Anil Eravathri : ఇసుకతో రూ.7 వేల కోట్లు దోచుకున్న కేసీఆర్ కుటుంబం
ABN , Publish Date - Mar 22 , 2025 | 04:07 AM
ఇసుక అక్రమాల ద్వారా కేసీఆర్ కుటుంబం రూ.7,000 కోట్లు దోచుకుందని టీజీఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్‌కుమార్ ఆరోపించారు. టీజీఎండీసీ కార్యాలయంలో శుక్రవారం ఎండీ సుశీల్‌కుమార్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

పదేళ్ల బీఆర్‌ఎస్ హయాంలో వచ్చిన రాబడి రూ.5,966 కోట్లే
కాంగ్రెస్ వచ్చిన 16 నెలల్లోనే రూ.1,000 కోట్ల ఆదాయం
త్వరలో మరో మూడు ఇసుక బజార్లు
టీజీఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్
హైదరాబాద్, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): ఇసుక అక్రమాల ద్వారా కేసీఆర్ కుటుంబం రూ.7,000 కోట్లు దోచుకుందని టీజీఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్‌కుమార్ ఆరోపించారు. టీజీఎండీసీ కార్యాలయంలో శుక్రవారం ఎండీ సుశీల్‌కుమార్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ హయాంలో వేబిల్లులు, వేబ్రిడ్జీలు, వాహన తనిఖీలు లేకుండా ఇసుకను మొత్తం వక్రమార్గం పట్టించారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబంతో పాటు కవిత బంధువులు కలిసి రూ.7,000 కోట్లు లూటీ చేశారన్నారు. అప్పట్లో ఇసుక టన్ను ధర రూ.2,500 నుంచి రూ.3,000 వరకు పలికేదని చెప్పారు. బీఆర్‌ఎస్ పదేళ్లకాలంలో ఇసుక ద్వారా రూ.5,966.11 కోట్ల రాబడి వస్తే... కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 16 నెలల్లో రూ.1,000 కోట్ల వరకు ఆదాయాన్ని సాధించామన్నారు.
తమ ప్రభుత్వం రీచ్‌లు, స్టాక్ యార్డుల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు, వాహన ట్రాకింగ్ వ్యవస్థ, 24 గంటలపాటు నిఘా వంటి చర్యలను తీసుకోవడం వల్ల ఇసుక అక్రమ రవాణా తగ్గిందన్నారు. హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్, బౌరంపేట్, వట్టినాగులపల్లిలో మూడు ‘ఇసుక బజార్’లను ఇప్పటికే ప్రారంభించామని... త్వరలో ఆదిభట్ల, ఉప్పల్, పటాన్‌చెరు ప్రాంతాల్లో మరో మూడు బజార్లను ప్రారంభిస్తామని చెప్పారు. ఇసుక బజార్లతో ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో దొడ్డు ఇసుక టన్ను ధర రూ.1,750కి పడిపోయిందన్నారు. ఇసుక బజార్ల ద్వారా టన్ను దొడ్డు ఇసుకను రూ.1,600, సన్న ఇసుకను రూ.1,800కు విక్రయిస్తున్నామని తెలిపారు. 2025-26 సంవత్సరంలో ఇసుక ద్వారా రూ.1,000-1,200 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.