Peetala Sujatha: నేరాల్లో ఏపీకి ఏడో స్థానం.. ఇదీ జగన్ పాలన..!
ABN , First Publish Date - 2022-08-29T23:41:57+05:30 IST
సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో మహిళలు, దళితులు, గిరిజనులకు రక్షణ లేదనటానికి ఎన్సీఆర్బీ రిపోర్టే ...

అమరావతి (Amaravati): సీఎం జగన్ మోహన్ రెడ్డి (Cm Jagan Mohan Reddy) పాలనలో మహిళలు, దళితులు, గిరిజనులకు రక్షణ లేదనటానికి ఎన్సీఆర్బీ రిపోర్టే (Ncrb Report) సాక్ష్యమని మాజీ మంత్రి పీతల సుజాత (Ex Minister Peetala Sujatha) అన్నారు. టీడీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన ఆమె రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, అరాచకాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2020తో పోలిస్తే 2021లో ఎస్సీలపై 3.28 శాతం, ఎస్టీలపై 12.81 శాతం నేరాలు పెరిగాయన్నారు. దళితులు, గిరిజనులపై అత్యధిక నేరాలు జరుగుతున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) 7వ స్థానంలో ఉండటం సిగ్గుచేటని పీతల సుజాత విమర్శించారు.
జాతీయ స్థాయిని మించిన రాష్ట్రం
రాష్ట్రంలో ఎస్టీలపై నేరాల రేటు (13.7 శాతం) జాతీయ స్థాయి (8.4 శాతం) కంటే చాలా ఎక్కువగా ఉందని మాజీ మంత్రి పీతల సుజాత మండిపడ్డారు. మహిళలపై అత్యాచారాలు గతేడాది కంటే ఈ ఏడాది 8.49 శాతం పెరిగాయని చెప్పారు. 2021లో మహిళలపై 17,752 నేరాలు జరిగాయంటే రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఏంటో అర్దమౌతోందన్నారు. నిందితుల్లో ఎక్కువమంది వైసీపీ నేతలు, కార్యకర్తలేనని పీతల సుజాత తెలిపారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు (Mlc Ananthababu) దళిత యువకుడ్ని చంపి కారులో వేసుకుని తిరిగినా చర్యలు లేవని వ్యాఖ్యానించారు. గంట, అరగంట అంటూ మహిళలతో అసభ్యంగా మాట్లాడినా, ఎంపీ గోరంట్ల మాధవ్ (Mp Gorantla Madhav) బట్టలిప్పి వీడియో కాల్ చేసినా చర్యలు శూన్యమన్నారు. రాష్ట్రంలో దళిత, గిరిజన, మహిళా వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని.. వైసీపీ అరాచక పాలనలను తరిమికొట్టేందుకు దళితులు, గిరిజనులు, మహిళలు సిద్ధంగా ఉన్నారని పీతల సుజాత తెలిపారు.