శ్రీవారి ఆలయ అలంకరణలో శిలువ గుర్తంటూ ప్రచారం

ABN , First Publish Date - 2020-12-29T06:50:14+05:30 IST

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయ ప్రాకారానికి ఏర్పాటు చేసిన లైటింగ్‌లో శిలువ గుర్తు ఉందంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరగడంతో టీటీడీ వెంటనే అలంకరణలో మార్పులు చేసింది

శ్రీవారి ఆలయ అలంకరణలో శిలువ గుర్తంటూ ప్రచారం
విద్యుత్‌ అలంకరణలో తిరుమల ఆలయ ప్రాకారం

లైటింగు మార్చిన టీటీడీ సిబ్బంది


తిరుమల, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయ ప్రాకారానికి ఏర్పాటు చేసిన లైటింగ్‌లో శిలువ గుర్తు ఉందంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరగడంతో టీటీడీ వెంటనే అలంకరణలో మార్పులు చేసింది. క్రాస్‌.. హనుమ, తిరునామం, గరుడ బొమ్మలను వరుస క్రమంలో ఏర్పాటు చేశారని ఆరోపించడంతో పాటు ఇది యాదృచ్ఛికంగా ఏర్పాటు చేసింది కాదని, మెల్లగా హిందువులకు అలవాటు చేస్తున్నారంటూ ‘తాళపత్రనిధి’ అనే ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్‌ చేశారు.వాస్తవానికి హనుమంతుడు, తిరునామాలు, గరుత్మంతుడి ప్రతిమల తర్వాత ‘పూర్ణకుంభం’ లైటింగ్‌ ఉంచారు. ఈ పూర్ణకుంభాన్నే సోషల్‌ మీడియాలో శిలువగా ప్రచారం చేశారు.ఇలాంటి విషప్రచారం ద్వారా ఆలయ పవిత్రతను దెబ్బతీయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.ఆయన సోమవారం సాయం త్రం ఆలయం వద్దకు చేరుకుని అలంకరణను పరిశీలించారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆలయ ప్రాకారంపై పూర్ణకలశ ఆకారంలో ఉన్న విద్యుత్‌ అలంకరణను శిలువగా మార్ఫింగ్‌ చేసి తాళపత్రనిధి ఫేస్‌బుక్‌ యూఆర్‌ఎల్‌తో పాటు మరికొంతమంది సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారన్నారు. పోస్ట్‌ పెట్టిన తాళపత్రనిధి ఫేస్‌బుక్‌ యూఆర్‌ఎల్‌, ఇతరులపై పోలీసు కేసు నమోదు చేసినట్టు  అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు.



Updated Date - 2020-12-29T06:50:14+05:30 IST