Afghanistan crisis: కరాటే చాంపియన్ మీనా భయం వెనుక..
ABN , First Publish Date - 2021-08-20T23:09:48+05:30 IST
ఆఫ్ఘన్ ప్రజల ఆశలు, ఆశయాలు అన్నీ అడుగంటిపోయాయి. దేశాన్ని మళ్లీ తాలిబన్లు ఆక్రమించుకోవడంతో

కాబూల్: ఆఫ్ఘన్ ప్రజల ఆశలు, ఆశయాలు అన్నీ అడుగంటిపోయాయి. దేశాన్ని మళ్లీ తాలిబన్లు ఆక్రమించుకోవడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. దేశం నుంచి బయటపడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇక, దేశంలోని మహిళా క్రీడాకారులు అయితే ఆశలు వదిలేసుకున్నారు. ఇక, తమ క్రీడా జీవితం ముగిసిపోయినట్టేనని భావిస్తున్నారు. ఆఫ్ఘన్ కరాటే చాంపియన్ మీనా అసది కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తాలిబన్లు మళ్లీ దేశాన్ని తమ గుప్పిట్లోకి తీసుకోవడంతో తన సొంత దేశంలోని మహిళా అథ్లెట్ల ఆశలు నీరుగారిపోయినట్టేనని, ఇక వారు ఎందులోనూ పాల్గొనే అవకాశం లేదని పేర్కొంది.
‘‘చాలా బాధగా ఉంది. నేనే కాదు, నా దేశ ప్రజలు కూడా ఆశలు కోల్పోయారు’’ అని మీనా పేర్కొంది. ప్రస్తుతం ఆమె జకారాల్లోని సిసరౌ పట్టణంలో ఉంది. తనలాంటి శరణార్థులకు కరాటేలో శిక్షణ ఇస్తోంది.
12 ఏళ్ల వయసులోనే ఆప్ఘనిస్థాన్‌ను విడిచిపెట్టిన మీనా పాకిస్థాన్ వెళ్లింది. అక్కడ కరాటేలో శిక్షణ పొందింది. 2010 దక్షిణాసియా క్రీడల్లో ఆఫ్ఘనిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించింది. ఆ తర్వాతి ఏడాదే కాబూల్ తిరిగి వచ్చి ఫైట్ క్లబ్ ఏర్పాటు చేసింది. అయితే, అది ఎంతోకాలం నిలవలేదు. దేశంలో హింస కారణంగా రెండోసారి దేశాన్ని వీడింది. భర్త, ఏడాది వయసున్న కుమార్తెతో ఇండోనేషియా వెళ్లిపోయింది. దేశాన్ని తాలిబన్లు మళ్లీ హస్తగతం చేసుకోవడంతో స్వదేశీయులు ఇప్పటి వరకు సాధించిన అభివృద్ధికి అర్థం ఏమిటో తెలియడం లేదని 28 ఏళ్ల మీనా ఆవేదన వ్యక్తం చేసింది.
పారాలింపిక్స్ గేమ్స్‌లో పాల్గొన్న తొలి ఆఫ్ఘనిస్థాన్ మహిళగా పేరుకెక్కాల్సిన తైక్వాండో అథ్లెట్ జకియా ఖుదాదాడి ఆశలను కూడా తాలిబన్లు చిదిమేశారు. ఇప్పుడామె దేశం విడిచి వెళ్లలేక ఇంటికే పరిమితమైంది. ఆమె ఒక్కరే కాదు ఎంతోమంది మహిళా అథ్లెట్ల జీవితాలు ముగిసిపోయాయని మీనా పేర్కొంది. కాగా, 2012లో దక్షిణాసియా కరాటే చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న మీనా రెండు రజత పతకాలు గెలుచుకుంది. ఆ క్రీడల్లో ఆఫ్ఘనిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించిన ఒకే ఒక మహిళగా రికార్డులకెక్కింది.