Telangana Legislators: తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ గుడ్ న్యూస్
ABN , Publish Date - Mar 18 , 2025 | 04:31 AM
తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. మార్చి 24వ తేదీ నుంచి వారి సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు జారీ చేయనున్నట్టు టీటీడీ సోమవారం ప్రకటించింది.

24 నుంచి సిఫారసు లేఖలకు అనుమతి
తిరుమల, మార్చి 17(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. మార్చి 24వ తేదీ నుంచి వారి సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు జారీ చేయనున్నట్టు టీటీడీ సోమవారం ప్రకటించింది. తమ సిఫారసు లేఖలకు దర్శనాలు కల్పించాలంటూ తెలంగాణ ప్రజాప్రతినిఽధులు సీఎం రేవంత్ ద్వారా ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ పంపారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ దర్శనానికి అవకాశం కల్పించమంటూ టీటీడీ అధికారులను ఆదేశించారు. తొలుత ఫిబ్రవరి నుంచే తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను తీసుకుంటామని ప్రకటించినా.. టీటీడీ తమ లేఖలు తీసుకోవడం లేదంటూ పలువురు తెలంగాణ ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఈనేపథ్యంలో ఈనెల 24 నుంచి తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను తీసుకుంటామని టీటీడీ ప్రకటన చేసింది. ఆది, సోమవారాల్లో మాత్రమే(సోమ, మంగళవారాల దర్శనాలకు సంబంఽధించి) స్వీకరిస్తామని, అలాగే రూ.300 దర్శన టికెట్లకు సంబంఽధించిన సిఫారసు లేఖలను బుధ, గురువారాల్లో (ఏరోజుకారోజు కేటాయిస్తారు) తీసుకుంటామని టీటీడీ స్పష్టం చేసింది.