులతో గొడవ పడ్డారు. ఈ విషయాన్ని ప్రిన్సిపల్‌ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో మళ్లీ ఆ మూక వచ్చి ఏం చేస్తుందోనన్న భయంతో రాజ్‌కుమార్‌ నిరుడు సెప్టెంబరు 22న ఆత్మహత్య చేసుకున్నాడు.

  • మంచిర్యాల జిల్లా నస్పూర్‌లోని తీగల్‌పహాడ్‌కు చెందిన చిలువేరు యోగిత (16) అనే టెన్త్‌ విద్యార్థిని రానున్న వార్షిక పరీక్షల్లో టెన్‌ జీపీఏ సాధించలేననే ఆవేదనతో ఫిబ్రవరి 1న ప్రాణాలు తీసుకుంది.

  • గద్వాల రూరల్‌ మండలం అనంతపురానికి చెందిన బోయ పావని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్‌ చదువుతోంది. సెలవులకు ఇంటికొచ్చిన ఆ అమ్మాయి.. చదువుపై ఏమాత్రం ఆసక్తి లేకపోవడంతో కాలేజీకి వెళ్లడం లేదు. ఈ విషయంలో తల్లి గట్టిగా మందలించడంతో జనవరి 27న పావని ఆత్మహత్య చేసుకుంది.

పెన్ను తెచ్చుకునేందుకు దుకాణానికి వెళ్లిన కూతురు ఆలస్యంగా ఇంటికి తిరిగిరావడంతో ‘ఇంతసేపు షాపు వద్ద ఏం చేశావు?’ అని తల్లి కాస్తంత మందలించింది. ఆ మాత్రానికే బాధపడిపోయిన ఆ బాలిక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు ఖమ్మం పట్టణం మామిళ్ల గూడేనికి చెందిన పదో తరగతి విద్యార్థిని లక్ష్మీ నక్షత్ర (14).

కాలేజీకి ఎందుకు వెళ్లడం లేదు? అని తండ్రి మందలించడంతో జనవరి 6న జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వేంపేటకు చెందిన డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థి సిద్ధార్థ రెడ్డి (19) ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆ బాలిక అడిగితే తల్లి సెల్‌ఫోన్‌ ఇవ్వలేదు. ఆ మాత్రానికే అలిగిన బాలిక ఇంట్లో సీలింగ్‌ ఫ్యానుకు ఉరివేసుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కౌటాల మండల కేంద్రంలో ఫిబ్రవరి 8న ఈ ఘటన జరిగింది. మృతురాలు టెన్త్‌ విద్యార్థిని బొమ్మకంటి స్పూర్తి (14)

జగిత్యాల రూరల్‌ మండలం వేంపేట గ్రామానికి చెందిన బీటెక్‌ విద్యార్థి, మామిడాల రణధీర్‌.. తల్లిదండ్రులు తనకు బైక్‌ కొనివ్వలేదనే ఆవేదనతో గత డిసెంబరు 22న ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇంటర్‌ ప్రీ ఫైనల్స్‌ రాయకపోతే ఎలా? నీ కెరీర్‌కే నష్టం కదా? అని తల్లి మందలించడంతో గోదావరిఖనిలో ముక్క రోహక్‌ (16) అనే విద్యార్థి గత డిసెంబరు 30న ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది తెలిసి.. రోహక్‌ స్నేహితుడు, గోదావరిఖనికే చెందిన శ్రీనాథీశ్వర్‌ (18) బలవన్మరణానికి పాల్పడ్డాడు.

నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబితే స్నేహితురాలు కొట్టిందన్న ఆవేదనతో జగిత్యాల జిల్లా గంభీర్‌రావుపేట మండలం మల్లారెడ్డిపేటలో జనవరి 1న శివ కిషోర్‌ (17) అనే టెన్త్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.


Also Read:

గుంటూరు జిల్లా వాసి అరుదైన రికార్డు

ఈ చిట్కా పాటిస్తే.. రూ. 40 వేలు మీ జేబులోకే..

రూ. 108కే రీఛార్జ్ ప్లాన్.. డేటాతోపాటు కాల్స్ కూడా..

For More Telangana News and Telugu News..

Updated Date - Feb 28 , 2025 | 04:38 AM