Hyderabad: సెర్ప్, మెప్మా విలీనం!
ABN , Publish Date - Mar 24 , 2025 | 03:39 AM
రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ‘ఇందిర మహిళా శక్తి మిషన్-2025’ను ప్రారంభించింది.

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం.. మహిళాభివృద్ధే లక్ష్యం
అధికారులు, సిబ్బంది విభజనపై త్వరలో విధివిధానాలు
15-18 ఏళ్ల బాలికలకు కిశోర బాలికల సంఘాలు
స్త్రీల ఆర్థిక స్వావలంబనకు ‘ఇందిర మహిళా శక్తి మిషన్’
హైదరాబాద్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ‘ఇందిర మహిళా శక్తి మిషన్-2025’ను ప్రారంభించింది. మహిళాభివృద్ధే లక్ష్యంగా చేపట్టిన ఈ పథకంలో భాగంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా స్వయం సహాయక సంఘాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని నిర్ణయించింది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)ను, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లో విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకు మహిళల కోసం చేపట్టే కార్యక్రమాలపై వేర్వేరుగా పనిచేసిన సెర్ప్, మెప్మా ఇకపై కలిసి పనిచేస్తాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్ ఆదివారం జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా, నిరుపేద మహిళలకు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, బ్యాంక్ లింకేజీ, స్వయం సహాయక సంఘాల ద్వారా ఆదాయ వనరులు కల్పించడం ముఖ్య ఉద్దేశంగా ‘ఇందిర మహిళా శక్తి మిషన్’ను ప్రారంభించినట్లు తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో 47.40 లక్షల మంది మహిళలు.. 4.37 లక్షల మహిళా స్వయం సహాయక సంఘాలు, 18 వేల విలేజ్ ఆర్గనైజేషన్లు(వీవోలు), 553 మండల మహిళా సమాఖ్యలు, 32జిల్లా మహిళా సమాఖ్యలు పనిచేస్తున్నాయని వివరించారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో 1.79 లక్షల ఎస్‌హెచ్‌జీల్లో 17.80 లక్షల మంది మహిళలు ఉన్నారని, 189 సమాఖ్యలు ఉన్నాయని, ఇవన్నీ సెర్ప్ పరిధిలో కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 15-18 ఏళ్ల మధ్య వయసున్న బాలికలకు అర్హత కల్పిస్తూ ప్రత్యేకంగా కిశోర బాలికల సంఘాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కిశోరబాలికలకు నైపుణ్య శిక్షణ, విద్య, ఉపాధి కల్పన ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కిశోరబాలికల గ్రూపులోని సభ్యులకు 18 ఏళ్లు నిండిన తర్వాత.. వారికి స్వయం సహాయక సంఘాల్లో చేరేందుకు వీలు కల్పిస్తామన్నారు. సెర్ప్, మెప్మా విభాగాల్లోని అధికారులు, సిబ్బంది పని విభజనకు సంబంధించి త్వరలోనే విఽధివిఽధానాలను రూపొందించనున్నట్లు లోకేశ్‌కుమార్ వెల్లడించారు.