ఘనంగా అమ్మవార్ల ఊరేగింపు
ABN , Publish Date - Mar 28 , 2025 | 01:50 AM
రెండురోజుల పాటు వైభవంగా జరిగిన సుగుటూరు గంగమ్మ జాతర గురువారం ఉదయం నిమజ్జనంతో ముగిసింది. మంగళవారం జమిందారుల తొలిపూజతో జాతర ప్రారంభమైంది.

నిమజ్జనంతో ముగిసిన గంగజాతర
ప్యాలె్‌సకు చేరిన సుగుటూరు గంగమ్మ
పుంగనూరు, మార్చి 27(ఆంధ్రజ్యోతి): రెండురోజుల పాటు వైభవంగా జరిగిన సుగుటూరు గంగమ్మ జాతర గురువారం ఉదయం నిమజ్జనంతో ముగిసింది. మంగళవారం జమిందారుల తొలిపూజతో జాతర ప్రారంభమైంది.రాత్రి ఊరేగింపు అనంతరం బుధవారం ప్యాలెస్ ఆవరణలోని సుగుటూరు గంగమ్మ ఆలయంలో అమ్మవారిని ప్రతిష్టించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.పుంగనూరుతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు వివిధ రకాల వేషధారణతో గెరిగెలు మోస్తూ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.గురువారం తెల్లవారుజామున గంగమ్మను ఆలయం నుంచి వెలుపలకు తెచ్చి నిమజ్జనానికి ఊరేగింపుగా తీసుకెళుతుండగా బజారువీధిలోని నడివీధి గంగమ్మ, మైసూర్‌బ్యాంకు వద్ద కొలువుదీరిన మల్లారమ్మ కలిశారు.సుబేదారు వీధి, తేరువీధి మీదుగా తూర్పుమొగసాలలోని చౌడేశ్వరిదేవి ఆలయం వరకు మంగళవాయిద్యాలు, బాణాసంచా పేలుళ్లు, అసాధివారి కథలతో గంగమ్మలు ఊరేగింపుగా వెళ్లారు.చాముండేశ్వరిదేవి ఆలయానికి మల్లారమ్మ వెళ్లి అమ్మవారిని పలకరించి వెనుదిరిగారు. అమ్మవారికి ఎనుబోతును బలిచ్చిన తోటి కులస్తులు దాని తలను చాటలో పెట్టుకుని తీసుకెళ్లారు.చాముండేశ్వరి గుడి ఎదురుగా ఉన్న కోనేరులో నీరు లేకపోవడంతో డ్రమ్ముల్లోని నీటితో సుగుటూరు గంగమ్మ, నడివీధి గంగమ్మల నిమజ్జన కార్యక్రమాన్ని గూడూరుపల్లె పూజారులు పూర్తి చేశారు. నిమజ్జన కార్యక్రమం ముగియగానే సుగుటూరు గంగమ్మ విగ్రహాన్ని ఎవరికీ కనిపించనీయకుండా వస్ర్తాలతో చుట్టి ప్యాలె్‌సకు తీసుకొచ్చి భద్రపరిచారు. అలాగే అమ్మవారి శిరస్సు రంగారెడ్డి ఇంటికి, నడివీధి గంగమ్మ బజారువీధికి వెళ్లాయి. ప్యాలె్‌సలో పూజారులు అమ్మవారికి అలంకరించిన అభరణాలను జమీందారు వంశీకులకు అప్పగించి పూజలు చేశారు. అనంతరం జమీందారు వంశీకుల మలి పూజతో సుగుటూరుగంగమ్మ ప్యాలెస్ గృహనిర్బంధంలోకి వెళ్లడంతో జాతర ముగిసింది. మున్సిపల్ కమిషనర్ మధుసూదన రెడ్డి, డీఎస్పీ ప్రభాకర్, సీఐలు రాంభూపాల్, ఉమామహేశ్వర్‌రావు, ఎస్‌ఐ లోకేశ్ నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించారు.జాతర ఘనంగా నిర్వహించిన సుగుటూరు గంగమ్మ సేవా సంఘ సభ్యులను జమీందారు వంశీకులు, అధికారులు అభినందించారు.