Medak: మత్తులో ఉన్న మహిళలపై జ్యోతిష్కుడి లైంగిక దాడి
ABN , Publish Date - Mar 21 , 2025 | 04:13 AM
బాపు స్వామి బ్లాక్‌మెయిల్ వ్యవహారంపై వచ్చిన ఓ ఫిర్యాదు మేరకు నిఘా పెట్టిన పోలీసులు నర్సాపూర్‌లో అతడిని అరెస్టు చేశారు. బాపు స్వామి మొబైల్‌లో పలువురు మహిళలకు సంబంధించిన వీడియోలను పోలీసులు గుర్తించారు.

ఆపై వీడియోలు తీసి బెదిరింపు, డబ్బు వసూళ్లు నిందితుడు బాపు స్వామి అరెస్టు
మెదక్ అర్బన్, మార్చి 20(ఆంధ్రజ్యోతి): జాతక సమస్యలను, కుటుంబ సమస్యలను మంత్రాలు, పూజలతో మాయం చేస్తానని నమ్మించి నిద్రమాత్రలు కలిపిన నీళ్లను తాగించి.. మహిళలపై లైంగిక దాడికి పాల్పడుతూ వీడియోలు తీసి, వాటిని చూపించి డబ్బు వసూళ్లకు పాల్పడుతున్న బాపు స్వామి అనే ఓ దొంగ జ్యోతిష్కుడిని మెదక్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్‌కుమార్ రెడ్డి గురువారం విలేకరులకు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలోని అనుపురం గ్రామానికి చెందిన బుడగజంగం బొమ్మెర బాపుస్వామి అలియాస్ శివస్వామి తానో జ్యోతిష్కుడినని ప్రచారం చేసుకునేవాడు. జాతకం చెబుతానని, కుటుంబ, ఆరోగ్య సమస్యలు పరిష్కరిస్తానని జనాన్ని నమ్మించి పలు పూజలు చేస్తుండేవాడు. మెదక్ జిల్లాతోపాటు పలు జిల్లాల్లో తిరుగుతూ తన విజిటింగ్ కార్డులు పంచేవాడు. ఈ ప్రచారాన్ని నమ్మి మహిళలు ఎవరైనా తన దగ్గరికి ఒంటరిగా వస్తే.. వారి వివరాలను తెలుసుకునేవాడు.
సమస్యల పరిష్కారానికి పూజలు చేయాలని చెప్పి.. నిమ్మకాయ, పసుపు, కుంకుమ వాసనలు చూపిస్తాడు. ఈ క్రమంలో నిద్ర మాత్రలు కలిపిన నీటిని వారితో తాగించేవాడు. మహిళలు మత్తులోకి జారుకోగానే వారిని వివస్త్రలను చేసి కామవాంఛ తీర్చుకునేవాడు. ఈ దుశ్చర్య మొత్తాన్ని తన మొబైల్ ఫోన్‌లో రికార్డు చేసేవాడు. ఆపై, ఆ వీడియోలను చూపించి ఆయా మహిళలను బెదిరించి వారి ఆర్థిక పరిస్థితి ప్రకారం వేల నుంచి రూ.లక్షల్లో డబ్బు వసూలు చేసేవాడు. ఆ డబ్బుతో విలాసవంతంగా జీవించేవాడు. వరంగల్, మెదక్, సంగారెడ్డి, తూప్రాన్, నర్సాపూర్‌తోపాటు ఇతర జిల్లాలో కూడా బాపు స్వామి బాధితులు ఉన్నట్టు తెలిసింది. బాపు స్వామి బ్లాక్‌మెయిల్ వ్యవహారంపై వచ్చిన ఓ ఫిర్యాదు మేరకు నిఘా పెట్టిన పోలీసులు నర్సాపూర్‌లో అతడిని అరెస్టు చేశారు. బాపు స్వామి మొబైల్‌లో పలువురు మహిళలకు సంబంధించిన వీడియోలను పోలీసులు గుర్తించారు.