ఏకైక రాజధానిగా అమరావతే తథ్యం

ABN , First Publish Date - 2021-05-01T08:26:41+05:30 IST

అమరావతి అన్నదాతలు అలుపెరగకుండా చేస్తున్న పోరాటం శుక్రవారానికి 500 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా రైతులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. రాయపూడి శిబిరంలో దళిత చైతన్య గీతం

ఏకైక రాజధానిగా అమరావతే తథ్యం

అమరావతి పోరుకు 500 రోజులు.. వెబినార్‌లో ప్రసంగాలు

నమ్మకంతో భూములిస్తే అవమానిస్తారా?

ప్రజలు వద్దంటే.. జగన్‌ కావాలంటారా?

అమరావతి పోరు 500వ రోజు సందర్భంగా వెబినార్‌లో పలు పార్టీల నేతలు, ఉద్యమకారులు 


గుంటూరు/అమరావతి, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): అమరావతి అన్నదాతలు అలుపెరగకుండా చేస్తున్న పోరాటం శుక్రవారానికి 500 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా రైతులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. రాయపూడి శిబిరంలో దళిత చైతన్య గీతం సీడీని.. అమరావతి జేఏసీ నేతలు, దళిత జేఏసీ నేతలు విడుదల చేశారు. ఉద్దండరాయునిపాలెం శిబిరంలో బుద్ధుని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ‘అమరావతి జేఏసీ’ ఆధ్వర్యంలో ‘అమరావతి ఉద్యమ భేరి’ పేరిట వెబినార్‌ విధానంలో సభ నిర్వహించారు. పలు పార్టీల నాయకులు, జేఏసీ నేతలు, మేధావులు వర్చువల్‌గా పాల్గొని రైతులకు మద్దతు ప్రకటించారు.  


ఒకే రాష్ట్రం-ఒకటే రాజధాని: లోకేశ్‌

అమరావతి రైతుల త్యాగం నిరుపయోగం కాదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ స్పష్టం చేశారు. అమరావతి శాశ్వతమని లోకేశ్‌ స్పష్టం చేశారు. 3 రాజధానుల పేరుతో సీఎం జగన్‌ విద్వేషాలు విరజిమ్మారని విమర్శించారు. ఒకే రాష్ట్రం-ఒకటే రాజధాని నినాదంతో వందాలాది గుండెలు ఆగిపోయాయని లోకేశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.  


ప్రజాభీష్టానికి వ్యతిరేకం: అచ్చెన్న

ప్రజాభీష్టానికి వ్యతిరేకంగానే సీఎం జగన్‌ నిర్ణయాలు ఉంటున్నాయని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రజలు రాజధానిగా అమరావతి వద్దంటే.. అప్పడు సీఎం జగన్‌ మాత్రం అమరావతినే రాజధానిగా కొనస్తామని అంటారేమోనని మండిపడ్డారు..


పోరాటం ఆగదు: ఎంపీ గల్లా 

అమరావతి కోసం పోరాడుతున్న రైతులు, మహిళలకు ఎంపీ గల్లా జయదేవ్‌ అభినందనలు తెలిపారు. పోలీసు దాడులను ఎదుర్కొని రాష్ట్ర భవిష్యత్‌ కోసం ధైర్యంగా నిలబడ్డారని కొనియాడారు. మూడు రాజధానుల ప్రకటన ఉపసంహరించుకునే వరకు పోరాటం ఆగదన్నారు.


రాష్ట్ర ఉనికిని ప్రశ్నార్ధకం చేశారు: సాకే

రాజధాని అమరావతి విషయంలో సీఎం జగన్‌ రాష్ట్ర ఉనికిని ప్రశ్నార్ధకం చేసే తప్పు చేస్తున్నారని పీసీసీ చీఫ్‌ శైలజానాఽథ్‌ ధ్వజమెత్తారు. రాజధానిగా ఆనాడు అమరావతికి ఎందుకు మద్దతు తెలిపారో ఆయన సమాఽధానం చెప్పాలని నిలదీశారు. 


కేంద్రానికి బాధ్యత ఉంది: సీపీఐ రామకృష్ణ

రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అయిన అమరావతిని రాజధానిగా కొనసాగించి తీరాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పష్టం చేశారు. రాజధాని ఉద్యమాన్ని అణిచేసేందుకు జగన్‌ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించినా.. 500 రోజుల పాటు కొనసాగించారని కొనియాడారు.


ఇది అవమానం: జీవీఆర్‌ శాస్ర్తి

రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారని.. వారు నమ్మకంగా భూములిస్తే అవమాన పరుస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై అమరావతి జేఏసీ గౌరవాధ్యక్షుడు జీవీఆర్‌ శాస్త్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకైక రాజధానిగా అమరావతి తథ్యమని అన్నారు. 


రైతులపై పెట్టిన అక్రమ కేసులు నిలబడవు

రైతులపై పెట్టిన అక్రమ కేసులు కోర్టులో నిలబడవని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ గోపాల గౌడ్‌ అన్నారు. విభజన చట్టం ప్రకారం 3 రాజధానులు పెట్టే అధికారం రాష్ట్రప్రభుత్వానికి లేదన్నారు. 


ఎస్సీలను దగా చేశారు: దళిత జేఏసీ 

జగన్‌ ఎస్సీలను దగా చేశారని దళిత జేఏసీ కన్వీనర్‌ మార్టిన్‌ లూథర్‌ విమర్శించారు. గత ప్రభుత్వం ఎస్సీలు అధికంగా ఉండే ప్రాంతంలో రాజధాని నిర్మాణం చేపడితే.. జగన్‌ ఎస్సీలందరినీ దగా చేశారని.. ఎస్సీలు.. జగన్‌కు అధికారం దూరం చేసే రోజు దగ్గర్లోనే ఉందన్నారు.

Updated Date - 2021-05-01T08:26:41+05:30 IST