Kerala: భారత్ జోడో పోస్టర్‌పై సావర్కర్ ఫోటో...
ABN , First Publish Date - 2022-09-22T01:37:20+05:30 IST
కాంగ్రెస్ చేపట్టిన ''భారత్ జోడో యాత్ర'' 14వ రోజు ఊహించని సంఘటన చోటుచేసుకుంది. కేరళలోని ఎర్నాకులానికి..

ఎర్నాకులం: కాంగ్రెస్ చేపట్టిన ''భారత్ జోడో యాత్ర'' (Bharat Jodo yatra) 14వ రోజు ఊహించని సంఘటన చోటుచేసుకుంది. కేరళలోని ఎర్నాకులానికి (Ernakulam) యాత్ర చేరుకోగానే అక్కడ ఏర్పాటు చేసిన భారత్ జోడో పోస్టర్ ఒకటి పార్టీ కార్యకర్తలను ఉలిక్కిపడేలా చేసింది. యాత్రకు స్వాగతం పలుకేందుకు స్వాతంత్ర్య సమరయోధులతో ఏర్పాటు చేసిన 'భారత్ జోడో యాత్ర' పోస్టర్ అక్కడ ఏర్పాటు చేశారు. అయితే, అందులో స్వాంతంత్ర్య సమరయోధుల ఫోటోల వరుసలో సావర్కర్ (Savarkar) ఫోటో కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ మొదట్నించీ సావర్కర్ స్వాంతంత్ర్య యోధుడు కాదనే వాదన బలంగా వినిపిస్తూ వస్తోంది. బ్రిటిష్ వారితో ఆయన పోరాటం చేయలేదని, కేవలం క్షమాపణ చెప్పుకున్నాడని చెబుతూ వచ్చింది. అయితే, ఆ పార్టీ కూడా ఊహించని విధంగా భారత్ జోడో పోస్టర్‌లో సావర్కర్ ఫోటో ప్రత్యక్షం కావడం వారిని ఉక్కిరిబిక్కిరి చేసింది.
కాగా, ఈ విషయాన్ని తొలుత గుర్తించిన స్వతంత్ర ఎమ్మెల్యే పీవీ అన్వర్ ఆ పోస్టర్‌తో కూడిన వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. జరిగిన ''పొరపాటును'' కాంగ్రెస్ కార్యకర్తలు వెంటనే గుర్తించి సావర్కర్ ఫోటో ఉన్న చోట గాంధీ ఫోటో తగిలించినట్టు ఆయన తెలిపారు.
ఇప్పటికైనా గ్రహించారు: బీజేపీ
కాగా, సావర్కర్‌ను వీరుడిగా అభివర్ణించే బీజేపీ ఈ పరిణామంపై వెంటనే స్పందించింది. ఆలస్యంగానైనా సావర్కర్‌ను స్వాతంత్ర్య సమరయోధుడుగా రాహుల్ గాంధీ గ్రహించారని, చరిత్రను, నిజాన్ని ఎవరూ మరుగు పరచలేరని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ షెహజాద్ పూనావాలా ట్వీట్ చేశారు.
ప్రింటింగ్ పొరపాటు: కాంగ్రెస్
కాగా, భారత్ జోడో పోస్టర్‌పై సావర్కర్ ఫోటో కనిపించడంపై కాంగ్రెస్ పార్టీ వివరణ ఇచ్చింది. ఇది ప్రింటింగ్ సమయంలో జరిగిన పొరపాటని వివరణ ఇచ్చింది. ఆన్‌లైన్‌లో స్వాతంత్ర్య సమరయోధుల ఫోటోలు తీసుకున్నప్పుడు క్రాస్ చెకింగ్ చేసుకోకపోవడం వల్ల ఈ పొరపాటు దొర్లిందని చెప్పింది. పొరపాటు గ్రహించిన వెంటనే సావర్కర్ స్థానంలో మహాత్మా గాంధీ ఫోటోను తగిలించారని తెలిపింది.