సంక్షేమం అమలుకు సరైన దారేది?

ABN , First Publish Date - 2022-11-22T02:45:42+05:30 IST

ప్రభుత్వసేవల పంపిణీ మెరుగ్గా ఉండడం ఎలా సాధ్యమవుతుంది? స్థానిక సంస్థలకు అధికారాలు బదలాయించడం వలన కాక, సేవల పంపిణీ కేంద్రీకృతంగా జరగడం ద్వారా మాత్రమేనని తమిళనాడు ఆర్థిక మంత్రి పళనివేల్‌...

సంక్షేమం అమలుకు సరైన దారేది?

ప్రభుత్వసేవల పంపిణీ మెరుగ్గా ఉండడం ఎలా సాధ్యమవుతుంది? స్థానిక సంస్థలకు అధికారాలు బదలాయించడం వలన కాక, సేవల పంపిణీ కేంద్రీకృతంగా జరగడం ద్వారా మాత్రమేనని తమిళనాడు ఆర్థిక మంత్రి పళనివేల్‌ త్యాగరాజన్ నొక్కి చెప్పారు. సేవలను కేంద్రీకృతంగా అందించడం వల్లే గ్రామీణ ప్రాంతాలలో సమానత్వం సాకారమయిందని ఆయన అన్నారు. నిజానికి గ్రామ స్థాయిలో స్వపరిపాలన సంస్థలకు అధికారాలు కట్టబెడితే కులం, మతం తదితర అంశాలు ప్రభావితం చేసి అర్హులకు ప్రభుత్వ ఫలాలు అందవనే అర్థంలో ఆయన ఇటీవల ఒక సమావేశంలో మాట్లాడారు.

తమిళనాడు మంత్రి వ్యాఖ్యల్ని రాజకీయ నాయకుల వాగాడంబరంగా కొట్టి పారెయ్యొచ్చు. అయితే ఆయన దేశంలో పలు మానవాభివృద్ధి సూచీలలో, ప్రభుత్వసేవల పంపిణీలో ముందంజలో ఉన్న తమిళనాడు రాష్ట్ర ప్రతినిధి. అంతకుమించి ద్రావిడ అభివృద్ధి నమూనా గురించి సాధికారంగా మాట్లాడగల వ్యక్తి. కనుకనే త్యాగరాజన్‌ వ్యాఖ్యలు సహజంగానే పరిశోధకులు, సామాజిక కార్యకర్తల దృష్టిని మరొకసారి ప్రభుత్వసేవల పంపిణీ నమూనాకు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న వైపు మళ్లించాయి.

భారత దేశంలో ప్రభుత్వ సేవల పంపిణీపై విస్తృతంగా పరిశోధన చేసిన అమెరికాలో జార్జ్ టౌన్ యూనివర్సిటీ ‘ప్రొఫెసర్ రాజేష్ వీరరాఘవన్’– ప్రభుత్వాల చిత్తశుద్ధితో పాటూ, పథకాల రూపకల్పన, దిగువ స్థాయిలో అధికారుల-నాయకుల కుమ్మక్కు అనే అంశాలు ప్రభుత్వ పథకాల అమలు విజయాన్ని నిర్దేశిస్తాయని ‘Patching Development’ అనే తన పరిశోధనలో ప్రొఫెసర్ రాజేష్ వీరరాఘవన్‌ నిర్ధారించారు. అమెరికాలోని జార్జి టౌన్ విశ్వవిద్యాలయ ఆచార్యుడైన రాజేష్‌ మన దేశంలో ప్రభుత్వ సేవల పంపిణీపై విస్తృతంగా పరిశోధన చేసిన సామాజిక శాస్త్రవేత్త. ఒక వాస్తవం ఏమిటంటే ప్రభుత్వ పథకాల వైఫల్యాలలో పాలకుల రాజకీయ చిత్తశుద్ధి పాత్ర గురించి జరిగినంతగా ఇతర అంశాలపై చర్చ జరగలేదు.

మన దేశంలో ప్రభుత్వ సేవల పంపిణీకి సంబంధించి విస్తృతంగా రెండు ప్రధాన నమూనాలు ఉన్నాయి. మొదటిది, ప్రభుత్వ సేవలు పంచాయితీల కనుసన్నలలోనే అమలు చేయడం; రెండోది, పథకాల అమలు బాధ్యత పూర్తిగా కేంద్రీకృతంగా ఉండటం. మొదటి నమూనాలో పథకాలకి సంబంధించి ప్రభుత్వాలు నియమ నిబంధనలు రూపొందించడానికి మాత్రమే పరిమితమవుతాయి. లబ్ధిదారుల ఎంపిక నుంచి పథకాల ప్రయోజనాలు అందించడం వరకూ మొత్తం ప్రక్రియ పంచాయితీ స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో మాత్రమే జరుగుతుంది. రెండో నమూనాలో స్థానిక సంస్థల బాధ్యత నామమాత్రంగా ఉంటుంది. పంచాయితీలకు పథకాల లబ్ధిదారుల ఎంపిక నుంచి పథకాల ప్రయోజనాల వరకూ ఎలాంటి పాత్రా ఉండదు. అమలులో అన్ని దశలూ రాష్ట్ర/ కేంద్ర స్థాయిలోనే నిర్ణయమవుతాయి. దీనినే ‘టాప్ డౌన్ మోడల్’ అంటున్నారు.

నిజానికి ఈ చర్చకు మన దేశంలో ఒక చారిత్రక, తాత్విక నేపథ్యం ఉంది. భారత జాతీయోద్యమ కాలంలోఅత్యంత ప్రజాదరణ గల నాయకులైన మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ అంబేడ్కర్‌లు ఈ దేశ అభివృద్ధికి సంబంధించి పైన పేర్కొన్న రెండు వేర్వేరు మార్గాలు ఎంచుకున్నారు. మహాత్ముడు గ్రామ స్వరాజ్యం ప్రబోధిస్తే బాబాసాహెబ్ దానికి పూర్తి విరుద్ధమైన మార్గానికి ప్రాధాన్యమిచ్చారు. గ్రామాలు దేశానికి వెన్నెముక అని గాంధీ విశ్వసించారు. గ్రామాల స్వయం ప్రతిపత్తి, స్వయం సమృద్ధి ద్వారా మాత్రమే దేశ అభివృద్ధి సాధ్యమని అయన భావించారు. గాంధీ భావనలో స్వయంప్రతిపత్తి, స్వయం సమృద్ధి కలిగిన గ్రామాలు ఏర్పడితే వాటికవే ఒక ఆదర్శ సంప్రదాయ సమాజం తయారవుతుంది. ఈ సమాజాలలో ప్రతి ఒక్కరూ మిగిలిన వారితో సామరస్యంగా జీవిస్తారు. గాంధీజీ ‘గ్రామ స్వరాజ్య దార్శనికత’ తో అంబేడ్కర్ తీవ్రంగా విభేదించేరు. ‘What Congress and Gandhi have done to the Untouchables’ అనే పుస్తకంలో ‘గాంధేయ వాదం ధనిక వర్గాల, విశ్రాంతి వర్గాల సిద్ధాంతం’ అని బాబా సాహెబ్ అభివర్ణించారు. ‘గ్రామం అంటే స్థానికత, అజ్ఞానం, సంకుచితత్వం, మతతత్వాల గుహ తప్ప మరొకటి కాదు’ అని రాజ్యాంగ నిర్మాణ చర్చలలో అంబేడ్కర్ అన్నారు. సామాజిక అంతరాలతో కునారిల్లుతున్న గ్రామాలకు స్వయంప్రతిపత్తి వల్ల బలమైన వర్గాలు పక్షపాతంతో వ్యవహరిస్తాయని, ఆ బలాఢ్యులు మిగిలిన వారి స్వేచ్ఛను దెబ్బతీయవచ్చని ఆయన ఊహించారు. అణగారిన వర్గాల సమస్యల పరిష్కారానికి బలమైన కేంద్రీకృత ప్రభుత్వ పాలన అంటే ‘టాప్ డౌన్ మోడల్‌’కు అంబేడ్కర్ ప్రాధాన్య మిచ్చారు.

ఇప్పుడిక ఈ తాత్విక భూమికలు ఆచరణలో ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవడానికి ‘జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం’ (నరేగా) ఉదాహరణగా పరిశీలిద్దాం. దేశంలో ఉపాధి హామీ పథకం కొన్ని రాష్ట్రాలలో పంచాయితీల ఆధ్వర్యంలోనూ మరికొన్ని రాష్ట్రాలలో టాప్ డౌన్ పద్ధతిలోనూ అమలవుతోంది. ఉపాధి హామీ చట్టం ప్రకారం గ్రామీణ కుటుంబాలకు సాలీనా 100 రోజులు కనీసం పని కల్పించాలి. పని కల్పన ఎక్కువగా జరిగితే పథకం అమలు బాగా ఉన్నట్లు మనం భావించవచ్చు. ఇప్పుడు పథకం క్రింద పని కల్పన అంశాన్ని పంచాయితీలకు అప్పగిస్తే ఏమి జరుగుతుంది లేదా టాప్ డౌన్ క్రింద అమలు చేస్తే ఏమి జరుగుతుందో చూద్దాం.

ఉపాధి హామీ అమలు పంచాయితీలకు అప్పగిస్తే స్థానిక ప్రజాప్రతినిధులుగా సర్పంచులు కీలక బాధ్యతలు పోషిస్తారు. ఉపాధి హామీ పథకం అమలు బాగా జరిగితే సర్పంచు లకు ప్రజాదరణ పెరిగి తద్వారా ఎన్నికలలో వారి గెలుపు అవకాశాలు పెరుగుతాయి. కార్మికులకు ఉపాధి పనులు ఎక్కువగా లభించడానికి అవకాశం ఉంది. ఈ వాదన వినడానికి బాగున్నట్లు అనిపించినా, అమలు విషయానికి వచ్చే సరికి పరిస్థితి వేరేలా ఉంటుంది. సర్పం చులుగా ఎన్నికైన వారు సాధారణంగా పెద్ద రైతులు, అగ్ర కుల భూస్వామ్య వర్గాల నుంచి వచ్చిన వారు కావడం వలన ఉపాధి హామీ వలన కూలి రేట్లు పెంచాల్సివస్తుందని, అసలు ఆ పథకమే ఉండకూడదని భావించడం కద్దు. ఈ స్థితిలో సర్పంచులు తమ వర్గ ప్రయోజనాలు పక్కన పెట్టి దళిత, ఆదివాసీ, ఇతర పేదశ్రామిక వర్గాల ప్రయో జనాల కోసం పని చేస్తారా అనేది ముఖ్యమైన ప్రశ్న.

ఇక రెండో నమూనాలో అంటే టాప్ డౌన్ పద్దతిలో ఉపాధి హామీ పథకం ఎలా అమలవుతుందో పరిశీలిద్దాం. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాలలో ఈ పథకం అమలులో పంచాయితీల పాత్ర దాదాపు నామమాత్రమే. ఈ రాష్ట్రాలలో ఉపాధి హామీ అమలులో కీలక పాత్ర పోషించేది సర్పంచ్ కాదు, రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగి అయిన ఫీల్డ్ అసిస్టెంట్. సర్పంచ్ లానే ఇతను కూడా కావాలంటే కార్మికులకు పని ఇవ్వడం, లేదంటే మానేయడం చేయగలడు. కాకపొతే వీరు తమకు అప్పగించిన పని పూర్తి చేయలేకపోతే ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంది. సర్పంచ్ నైతే ఏమి చేయలేని ఉన్నతాధికారులు ఫీల్డ్ అసిస్టెంట్‌ను మాత్రం క్షణాలలో తొలగించగలరు. అందువలన కార్మికులకు కచ్చితంగా పని కల్పించడానికి వీరు సుముఖంగా ఉంటున్నారు. ఉపాధి హామీని పంచాయితీల ఆధ్వర్యంలో అమలు చేస్తున్న పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలతో పోల్చితే కేంద్రీకృత పద్ధతిలో అమలు పరుస్తున్న తమిళనాడు, ఉభయ తెలుగు రాష్ట్రాలే మంచి ఫలితాలు సాధిస్తున్నాయి.

ఉపాధి హామీ అమలు బాధ్యతను పంచాయితీలకు అప్పగించడం వలన పేదలకు తప్పనిసరిగా లబ్ధిజరుగుతుందని అనుకోవడానికి వీలులేదని పైన పేర్కొన్న అనుభవాల నుండి తెలుస్తుంది. అయితే దీని అర్థం కేంద్రీకృత విధానంలో ఎలాంటి సమస్యలు లేవని కాదు. ‘చట్టం ప్రకారం పని కల్పనలో దేశంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం దేశంలో మొదటి స్థానంలో ఉన్నప్పటికీ హక్కుగా పొందాల్సిన ఉపాధి పనిహక్కు అనే భావన పూర్తిగా పక్కకు పోయి అధికారుల భిక్షగా తయారయిందని ప్రముఖ రాజనీతి శాస్త్రవేత్త ప్రొఫెసర్ డీగో మైరానో అభిప్రాయపడ్డారు. ప్రజల భాగస్వామ్యం దాదాపు లేకుండా పోవడానికి ప్రధాన కారణం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ టాప్‌డౌన్ మోడల్ అనుసరించడమేనని ఆయన విశ్లేషించారు. అలానే పాలకుల్లో రాజకీయ చిత్తశుద్ధి లేకపోతే టాప్ డౌన్ పద్ధతి ప్రజలకు ప్రతికూల ఫలితాలు ఇస్తుంది. హక్కుల చట్టాలు ద్వారా ఒనగూరాల్సిన రాజకీయ-సామాజిక చైతన్యం పక్కకు పోయి పౌరులు కేవలం పథకాల లబ్ధిదారులుగా మిగిలిపోతారు. అలానే టాప్ డౌన్ పద్ధతిలో ‘పై స్థాయి’లో జవాబుదారీతనం అసలు ఉండదు. దిగువ స్థాయిలో అధికారులు, నాయకులూ అవినీతిపరులని పై స్థాయిలో ఉన్న వాళ్ళు మాత్రం ‘అందరికంటే పవిత్రులు’ అనే భావనతో ఈ నమూనా నడుస్తుంది.

విధానాల రూపకర్తలు వాస్తవిక దృష్టికోణంతో అలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని స్థానిక సంస్థలకు అధికారాలు, టాప్ డౌన్ పద్ధతిని మిళితం చేసే విధానాలను రూపొందించాలి. ఉదాహరణకు నరేగాలో అణగారిన ప్రజలకు పని కల్పనాబాధ్యత, పర్యవేక్షణ టాప్ డౌన్ పద్ధతికి పరిమితం చేసి, పనుల ఎంపిక బాధ్యత పంచాయితీలకు అప్పగించొచ్చు. పథకాల అమలు పర్యవేక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే సామాజిక తనిఖీలను బలోపేతం చేయడం ద్వారా టాప్ డౌన్ పద్ధతిలోని పరిమితుల్ని అధిగమించొచ్చు. ప్రజలను సంఘటిత పరచడం ద్వారా వారి సామాజిక, రాజకీయ చైతన్యం పెంపొందించే బాధ్యతను పౌర సమాజం నిర్వర్తించాలి. ‘స్థానిక సమస్యలకు స్థానిక పరిష్కారాలు అవసరం’ అనే ఆశయాన్ని అనుసరిస్తూ అణగారిన వర్గాల హక్కులకు భంగం కలగకుండా చూడడం ఎంతైనా అవసరం. అప్పుడు మాత్రమే గాంధీ మహాత్ముడు కలలుగన్న స్వరాజ్యం, బాబాసాహెబ్ అంబేడ్కర్‌ సంకల్పించిన సామాజిక న్యాయం సాకారమవుతాయి.

చక్రధర్ బుద్ధ

Updated Date - 2022-11-22T06:56:21+05:30 IST