ఎమ్మెస్ స్వామినాథన్‌కు సతీ వియోగం
ABN , First Publish Date - 2022-03-15T07:54:48+05:30 IST
హరితవిప్లవ సృష్టికర్త, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎమ్మెస్ స్వామినాథన్ సతీమణి మీనా సోమవారం ఉదయం కన్నుమూశారు...

చెన్నై, మార్చి 14(ఆంధ్రజ్యోతి): హరితవిప్లవ సృష్టికర్త, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎమ్మెస్ స్వామినాథన్ సతీమణి మీనా సోమవారం ఉదయం కన్నుమూశారు. ఆమె వయస్సు 88 ఏళ్లు. వృద్ధాప్య సమస్యల కారణంగా స్థానిక తేనాంపేటలోని నివాసగృహం లో ఆమె తుదిశ్వాస విడిచారు. దేశంలో శిశు సంరక్షణ, బాల్యవిద్య రంగాల్లో ఆమె విశిష్ట సేవలందించారు. ప్రత్యేకించి లైంగిక అసమానతల నిర్మూలన దిశగా పలు పరిశోధనలు సాగించారు. ఉపాధ్యాయినిగా, విద్యావేత్తగా, రచయిత్రిగా పేరుగడించిన మీనా స్వామినాథన్ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1970లో ఆమెను కేంద్ర విద్యా సలహామండలి అధ్యక్షురాలిగా నియమించింది. 1980లో ఢిల్లీలో మహిళా అభివృద్ధి అధ్యయన కేంద్రం వ్యవస్థాపక సభ్యురాలు కూడా. ఆ కేంద్రానికి 1987 నుంచి 1993 వరకు వైస్ఛాన్సలర్గానూ బాధ్యతలు నిర్వర్తించారు. మీనాస్వామినాథన్ మృతి వార్త తెలియగానే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆమె నివాసానికి వెళ్లారు. మీనా భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.