9885 మంది ‘యాంటీ డ్రగ్ సోల్జర్’లు
ABN , Publish Date - Mar 29 , 2025 | 05:17 AM
మాదకద్రవ్యాలను అరికట్టడానికి పోలీసులు సరికొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. డ్రగ్స్ ముఠాలు లక్ష్యంగా చేసుకున్న ప్రాంతాల్లోనే వారిని కట్టడి చేయడానికి ప్రణాళికలు రూపొందించారు.

మత్తుమందులపై పోరులో విద్యార్థుల సేవలు
డ్రగ్స్ కట్టడికి పోలీసుల సరికొత్త వ్యూహం
డ్రగ్స్‌పై సమాచారం అందజేయాలంటూ అవగాహన
రాష్ట్రవ్యాప్తంగా పేర్లు నమోదు చేసుకున్న విద్యార్థులు
డ్రగ్స్ ముఠాలు పట్టుబడితే సోల్జర్లకు పారితోషికం!
హైదరాబాద్, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): మాదకద్రవ్యాలను అరికట్టడానికి పోలీసులు సరికొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. డ్రగ్స్ ముఠాలు లక్ష్యంగా చేసుకున్న ప్రాంతాల్లోనే వారిని కట్టడి చేయడానికి ప్రణాళికలు రూపొందించారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులను టార్గెట్ చేసుకొని మత్తుమందులు విక్రయించే ముఠాల ఆట కట్టించేందుకు విద్యార్థులనే సైన్యంగా వాడుకోవాలని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు నిర్ణయించారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ముప్పును వివరిస్తున్నారు. అలాగే డ్రగ్స్‌కు అలవాటు పడిన వారిని ఎలా గుర్తించాలనే అంశంపై అవగాహన కల్పిస్తున్నారు. తర్వాత ‘యాంటీ డ్రగ్ సోల్జర్లు’గా నమోదు చేసుకోవడానికి విద్యార్థులకు అవకాశం ఇస్తున్నారు. డ్రగ్స్ వాడే వారిని గుర్తించినా, మత్తుమందుల సరఫరాదారుల గురించి సమాచారం తెలిసినా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకు ఈ మెయిల్ లేదా 8712671111 ఫోన్ నంబర్‌కు, టోల్ ఫ్రీ నంబరు1908కి సమాచారం ఇవ్వాలని యాంటీ డ్రగ్ సోల్జర్లకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఇలాంటి సమాచారం అందించిన సోల్జర్ వివరాలను రహస్యంగా ఉంచడంతో పాటు వారిచ్చిన సమాచారంతో డ్రగ్స్ ముఠాలు పట్టుబడితే ఆయా సోల్జర్లకు పారితోషికాలు కూడా అందిస్తామని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు తెలంగాణలో 9,885 మంది విద్యార్థులు యాంటీ డ్రగ్ సోల్జర్లుగా పేర్లు నమోదు చేసుకున్నారని చెప్పారు.
8,662 మంది అరెస్టు
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోను 2023లో ప్రారంభించారు. నాటి నుంచి గత నెలాఖరు వరకు రాష్ట్రవ్యాప్తంగా మత్తుమందుల అమ్మకాలకు సంబంధించి 3,838 కేసులు నమోదు చేశారు. 8,662 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.244 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు 13 కేసుల్లో నిందితులు మత్తుమందుల అమ్మకాల ద్వారా కూడబెట్టిన రూ.66 కోట్ల ఆస్తులను సీజ్ చేశారు.
ద్రవరూప గంజాయి సరఫరా కేసులో ఇద్దరికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష
మహబూబ్‌నగ ర్, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): ద్రవ రూప గంజాయి (హాశీష్ ఆయిల్) సరఫరా చేసిన ఇద్దరు వ్యక్తులకు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ శుక్రవారం మహబూబ్‌నగర్ మొదటి అదనపు జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది. రూ.లక్ష జరిమానా కూడా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరునెలల కఠిన కారాగార శిక్ష పడనుంది. గత సంవత్సరం అక్టోబరు మూడో తేదీన ఎక్సైజ్ శాఖ నిర్వహించిన తనిఖీల్లో ఒడిశాకు చెందిన ఇద్దరు వ్యక్తులు... నరోత్తమ్ రే, ధర్మేంద్రకుమార్ రేలు అయిదు కేజీల హాశీష్ అయిల్ సరఫరా చేస్తూ పట్టుబడ్డారు. వారిపై సీఐ వీరారెడ్డి, ఎస్పై సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నేరం రుజువు కావడంతో కోర్టు శిక్ష విధించింది.
ఇవి కూడా చదవండి..
Betting Apps Case.. మరో ఆరుగురికి నోటీసులు..
కేసీఆర్ క్యాంపు కార్యాలయానికి టులెట్ బోర్డు..
Read Latest Telangana News And Telugu News