TTD: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం
ABN , First Publish Date - 2022-12-31T20:44:41+05:30 IST
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల వేంకటేశ్వరస్వామి (Tirumala Venkateswara Swamy) ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి నుంచే వైకుంఠ ద్వార దర్శనాలు మొదలుకానున్నాయి.
తిరుమల: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల వేంకటేశ్వరస్వామి (Tirumala Venkateswara Swamy) ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి నుంచే వైకుంఠ ద్వార దర్శనాలు మొదలుకానున్నాయి. సోమవారం ఏకాదశి సందర్భంగా తిరుప్పావైతో శ్రీవారిని మేల్కొలిపి ఏకాంతంగా ధనుర్మాస కైంకర్యాలు నిర్వహిస్తారు. తర్వాత దక్షిణ, ఉత్తర భాగంలోని వైకుంఠ ద్వారాలను తెరుస్తారు. కైంకర్యాల అనంతరం వేకువజాము 1.45 గంటల నుంచి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు మొదలుపెట్టనున్నారు. 11వ తేదీ వరకు ఆ ద్వారాలను తెరిచే ఉంచి గతేడాది తరహాలో పదిరోజుల పాటు దర్శనాలు కల్పించనున్నారు. సుమారు 3 నుంచి 4 వేల మంది వివిధ కేటగిరీలకు చెందిన వీఐపీలకు దర్శన ఏర్పాట్లు చేశారు. వీరికి ఆదివారం సాయంత్రం లోగా టికెట్లు మంజూరు చేయనున్నారు.
వీఐపీలు ఆలయం ముందు నుంచి తమకు కేటాయించిన మార్గాల్లో కంపార్టుమెంట్లకు చేరుకుని శ్రీవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో క్యూలైన్ల ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.ఆలయం వద్ద విద్యుత్, పుష్పాలంకరణలు కూడా ఆదివారం సాయంత్రానికి పూర్తికానున్నాయి. ఇప్పటికే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేసిన టీటీడీ అధికారులు టైంస్లాట్ సర్వదర్శన టోకెన్లను ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి తిరుపతిలో తొమ్మిది ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా భక్తులకు జారీ చేయనున్నారు. పదిరోజుల కోటా పూర్తయ్యే వరకు కోటాను నిరంతరాయంగా జారీ చేస్తారు.
వైకుంఠద్వార దర్శనం టికెట్లు ఎలా పొందాలంటే
టైంస్లాట్ సర్వదర్శన టోకెన్లను తిరుపతిలో రోజుకు 45 వేల చొప్పున జారీ చేస్తారు. వీటిని ఆదివారం మఽధ్యాహ్నం 2 గంటల నుంచి కోటా పూర్తయ్యే వరకు నిరంతరాయంగా భక్తులకు కేటాయిస్తారు. ఏ ప్రాంతం వారైనా (తిరుమల మినహా) ఈ కౌంటర్లలో తమ ఆధార్ కార్డును చూపి టోకెన్ పొందవచ్చు. టికెట్ల లభ్యత సమాచారాన్ని టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ‘Tirumala.org’ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే కౌంటర్ల వద్ద ఏర్పాటు చేసిన ఎల్‌సీడీ స్ర్కీన్ల ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఒక ప్రాంతంలో రద్దీ అఽధికంగా ఉంటే మరో ప్రాంతానికి భక్తులు సులువుగా చేరుకునేలా ప్రతి కౌంటర్ వద్ద క్యూఆర్ కోడ్ బోర్డులను ఏర్పాటు చేశారు. ఆ క్యూఆర్ కోడ్‌ను సెల్‌ఫోన్‌లో స్కాన్ చేస్తే ఆయా ప్రాంతాలకు గూగుల్ రూట్ మ్యాప్‌ను పొందవచ్చు.