Indians: విదేశీ జైళ్లలో మగ్గుతున్న 8వేల మందికి పైగా భారతీయులు.. అత్యధికంగా ఆ దేశాల్లోనే..

ABN , First Publish Date - 2022-12-10T10:08:01+05:30 IST

విదేశీ జైళ్లలో ఉన్న భారతీయుల (Indians) వివరాలను శుక్రవారం లోక్‌సభలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ వెల్లడించారు.

Indians: విదేశీ జైళ్లలో మగ్గుతున్న 8వేల మందికి పైగా భారతీయులు.. అత్యధికంగా ఆ దేశాల్లోనే..

న్యూఢిల్లీ: విదేశీ జైళ్లలో ఉన్న భారతీయుల (Indians) వివరాలను శుక్రవారం లోక్‌సభలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ వెల్లడించారు. విదేశాంగ శాఖ వద్ద ఉన్న డేటా ప్రకారం 8,441 మంది భారతీయులు విదేశీ జైళ్లలో ఉన్నట్లు తెలిపారు. వీరిలో అత్యధికంగా గల్ఫ్ దేశాలైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఖతార్, కువైత్, బహ్రెయిన్, ఒమన్‌లలో ఉన్నట్లు చెప్పారు. ఈ దేశాల్లో 4,389 మంది భారతీయ ఖైదీలు ఉన్నారని పేర్కొన్నారు. అలాగే మరో ప్రశ్నకు సమాధానంగా యూఏఈ జైళ్లలో ఉన్న భారతీయ ఖైదీలు స్వదేశంలో వారి మిగిలిన శిక్ష కాలాన్ని పూర్తి చేసుకునే అవకాశం ఉందన్నారు. 2011, నవంబర్ 23న ఇరు దేశాల మధ్య కుదిరిన 'శిక్ష విధించబడిన వ్యక్తుల బదిలీ' (Transfer of Sentenced Persons) ఒప్పందం ప్రకారం ఈ అవకాశం ఉన్నట్లు మంత్రి స్పష్టం చేశారు. అలాగే మన దగ్గర ఉన్న యూఏఈ ఖైదీలను కూడా ఈ ఒప్పందం ప్రకారం బదిలీ చేసుకోవచ్చని చెప్పారు. ఈ సందర్భంగా దోహాలో అదుపులోకి తీసుకున్న ఎనిమిది మంది భారత మాజీ నావికాదళ అధికారుల కేసు మరోసారి చర్చకు వచ్చింది. దీనిపై విదేశాంగ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి సమాధానం చెప్పారు. ఈ కేసు విషయంలో అక్కడి భారత ఎంబసీ చాలా చురుకుగా ఉన్నట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు కేసు పూర్వపరాలను తమకు తెలియజేస్తున్నట్లు చెప్పారు.

Updated Date - 2022-12-10T13:23:40+05:30 IST