New Bars: రాష్ట్రంలో కొత్తగా 70 బార్లు!
ABN , Publish Date - Mar 22 , 2025 | 03:56 AM
ఆదాయాన్ని రాబట్టుకోవడమే లక్ష్యంగా కొత్త బార్లకు అనుమతి ఇచ్చేందుకు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. జనాభాతోపాటు రాబడి ఎక్కువగా ఉన్న ప్రాంతాలను ప్రాతిపదికగా తీసుకుని అనుమతులు ఇవ్వనున్నారు.

కసరత్తు చేస్తున్న ఆబ్కారీ శాఖ
త్వరలోనే నోటిఫికేషన్!.. రాబడి
ఎక్కువ ఉన్న ప్రాంతాలపై దృష్టి
ఎలైట్ బార్లకూ అవకాశం!
మైక్రోబ్రూవరీలను పెంచే యోచన
హైదరాబాద్, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): ఆదాయాన్ని రాబట్టుకోవడమే లక్ష్యంగా కొత్త బార్లకు అనుమతి ఇచ్చేందుకు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. జనాభాతోపాటు రాబడి ఎక్కువగా ఉన్న ప్రాంతాలను ప్రాతిపదికగా తీసుకుని అనుమతులు ఇవ్వనున్నారు. ఈ మేరకు త్వరలో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 70కిపైగా కొత్త బార్లు వచ్చే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే, ఎలైట్ బార్లకు అనుమతులివ్వడంతో పాటు మైక్రోబ్రూవరీల సంఖ్యను పెంచాలని ఎక్సైజ్ శాఖ యోచిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 1,171 బార్లు ఉండగా.. వీటిలో సగం వరకు హైదరాబాద్, సికింద్రాబాద్‌లోనే ఉన్నాయి. ఇవి కాకుండా 89 ఎలైట్ బార్లు, హైదరాబాద్, శంషాబాద్, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్ వంటి ప్రాంతాల్లో 55 పబ్బులు కొనసాగుతున్నాయి. గత ఏడాది (2024-25లో) ఎక్సైజ్ శాఖ నుంచి రూ.25,617.53 కోట్ల ఆదాయం రావాలని లక్ష్యం నిర్దేశించినా.. చేరుకోలేకపోయింది.
అయితే, ఈ ఏడాది (2025-26లో) రూ.27,623.36 కోట్లు రాబట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే కొత్త బార్లకు అనుమతులు ఇచ్చే దిశగా ఎక్సైజ్ శాఖ అడుగులు వేస్తోంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చివరిసారిగా 2021 ఫిబ్రవరి మొదటి వారంలో కొత్త బార్ల ఏర్పాటుకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత ఇప్పుడే తాజాగా కొత్త బార్ల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానించబోతున్నారు. త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసి, రెండు నెలల్లో కొత్త బార్లు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోనున్నారు. అలాగే, ఎలైట్ బార్లకు అనుమతులు ఇచ్చే విషయాన్నీ పరిశీలిస్తున్నారు. ఇందుకోసం రెగ్యులర్ లైసెన్స్ ఫీజు కంటే 25శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక బార్‌కు లైసెన్స్ ఫీజు రూ.40లక్షలు ఉంటే.. ఎలైట్ బార్‌కు రూ.50లక్షలు చెల్లించాలి. గతంలో ఎలైట్ బార్ల ఏర్పాటుకు ఎప్పుడుపడితే అప్పుడు అనుమతి ఇచ్చేవారు. గత ప్రభుత్వంలో కొందరికి మాత్రమే అనుమతులు ఇచ్చి.. ఆ తర్వాత ఇవ్వలేదు. తాజాగా వీటికీ అనుమతులు ఇచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. అలాగే, రాష్ట్రంలో మైక్రో బ్రూవరీల సంఖ్యను 50కి పెంచాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చైన్నై వంటి నగరాల్లో మైక్రోబ్రూవరీలు ఎక్కువగా ఉండగా.. హైదరాబాద్‌లో వాటి సంఖ్య పది లోపే ఉంది. ఈ నేపథ్యంలో వీటిని పెంచేందుకు కసరత్తు జరుగుతోంది.