లీజుపై.. వివాదం
ABN , First Publish Date - 2022-10-24T00:31:48+05:30 IST
అవి విలువైన వక్ఫ్ భూములు. వాటిని అధికార వైసీపీ నేతలు చెర పట్టేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు

వక్ఫ్ భూములపై కన్నేసిన నేతలు
11 నెలలకే లీజు అంటున్న ముతవల్లి
33 ఏళ్లకు తీసుకున్నానంటున్న వైసీపీ నేత
షోకాజ్ నోటీసుతో సరిపెట్టిన వక్ఫ్‌బోర్డు సీఈవో
గుంటూరు, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): అవి విలువైన వక్ఫ్ భూములు. వాటిని అధికార వైసీపీ నేతలు చెర పట్టేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. రెడ్డిపాలెం, మల్లాయపాలెం, ప్రత్తిపాడులో ఖాళీగా ఉంటోన్న ఈ భూములను లీజు ప్రాతిపదికనో, రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి కబ్జా చేసేందుకో విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవలే దాదాపుగా రూ.55 కోట్ల విలువ చేసే 3.49 ఎకరాల భూమిని కొంతమంది వైసీపీ నాయకులు కాజేసేందుకు ప్రయత్నించగా ఆంధ్రజ్యోతి కథనాలతో వాటికి బ్రేక్ పడింది. కాగా గుట్టుచప్పుడు కాకుండా వ్యవసాయ అవసరాల పేరుతో 11 నెలలకు 10.50 ఎకరాల భూమిని వైసీపీ నేత లీజుకు తీసుకుని తనకు 33 ఏళ్లకు ఇప్పందం చేశారని వాదిస్తోన్న వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. గుంటూరు లాలాపేట పెద్దమసీదుకు చెందిన వక్ఫ్‌భూములు రెడ్డిపాలెంలో 244.34 ఎకరాలు, మల్లాయపాలెంలో 7 ఎకరాలు, ప్రత్తిపాడులో 226.18 ఎకరాలున్నాయి. ఇవి క్రమక్రమంగా అన్యాక్రాంతం అవుతున్నాయి. గుంటూరు నగరం విస్తరిస్తుడటంతో ఇప్పుడు ఆ భూములు మున్సిపల్ కార్పొరేషన్ పరిఽధిలోకి వచ్చాయి. ప్రత్తిపాడు, మల్లాయపాలెం భూములు మాత్రం అలానే ఉన్నాయి. రెడ్డిపాలెంలోని భూములు కొన్నేళ్లుగా ఆక్రమణలకు గురౌతూ వస్తోన్నాయి. కొన్ని సందర్భాల్లో పూరిపాకలు వేయగా పోలీసులు, రెవెన్యూ అధికారులు తొలగించారు. అయితే సరైన అజమాయిషి కొరవడటంతో ఇప్పుడు ఎన్ని ఎకరాల భూమి ఉందో తెలియని పరిస్థితి ఉన్నది. ఇన్నర్‌రింగురోడ్డుకు సమీపంలో ఉండటంతో రెడ్డిపాలెం వక్ఫ్ భూములకు ధర పెరిగింది. దీంతో అఽధికార పార్టీ నేతలు ఏదో ఒక విధంగా వాటిని చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
పంటలు సాగుకాకున్నా లీజుకు..
రెడ్డిపాలెంలోని వేర్వేరు సర్వే నెంబర్లలో వక్ఫ్ బోర్డుకు 10.50 ఎకరాల భూమి ఉంది. ఈ భూముల్లో పంటలు ఏవి సాగు కావడం లేదు. అయినప్పటికీ వ్యవసాయ అవసరాల పేరుతో ఈ భూములను వైసీపీ నాయకుడు ఒకరు కొన్ని రోజుల క్రితం లీజుకు తీసుకున్నారు. అయితే అతడి వెనుక పెద్దలున్నారన్నది బహిరంగ రహస్యమే. భూములకు సంబంఽధించి లీజ్ అగ్రిమెంట్‌ని ఎగ్జిక్యూట్ చేసిన ముతవల్లి తాను నిబంధనల ప్రకారం వ్యవసాయ సీజన్(11 నెలలకు) మాత్రమే ఇచ్చానని చెబుతున్నారు. మరోవైపు లీజు పొందిన వైసీపీ నాయకుడు మాత్రం తనకు 33 ఏళ్లకు లీజు అగ్రిమెంట్ చేశారని వక్ఫ్‌బోర్డు సీఈవోకు నివేదించారు. దీనిపై వివాదం కొనసాగుతున్నది. ముతవల్లికి సీఈవో షోకాజ్ నోటీసు జారీ చేసి మిన్నకుండిపోయారు. మరోవైపు మూడు రోజుల క్రితం మరో అధికార పార్టీ నాయకుడు 3.49 ఎకరాలు కాజేసేందుకు పెద్ద స్కెచ్ వేశారు. అయితే దానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు 33 ఏళ్ల లీజు వివాదంపై కూడా దృష్టి పెట్టాలని ముస్లిం మైనార్టీ వర్గాలు కోరుతున్నాయి.