AP News : అక్రమాలను ప్రశ్నిస్తే.. వైసీపీ నేతలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు: దాసరి శ్యామ్ చంద్రశేషు
ABN , First Publish Date - 2022-08-22T00:30:11+05:30 IST
జంగారెడ్డిగూడెం (ఏలూరు జిల్లా): శ్రీకాకుళం జిల్లా పలాసలో టీడీపీ నాయకులపై మంత్రి సిదిరి అప్పలరాజు వేధింపులు ఎక్కువయ్యాయని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్రశేషు ఆరోపించారు. ఆయన

జంగారెడ్డిగూడెం (ఏలూరు జిల్లా): శ్రీకాకుళం (Srikakualam) జిల్లా పలాసలో టీడీపీ (TDP) నాయకులపై మంత్రి సిదిరి అప్పలరాజు (Appalaraju) వేధింపులు ఎక్కువయ్యాయని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్రశేషు ఆరోపించారు. ఆయన అక్రమాలపై ప్రశ్నించిన వారిపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, భూకబ్జాలు, ఇసుక మాఫియాపై ప్రశ్నించినందుకు మున్సిపల్ కౌన్సిలర్, టీడీపీ నాయకుడు సూర్యనారాయణ ఇంటిని కూల్చేందుకు యత్నించడం దారుణమన్నారు.సూర్యనారాయణను కలిసి పరామర్శించడానికి బయల్దేరిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. అధికార పార్టీ మంత్రులు, నాయకులు చేతల్లో పోలీసులు కీలుబొమ్మలుగా మారరని విమర్శించారు. పలాస వెళ్లకుండా లోకేష్‌ను అడ్డుకోవడంతో జగన్ పతనం మొదలైందని చంద్రశేషు పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే..
పలాసలో భూకబ్జాలు, ఆక్రమణలపై టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య కొద్ది రోజులుగా మాటల యుద్ధం నడుస్తోంది. రెండు రోజుల క్రితం ఆక్రమణల పేరుతో టీడీపీ నేతలతో పాటు ఇతరుల ఇళ్లను కూల్చేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. చెరువును ఆక్రమించి నిర్మించావంటూ.. పలాస 27వ వార్డు కౌన్సిలర్, టీడీపీకి చెందిన సూర్యనారాయణ ఇళ్లను కూలగొట్టేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సూర్యనారాయణను కలిసి పరామర్శించడానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు పోలీసులు అడ్డుకున్నారు.