NewYear 2023: కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టేముందు ఈ 4 విషయాలు మరచిపోవద్దు!
ABN , First Publish Date - 2022-12-20T18:00:08+05:30 IST
కొందరికి ఆనంద క్షణాలు.. మరికొందరికి చేదుజ్ఞాపకాలను మిగిల్చిన సంవత్సరం 2022 చూస్తుండగానే దాదాపు గడచిపోయింది. మరో 10 రోజుల్లో పాత సంవత్సరానికి గుడ్‌బై చెప్పి.. నూతన ఏడాది 2023కు స్వాగతం పలుకబోతున్నాం.
న్యూఢిల్లీ: కొందరికి ఆనంద క్షణాలు.. మరికొందరికి చేదుజ్ఞాపకాలను మిగిల్చిన సంవత్సరం 2022 చూస్తుండగానే దాదాపు గడచిపోయింది. మరో 10 రోజుల్లో పాత సంవత్సరానికి గుడ్‌బై చెప్పి.. నూతన ఏడాది 2023కు స్వాగతం పలుకబోతున్నాం. అయితే సరికొత్త తీర్మానాలతో నూతన ఏడాదిలోకి అడుగుపెట్టాలని చాలామంది భావిస్తుంటారు. కొత్త లక్ష్యాల్లో ఆర్థిక అంశాలు కూడా ఉంటాయి. ఇందుకు సంబంధించి ఆదాయం, పెట్టుబడులు, ట్యాక్స్ ప్లానింగ్స్ చాలా ముఖ్యమైనవి. కాబట్టి ఈ తీర్మానాలపై నిపుణులు ఏం చెబుతున్నారో ఒక లుక్కేద్దాం..
అత్యవసరాల కోసం క్యాష్ రిజర్వ్ చేసుకోండి..
కొన్నిసార్లు ఊహించని ఖర్చులు ఎదురవుతుంటాయి. బైక్ లేదా కారు రిపేర్ లేదా ఆరోగ్య సమస్యల కారణంగా అత్యవసర ఖర్చులు పెట్టాల్సి ఉంటుంది. ఈ వ్యయాలు పెరుగుతాయే తప్ప తగ్గే పరిస్థితులు దాదాపు ఉండవు. అందుకే 3 - 6 నెలలకు సరిపడా జీవన వ్యయాలను ఎప్పుడూ సంసిద్ధంగా ఉంచుకోవడం ఉత్తమమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ లేకుండా ఉండొద్దు..
వైద్యం, జీవిత బీమాకు సంబంధించి సరైన కవరేజీ లేకుంటే వ్యక్తిగత ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యే ప్రమాదం పొంచివుంటుంది. గత రెండేళ్లలో కొవిడ్ సృష్టించిన ఆపదకాలమే ఇందుకు చక్కటి ఉదాహరణ. ఎన్నో కుటుంబాలు వైద్యాన్ని భరించలేక ఆర్థికంగా చితికిపోయాయి. ఎంతోమంది అప్పులపాలయ్యారు. కాబట్టి ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వచ్చే ఏడాది 2023లో హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడెలా ఉంటాయో చెప్పలేం. కుటుంబ సభ్యుల క్షేమం కోసమైనా హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవడం క్షేమకరం.
అప్పులను దృష్టిలో ఉంచుకోండి..
వ్యక్తిగత ఆర్థికాంశాలకు సంబంధించి అప్పులు (Debts) చాలా ముఖ్యమైనవి. అందుకే కొత్త ఏ పని చేసినా అప్పులను దృష్టిలో ఉంచుకుని ముందడుగు వేయాలి. వినియోగదారులు నగదుకు బదులు తమ క్రెడిట్ కార్డులను తెలివిగా ఉపయోగించుకోవడం ఉత్తమం. డిస్కౌంట్స్, క్యాష్‌బ్యాక్, ఇతర రివార్డులను పొందేందుకు ప్రయత్నించాలి. నెలవారీ బకాయిలను సకాలంలో చెల్లించేందుకు తీర్మానం చేసుకోవాలి. క్లీన్ క్రెడిట్ హిస్టరీ వినియోగదారులకు అత్యవసర సమయాల్లో అక్కరకొస్తుంది. ముఖ్యంగా పెద్ద లోన్లు చెల్లింపు సమయాల్లో పనిలేక చేతిలో డబ్బులేకపోతే ఈఎంఐలు చెల్లింపు కోసం ఎమర్జెన్సీ నిధులను ఉపయోగించుకోవచ్చు.
పెట్టుబడులు ప్రణాళికాబద్ధంగా ఉండాలి..
ఎవరో ఒక ఫ్రెండ్ చెప్పాడని కేవలం ట్యాక్స్ సేవింగ్ కోసం పెట్టుబడి పెట్టడం అంత ప్రయోజకరం కాదు. స్వల్పకాలం, మధ్య, దీర్ఘకాల లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడులు పెట్టాలి. సీజన్ల వారీగా పెట్టుబడుల కోసం తహతహలాడడం కూడా అంతమంచిది కాదు. కాబట్టి లక్ష్యాలకు అనుగుణంగా అసెట్ క్లాసులను ఎంచుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి నిపుణుల సలహా మేరకు పెట్టుబడుల ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని చెబుతున్నారు.