బండారం బద్దలు

ABN , First Publish Date - 2022-11-29T01:28:52+05:30 IST

జిల్లాలో జగనన్న విద్యా కానుక కిట్లు కింద పంపిణీ చేసిన స్కూలు బ్యాగుల్లో అక్రమాలు నిజమేనని తేలాయి. విద్యార్థుల కు ఇచ్చిన బ్యాగుల్లో 30వేలకుపైగా పూర్తిగా పాడైపోయి ఎం దుకు వినియోగించడానికి పనికిరావని తాజాగా జిల్లా విద్యా శాఖ తేల్చింది. మండలాలవారీగా విద్యార్థుల బ్యాగులు తనిఖీ చేసి పాడైపోయినవి వేలల్లో ఉన్నట్లు గుర్తించింది. ఈ మేరకు వీటిస్థానంలో కొత్తవి పంపాలని నివేదిక కోరింది.

బండారం బద్దలు
చిరిగిపోయిన స్కూలు బ్యాగులు

-జిల్లాలో చిరిగిపోయిన జగనన్న విద్యాకానుక స్కూలు బ్యాగులు 30,774

-మండలాలవారీగా ఆరాతీసి లెక్క తేల్చిన జిల్లావిద్యాశాఖ

-పంపిణీ చేసిన మూడునెలలకే ముక్కలు ముక్కలు

-పరువు పోతుందనే ఉద్దేశంతో లెక్కలు తక్కువ చూపించిన అధికారులు

-జిల్లాకు నాసిరకం బ్యాగుల సరఫరాతో రూ.4.76కోట్లు కాంట్రాక్టర్‌ పాలు

-పాడైన వాటిస్థానంలో కొత్తవి పంపాలని ఇప్పటికే సర్కారుకు నివేదిక

-అయినా నెలలు గడుస్తున్నా ఉలుకు పలుకు లేని రాష్ట్ర ప్రభుత్వం

-కొత్తవి రాక, పాత చిరిగిపోయిన బ్యాగులు వాడలేక విద్యార్థుల నరకయాతన

(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

జిల్లాలో జగనన్న విద్యా కానుక కిట్లు కింద పంపిణీ చేసిన స్కూలు బ్యాగుల్లో అక్రమాలు నిజమేనని తేలాయి. విద్యార్థుల కు ఇచ్చిన బ్యాగుల్లో 30వేలకుపైగా పూర్తిగా పాడైపోయి ఎం దుకు వినియోగించడానికి పనికిరావని తాజాగా జిల్లా విద్యా శాఖ తేల్చింది. మండలాలవారీగా విద్యార్థుల బ్యాగులు తనిఖీ చేసి పాడైపోయినవి వేలల్లో ఉన్నట్లు గుర్తించింది. ఈ మేరకు వీటిస్థానంలో కొత్తవి పంపాలని నివేదిక కోరింది. దీంతో పంపి ణీ చేసిన బ్యాగుల్లో డొల్లతనం ఇప్పుడు బయటపడ్డట్ల యింది. ఈ ఏడాది జూలైలో జిల్లావ్యాప్తంగా ప్రభుత్వం 1.90లక్షలమం ది విద్యార్థులకు రూ.4.76కోట్ల విలువైన బ్యాగులు పంపిణీ చే యగా మూడు నెలలకే చిరిగిపోయి తుక్కుతుక్కుగా మారా యి. నాసిరకం బ్యాగులతో రూ.4.76కోట్ల మేర ప్రజాధనం కాం ట్రాక్టర్‌ పాలైంది. మరోపక్క చిరిగిన బ్యాగుల స్థానంలో కొత్తవి పంపాలని ఇటీవల రాష్ట్రప్రభుత్వాన్ని జిల్లావిద్యాశాఖ కోరింది.

బండారం బట్టబయలు...

ప్రభుత్వ స్కూళ్లలో విద్యనభ్యసించే విద్యార్థులకు ఉచితంగా జగనన్న విద్యా దీవెన కిట్లు ఇచ్చే పథకాన్ని జగన్‌ ప్రభుత్వం 2020లో ప్రారంభించింది. దీనికింద ఏటా కొత్త విద్యా సంవత్స రం ప్రారంభమయ్యే సమయంలో ప్రతి పాఠశాలలో విద్యార్థు లకు వీటిని అందిస్తోంది. ఒకటినుంచి పది వరకు చదువుకునే ఒక్కో విద్యార్థికి మూడు జతల యూనిఫాం, రెండు జతల సా క్సులు, జత షూ, బెల్టు, బ్యాగు, డిక్షనరీ అందిస్తోంది. కాకినాడ జిల్లాలో 1,90,631 మందికి వీటిని పంపిణీ చేయాల్సి ఉండగా అరకొర స్టాకు రావడంతో రెండున్నర నెలలపాటు ఈ పంపిణీ ప్రక్రియ కొనసాగింది. ఇచ్చిన కిట్లలో స్కూలు బ్యాగులు మాత్రం అత్యంత నాసిరకమైనవి ప్రభుత్వం సరఫరా చేసింది. మూడునెలలు దాటకుండానే చాలావరకు చిరిగిపోయాయి. వే లాది బ్యాగులకు జిప్పులు ఊడిపోవడంతోపాటు ఎక్కడికక్కడ చిరిగిపోయాయి. ఈ బ్యాగులను సరఫరా చేసే సమయంలోనే నాణ్యతపై ఉపాధ్యాయులు సందేహాలు వ్యక్తం చేశారు. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. కొందరు విద్యార్థులు బ్యాగులను పక్కనపడేసి సొంతంగా కొత్తవి కొనుక్కుని వాడుతున్నారు. మ రికొందరు దర్జీలవద్ద కుట్టించుకుని వాడుతున్నారు. ఈ నేప థ్యంలో ప్రభుత్వ తీరుపై విమర్శలు రావడంతో చిరిగిపోయిన బ్యాగులు ఎన్నున్నాయనేదానిపై లెక్కతీసి వివరాలు పంపాలని ఇటీవల ప్రభుత్వం జిల్లావిద్యాశాఖను ఆదేశించింది. దీంతో ఆయా మండలాల్లో స్కూళ్లవారీగా విద్యార్థులు, వారి తల్లిదం డ్రులతో ఉపాధ్యాయులు మాట్లాడి బ్యాగులను పరిశీలించారు. చిరిగిపోయి, ఎందుకూ వినియోగానికి రాని వాటిని లెక్కించా రు. దీంతో జిల్లావ్యాప్తంగా 30,774 బ్యాగులు పూర్తిగా చిరిగి పోయి ఎందుకూ పనికిరావని గుర్తించారు. అత్యధికంగా కోట నందూరు, తుని, జగ్గంపేట, ఏలేశ్వరం, గండేపల్లి, కరప, కాజు లూరు, పెదపూడి, శంఖవరం, సామర్లకోట మండలాల్లో వేలా ది బ్యాగులు పూర్తిగా పాడైపోయాయని తేల్చారు. కాంట్రాక్టర్‌ జిల్లాకు సరఫరా చేసిన బ్యాగుల్లో నాణ్యత ఎంత దారుణంగా ఉందో బయటపడింది. ప్రభుత్వం నాసిరకం బ్యాగుల విష యంలో కాంట్రాక్టర్‌పై కనీసం చర్యలు తీసుకోకపోవడం అనేక అనుమానా లకు తావిస్తోంది. జగనన్న విద్యాకానుక కిట్లకు సంబంధించి ఒక్కో బ్యాగుకు ప్రభుత్వం రూ.250 చొప్పున 1.90 లక్షల బ్యాగు లకు రూ.4.76కోట్లు చెల్లించింది. బ్యాగుల్లో జరిగి న అవినీతితో ప్రభుత్వానికి కోట్లలో నష్టం వాటిల్లినట్లయింది.

కొత్తవి కష్టమే...

జిల్లాలో పూర్తిగా చిరిగిపోయిన 30,774 బ్యాగుల స్థానంలో విద్యార్థులకు కొత్తవి సరఫరా చేయాల్సి ఉందని విద్యాశాఖ తేల్చింది. ఈ మేరకు ప్రభుత్వానికి ఫొటో ఆధారాలతో నివేదిక పంపింది. తిరిగి 30,774 కొత్త బ్యాగులను విద్యార్థులకు ఇవ్వా లని పేర్కొంది. ఈ నివేదిక ప్రభుత్వానికి వెళ్లి చాలారోజులు అవుతోంది. కానీ కొత్త బ్యాగులు ఇచ్చే విషయంలో జగన్‌ ప్రభు త్వం ఉలుకుపలుకు లేకుండా వ్యవహరిస్తోంది. అటు విద్యా శాఖసైతం ప్రభుత్వం కొత్త బ్యాగులు అసలు ఇస్తుందా? లేదా? అనేది తెలియక తలపట్టుకుంటున్నారు. విద్యార్థుల తల్లిదండ్రు లకు సమాధానం చెప్పలేకపోతున్నారు. కొత్తవి వచ్చే వరకు చిరిగిపోయిన పాత బ్యాగులనే వాడాలని చెబుతున్నారు. కొత్త వాటి సరఫరాకు ఇటీవల ప్రభుత్వం టెండర్లు పిలిచింది. కానీ బిల్లులు ఇవ్వదనే భయంతో కాంట్రాక్టర్లు ముందకు రాలేదని తెలిసింది.

Updated Date - 2022-11-29T01:28:54+05:30 IST