Share News

ఇదేం తీరు?

ABN , Publish Date - Mar 28 , 2025 | 01:46 AM

జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డిపై ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేల అసంతృప్తి పార్టీ శ్రేణుల సాక్షిగా బయటపడింది.పుంగనూరు మండలం కృష్ణాపురంలో టీడీపీ కార్యకర్త రామకృష్ణను అక్కడి వైసీపీ కార్యకర్త వెంకట్రరమణ ఇటీవల నరికి చంపిన విషయం తెలిసిందే.

ఇదేం తీరు?
రామకృష్ణ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్యేలు

మంత్రి పర్యటనలో బయటపడ్డ ఎమ్మెల్యేల అసంతృప్తి

పుంగనూరు, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డిపై ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేల అసంతృప్తి పార్టీ శ్రేణుల సాక్షిగా బయటపడింది.పుంగనూరు మండలం కృష్ణాపురంలో టీడీపీ కార్యకర్త రామకృష్ణను అక్కడి వైసీపీ కార్యకర్త వెంకట్రరమణ ఇటీవల నరికి చంపిన విషయం తెలిసిందే. గురువారం రామకృష్ణ పెద్దకర్మ కార్యక్రమం ఉండడంతో ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు వెళ్లి రామకృష్ణ కుటుంబాన్ని పరామర్శించాలని పార్టీ ఆదేశించింది. దీంతో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి విజయవాడ నుంచి బెంగళూరు చేరుకుని, అక్కడి నుంచి రోడ్డుమార్గంలో కృష్ణాపురానికి ఉదయం 9.50 గంటలకల్లా వెళ్లారు. ఉదయం 10 గంటలకు రామకృష్ణ కుటుంబాన్ని పరామర్శించాలనుకున్నా.. ఆ సమయానికి అక్కడికి జిల్లా ఎమ్మెల్యేలు చేరుకోలేదు. పుంగనూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి మాత్రమే మంత్రికి ఆహ్వానం పలికారు. అప్పటి వరకు మంత్రి అదే గ్రామంలోని ఓ కార్యకర్త ఇంటి వద్ద ఉంటూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. చిత్తూరు, శ్రీకాళహస్తి, చంద్రగిరి, పూతలపట్టు ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్‌, బొజ్జల సుధీర్‌రెడ్డి, పులివర్తి నాని, మురళీమోహన్‌ పలమనేరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి అమరనాథ రెడ్డి ఇంటి వద్దకు చేరుకుని అక్కడే టిఫిన్‌ చేశారు. అక్కడి నుంచి బయల్దేరి 11.30 గంటలకు కృష్ణాపురం చేరుకున్నారు. అప్పటి వరకు మంత్రి వారి కోసం వేచి చూశారు. ఎమ్మెల్యేలు వస్తున్న సమయంలో మంత్రి పక్కనే ఉన్న చనిపోయిన రామకృష్ణ ఇంటి వద్దకు వెళ్లారు. ఎమ్మెల్యేలను నియోజకవర్గ ఇన్‌ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి ఆహ్వానించారు.తరువాత మంత్రి, ఎమ్మెల్యేలంతా రామకృష్ణ చిత్ర పటానికి నివాళులర్పించారు.ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం చేశారు. తర్వాత ముందే ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్‌ శిబిరం వద్దకు చేరుకోవాల్సి ఉండగా.. ఇన్‌ఛార్జి చల్లా అందర్నీ పిలిచారు. మంత్రి ప్రెస్‌మీట్‌ వద్దకు చేరుకుని ఎమ్మెల్యేల కోసం మళ్లీ 10 నిమిషాల పాటు వేచి చూశారు. తొలుత మంత్రి 3 నిమిషాలు మాట్లాడారు. ఎమ్మెల్యేల తరఫున మాట్లాడాలని చిత్తూరు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేలు పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డిని కోరారు. దీంతో ఆయన కోప్పడ్డారు. ‘మంత్రి మాట్లాడేశారు కదా, నేను ఏందీ మాట్లాడేది’ అని అక్కడి నుంచి లేచి వెళ్లిపోయారు. దీంతో అక్కడున్న మిగిలిన ఎమ్మెల్యేలు కూడా ప్రెస్‌మీట్‌లో మాట్లాడలేదు. ఎవరిపాటికి వాళ్లు వెళ్లిపోయారు. ఆఖరులో మంత్రి వెళ్లారు.వాస్తవానికి వైసీపీ ఐదేళ్ల పాలనలో పుంగనూరులో టీడీపీ కార్యకర్తలు ఆ పార్టీ అగ్ర నేత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వర్గీయుల చేతిలో నలిగిపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా టీడీపీ కార్యకర్తను వైసీపీ కార్యకర్త హత్య చేయగలిగాడంటే అక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో పుంగనూరుకు ఎమ్మెల్యేలంతా వెళ్లి కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపాలని పార్టీ అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ సూచించారు. కానీ, పుంగనూరులో గురువారం జరిగిన ఎమ్మెల్యేల తీరు భరోసా కంటే నిరుత్సాహాన్నే మిగిల్చింది. కార్యకర్తల్లో భరోసా నింపుతారనుకుంటే అంతర్గత విబేధాలు బయటపెట్టుకున్నారని స్థానిక టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.

Updated Date - Mar 28 , 2025 | 01:46 AM