మోదీ రాకపై వైసీపీ హడావుడి!

ABN , First Publish Date - 2022-11-02T06:07:04+05:30 IST

ప్రధాని మోదీ విశాఖపట్నం పర్యటనపై రసవత్తరమైన రాజకీయం నడుస్తోంది. ఆయన ఈ నెల 11, 12 తేదీల్లో ఇక్కడకు వస్తారని, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారని వైసీపీ నేతలు వారం రోజులుగా ఊదరగొడుతున్నారు.

మోదీ రాకపై వైసీపీ హడావుడి!
MODI

రైల్వే జోన్‌కు శంకుస్థాపన చేస్తారంటూ ప్రచారం

11న రాత్రి విశాఖకు ప్రధాని?.. మర్నాడు బహిరంగ సభ

పలు పనులకు శంకుస్థాపన.. రాష్ట్ర బీజేపీకి సమాచారమే లేదు

జోన్‌ క్రెడిట్‌ కొట్టేసేందుకు వైసీపీ నేతల రాజకీయం

సొంత మీడియాలో కథనాలు.. దీనిపై బీజేపీ కోర్‌ కమిటీ భేటీ

రైల్వే జోన్‌ శంకుస్థాపన వద్దని కేంద్ర పెద్దలకు విన్నపం?

లేదంటే పార్టీకి నష్టమని నివేదన

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ విశాఖపట్నం పర్యటనపై రసవత్తరమైన రాజకీయం నడుస్తోంది. ఆయన ఈ నెల 11, 12 తేదీల్లో ఇక్కడకు వస్తారని, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారని వైసీపీ నేతలు వారం రోజులుగా ఊదరగొడుతున్నారు. రాష్ట్ర బీజేపీ నేతలకు మాత్రం ఎటువంటి సమాచారమూ లేదు. దీనిపై వారిని ప్రశ్నిస్తే.. ప్రధాని పర్యటన వివరాలు ఇంతవరకు రాష్ట్ర శాఖకు అందలేదని చెబుతున్నారు. జిల్లా అధికారులు కూడా తొలుత తమకు సమాచారం లేదన్నారు. ఇప్పుడు మాత్రం ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 11, 12 తేదీల్లో ప్రధాని పర్యటన ఉంటుందని, వివరాలు రావలసి ఉందని కలెక్టర్‌ తెలిపారు. 11వ తేదీ రాత్రి 7 గంటలకు మోదీ విశాఖ చేరుకుంటారని, నేవీ అతిథిగృహం ఐఎన్‌ఎస్‌ చోళలో బస చేస్తారని సమాచారం. మరుసటి రోజు (12వ తేదీ) ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో బహిరంగ సభలో పాల్గొంటారని, అందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌, విశాఖ నగర పోలీసు కమిషనర్‌ వివిధ శాఖల పరంగా చేపట్టాల్సిన చర్యలపై మంగళవారం సమావేశాలు నిర్వహించారు.

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్‌ కూడా జిల్లా అధికారులతో ప్రధాని పర్యటనపై చర్చించారు. బహిరంగ సభకు కనీసం లక్ష మంది వస్తారని, అందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ భేటీకి వాల్తేరు రైల్వే డివిజనల్‌ మేనేజర్‌ను కూడా పిలవడం గమనార్హం. నగరంలో ఇంత హడావుడి జరుగుతున్నా.. బీజేపీ శ్రేణులకు సమాచారం లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా ప్రధాని వస్తే.. ఆయన సభకు జనసమీకరణ చేయాల్సిన బాధ్యత ఆయన పార్టీ బీజేపీది. గతంలో అలాగే చేశారు. ఇప్పుడు వైసీపీ జనసమీకరణ చేయడం గమనార్హం. 11వ తేదీ రాత్రి ప్రధాని వస్తారని, ఆ సందర్భంగా నగరంలో ర్యాలీ నిర్వహించాలని మాత్రమే బీజేపీ నేతలకు వర్తమానం అందింది. సభ, జన సమీకరణ గురించి చెప్పలేదు.

జోన్‌పై స్పష్టత ఏదీ?

గత ఎన్నికల ముందు విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను మోదీ ప్రభుత్వం ప్రకటించింది. ఓఎ్‌సడీని కూడా నియమించింది. కానీ మూడున్నరేళ్లు దాటినా జోన్‌ ఏర్పాటు పనులు ప్రారంభం కాలేదు. ఎప్పుడు మొదలుపెడతారో చెప్పడం లేదు. డీపీఆర్‌ పరిశీలనలో ఉందని సా..గదీస్తూనే ఉన్నారు. పార్లమెంటులో అడిగినా ఇదే జవాబు. దీంతో ఉత్తరాంధ్ర ప్రజల్లో అనుమానాలు రెకెత్తుతున్నాయి. దక్షిణ కోస్తా జోన్‌ ఏర్పాటు లాభదాయకం కాదని.. అందుచేత ఏర్పాటు ఉద్దేశం లేదని రైల్వే బోర్డు చైర్మన్‌ ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోం శాఖ ఏర్పాటు చేసిన సమావేశంలో చెప్పారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో.. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అదేమీ లేదన్నారు. ఎప్పటిలాగే డీపీఆర్‌ పరిశీలనలో ఉందని చెప్పారు. గతంలో కూడా కేంద్రం జోన్‌ ప్రకటన చేయకముందు టీడీపీ విశాఖకు రైల్వేజోన్‌ వస్తుందని పలుమార్లు ప్రకటించింది. అయితే ఆ క్రెడిట్‌ టీడీపీకి వెళ్లకూడదని బీజేపీ పలుమార్లు వాయిదా వేయించింది. గత ఎన్నికల ముందు తానే జోన్‌ ప్రకటించింది. కానీ ఇప్పుడా పనులకు మోదీ ద్వారా శంకుస్థాపన చేయించి.. ఆ క్రెడిట్‌ మొత్తం తానే కొట్టేయాలని వైసీపీ యత్నిస్తోంది.

ఈ పర్యటనలోనే ప్రధాని విశాఖలో రైల్వేజోన్‌ కార్యాలయానికి శంకుస్థాపన చేస్తారని, 11 ఎకరాల్లో రూ.108 కోట్లతో నిర్మాణాలు చేపడతారంటూ.. వాటి డిజైన్లతో సొంత పార్టీ అనుకూల పత్రికలో రోజూ కథనాలు ఇస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ కోర్‌ కమిటీ సోమవారం నగరంలో సమావేశమైంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీవీఎన్‌ మాధవ్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్‌రాజు తదితరులు హాజరయ్యారు. అనేక తంటాలు పడి తాము జోన్‌ తీసుకొస్తే.. దాని శంకుస్థాపన ద్వారా వైసీపీ క్రెడిట్‌ తీసుకుంటోందని, దీనివల్ల బీజేపీకి నష్టం జరుగుతున్నందున ప్రధాని ప్రస్తుత పర్యటనలో ఈ కార్యక్రమాన్ని తొలగిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని ఢిల్లీ నేతలకు నివేదించారు. వారి నిర్ణయం కోసం వేచిచూస్తున్నారు.

11న స్టీల్‌ప్లాంట్‌ బంద్‌

ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తీర్మానం

ఉక్కుటౌన్‌షిప్‌, నవంబరు 1: ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 11న విశాఖ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో.. ఆ రోజు పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తీర్మానించింది. స్టీల్‌ప్లాంట్‌ టౌన్‌షి్‌పలో మంగళవారం జరిగిన కమిటీ సమావేశం పలు నిర్ణయాలు తీసుకుంది. ఆ రోజు స్టీల్‌ ప్లాంట్‌ బంద్‌ చేయాలని, నగర వాసులంతా ఇంటిపై నల్ల జెండా ఎగురవేయాలని, బైక్‌ ర్యాలీ చేపట్టాలని తీర్మానించింది. విశాఖ పర్యటనకు వస్తున్న ప్రధానమంత్రి... స్టీల్‌ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని ప్రకటన చేయాలని డిమాండ్‌ చేసింది. లేకపోతే ఉక్కు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించింది. ఈ సమావేశంలో ఉక్కు పోరాట కమిటీ చైర్మన్లు డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్‌, సీహెచ్‌ నరసింగరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-02T07:04:16+05:30 IST