Hyderabad Book Fair : ఒక భావం కలిగితే అదొక గాయంలా కొంత సేపు వుంటుంది..!
ABN , First Publish Date - 2022-12-27T12:57:01+05:30 IST
నా స్పందనలు, ఉద్వేగాలు అన్ని పంచుకున్నవే చెంచిత.
వానైనా, ఎండైనా, ఏ ఋతువైనా సమయానుకూలంగా సంభవిస్తేనే అది అందం, ఆనందం. ఈ కోవలోనే శోభా భట్ కవిత్వం కూడా అంత అరుదుగానే పుడుతుంది. కవిత పొంగి పోగైన ప్రతిసారీ ఆమె కవిత్వం పుస్తకమైపోదు. అలతిగా, అరుదుగా కవితలు పుస్తకాలుగా మన ముందుంటాయి. కలం పేరుతో ఊర్మిళగా మారి అప్పుడు మాత్రమే మనల్ని తన కవిత్వంతో ముగ్ధుల్ని చేస్తుంది ఆమె. 2017 అంగారక స్వప్నం తరువాత, "ఒక్కనేనే" పేరుతో మరో కవితా సంకలనం ఈ మధ్యనే వెలువడింది. హైదరబాద్ బుక్ ఫెయిర్ సందర్భంగా ఆంధ్రజ్యోతి వెబ్, శోభా భట్ తో జరిపిన ఆత్మీయ సంభాషణ..
1. కవిత్వం మీలో పుట్టేందుకు ప్రేరణగా నిలిచిన వాతావరణం, పరిస్థితులు, వ్యక్తుల గురించి చెపుతారా?
కవిత్వం రాయడానికి ప్రత్యేకంగా ఇదీ అని చెప్పడానికి లేదు కానీ బాపు ను గొప్ప తండ్రిగా చెప్పగలను. తను స్కూల్ టీచర్. మాది పెద్ద కుటుంబం. ఐదుగురం అమ్మాయిలం, నలుగురు అబ్బాయిలు. ఎప్పుడు చుట్టాలు రాకపోకలతో సందడి వుండేది. అమ్మ చాలా నెమ్మది. ఉన్నత కుటుంబం నుండి వచ్చినా కూడా ఇక్కడ చాలా ఇబ్బందులను చెరగని చిరునవ్వుతో తోసిపుచ్చింది. ఇంటికి వచ్చినవారు ఎవరూ అమ్మ చేతి భోజనం తినకుండా వెళ్ళినవారు లేరు. అమ్మను చూడదటమే పెద్ద మొహం గా వుండేది నాకు.
బాపు చెప్పాలంటే ఒక తరం ముందు వుండే వాడు. తన ఆలోచనలు ఎప్పుడు సామాజిక పరంగా ఎదో చేయాలనే తపన. టీచర్ గా 1954 లోనే B C విద్యార్థుల కోసం కరీంనగర్ లో హాస్టల్ పెట్టాడు. ఇంట్లో కాంగ్రెస్ రాజకీయ వాతావరణ. బాపు ఇంట్లో ఒక లైబ్రరీ ఏర్పాటు చేశాడు. ఎవరైనా వచ్చి చదువుకోవచ్చు. చిన్నప్పటి నుండి సాహిత్య వాతావరణం. గోపీచంద్, ప్రేమ్ చంద్, శరత్ బుచ్చిబాబు, లత,, రంగనాయకమ్మ ఇలా అందరినీ పుస్తకాల ద్వారా చూడటం.
రాత్రుళ్లు భారత రామాయణ భాగవత పద్యాలతో పాటు కుంతీ విలాపం పుష్ప విలాసం నండూరి పాటలు ఇవన్నీ వినిపించేవాడు. అవి అలా మనసులో ఒక బలమైన ముద్ర వేశాయి. ఖచ్చితంగా అక్కడే కవిత్వం పై ఇష్టం కలిగింది కావచ్చు.
2. రాయాలని నిర్ణయించుకున్నాకా మీ కవిత్వానికి ఊతంగా నిలిచిన అంశాలు, ప్రేరణలు ఏమిటి.
కవిత్వం రాయాలని నిర్ణయించుకోవడం అంటూ జగిందేమి లేదు. స్కూల్ లో తెలుగు హిందీ పద్యాలు చదవడం ఇష్టం గా వుండేది. మొదటి కవిత 8 వ తరగతిలో రాశాను. స్కూల్ లో ఏ పోగ్రామ్స్ జరిగినా తప్పకుండా నేను ముందు వుండేదాన్ని. కవితలు, నాటకాలు రాయడం. ఇంటర్ వచ్చాక అలిశెట్టి ప్రభాకర్ తన పత్రికలో నాతో మొదటిసారి రాజకీయ వ్యంగ్య రచన ఒకటి రాయించి అచ్చు వేశారు.
తర్వాత ఇంటర్ డిగ్రీ లలో కాలేజీ మ్యాగ్జీన్ లలో నావి తప్పకుండా వుండేవి. ఇంట్లో అంతా కాంగ్రెస్ వాతావరణం. నేను కొంచెం సమాజాన్ని పరికించి చూడటం కాలేజ్ చదువుల్లో కి వచ్చాక. అప్పుడు ఆలోచనల్లో కొంచెం మార్పు . ప్రతిదాన్నీ ప్రశ్నించే తత్వం. ఏదైనా మనసు కు నచ్చింది మాత్రమే చేయడం భయం లేకుండా. చలం, రంగనాయకమ్మ గారి తో పాటు తాఫి ధర్మా రావు గారి రచనలు కొంత తోడు నిలిచాయి. బాపు నేను ఎలా ఆలోచించినా వెన్ను తట్టేవాడు.
3. మీరు ఎంచుకున్న అంశాన్ని వ్యక్తం చేసేప్పుడు ఏవైనా ఇబ్బంది పడ్డారా?
లేదండీ. ఎప్పుడు ఏది చెప్పాలనుకున్నా భయపడింది కానీ వెనక్కి తీసుకున్నది కానీ జరగలేదు.
4. ఇష్టంగా చదివిన సాహిత్యం ఏది? మీ మీద గట్టి ప్రభావం చూపిన రచన ఏది?
ఇష్టం గా అంటే ప్రతిదీ ఒక తెలియని ఉద్వేగం తోనే చదవడం. తిలక్, కృష్ణ శాస్త్రి శ్రీ శ్రీ ఇస్మాయిల్ గుడిహాలం రఘు జయప్రభ చాలామంది వున్నారు. మనసు కోరుకున్నప్పుడు చదువుకోవడం కొంత హాయిని పొందడం తప్ప అదే లోకంగా మాత్రం లేననే చెప్పాలి. అందరినీ చదువుతాను. ఎక్కవగా ప్రభావితం అంటే శరత్ సాహిత్యమే. శరత్ స్త్రీలు మానసిక పరిపక్వత తో స్వతంత్రంగా వుంటారు. ఏ లోభత్వానికు లొంగని మనసుతో వుంటారు. ధృడ చిత్తం వుంటారు. ఎంతటి ఒత్తిడి అయినా వాళ్ళను బలహీన పరుచదు. అలాంటి ధీరత్వం మహిళలో ఇష్టం. పైకి అతి సాధారణం గా కనిపించే స్త్రీలే. ఇంకా రంగనాయకమ్మ గారు మొదటి స్ఫూర్తి చెప్పాలంటే.
5. స్త్రీకి భావ ప్రకటనా స్వతంత్ర్యం కవిత్వంలో ఎంత వరకూ ఉంది?
ఎందుకు కవిత్వంలో స్త్రీలకు పరిమితులు. భావం వ్యక్తం చేయడంలో హద్దులు ఏమి వుండ నక్కరలేదు. అయితే భాష పరంగా పురుషులు రాసినంత స్వేచ్ఛగా స్త్రీ రాయలేదు. ఒక రకంగా స్త్రీ తనకు తెలియకుండానే ఒక రేఖ అల్లుకుంటుంది. కాదు ముందే అల్లి వుంటుంది. చిన్నప్పటి నుండి మర్యాద స్ర్తీలు మాట్లాడకూడని పదాలు కొన్ని వున్నాయి. అవి దాటి రావడం కష్టమే. అలాంటి సరిహద్దులను కూడా చేరిపివేసారు. 'నీలి మేఘాలు' స్త్రీవాద కవిత్వ సంకలనంతో. అయితే పురుషుడు వాడుతున్న భాష పరుష పదాలు వాడితేనే స్త్రీలు బలంగా భావాలను వ్యక్తీకరించగలరు అనేదాన్ని నేను తీసుకోను. స్త్రీ చెప్పాలనుకున్నది నిజాయితీగా తనదైన పద్దతిలో సూటిగా చెప్పవచ్చు.
6.స్త్రీ కవిత్వం రాసేప్పుడు ఆమె ఊహకు ఎంతవరకూ స్థానం ఉంటుంది. ప్రేమ, విరహం, శృంగారం వంటి విషయాలను బహిరంగంగా రాయడానికి ఆమెకు ఈ ఆధునిక యుగంలోనూ హద్దులు ఉన్నాయంటారా?
స్త్రీ ఎంత వరకు తన స్వతంత్రాని చాటుకోవచ్చునో అంత వరకు హాయిగా భయం లేకుండా చాటుకోవచ్చు. అయితే అనుకరణ అపహాస్యము చేస్తుంది. ఆ ఎరుక వుంటే చాలు. కవిత్వంలో ఊహలు అమరవేమో ఇది నా అభిప్రాయం. ఏదైనా అనుభవంలోకి వచ్చినదానిని మాత్రమే వ్యక్తం చేయగలం కదా! అయితే అనుభూతికి అందమైన కొన్ని కల్పికలు జత చేరుతాయి కావచ్చు కానీ మరి ఒట్టి ఊహలు ఎలా ? ప్రేమ విరహం శృంగారం జీవితంలో ఒక భాగమే కదా ! ఎవరి అనుభవాలు వారివి. వేటికవి కావ్యాలే. అందంగా మనసుకు జుగుప్స కలగనంతవరకు కవిత్వంలో వ్యక్తం చేయడంలో ఇబ్బంది ఏముంటుంది. ఇక హద్దులు అంటారా? దేనినైనా చూపించే రీతిలో వుంటుంది. ఎలా చూపిస్తాం అనేది ముఖ్యం.
7. అతి తక్కువ పదాలతో, చిన్న చిన్న వాక్యాలతో గాఢమైన కవిత్వాన్ని రాస్తున్నారు. కవిత్వ నిర్మాణంలో ప్రత్యేకించి మీరు అనుసరించే సూత్రం ఏమన్నా ఉందా?
మౌనం ఒక గొప్ప సంభాషణ కదా! అర్థం అయితే. నేను కావాలని పదాలను ఎన్నుకొని రాయను. నాకు కవిత్వాన్ని ఆలోచించి ఆలోచించి నిర్మించడం రాదు. తెలియదు. అది నా బలహీనత కావచ్చు. ఒక భావం కలిగితే అదొక గాయంలా కొంతసేపు వుంటుంది. దాన్ని పదాల్లో కూరుస్తాను. అప్పుడు నాకు తెలిసిన పదాలే బయటకు వస్తాయి. ఆ క్షణం ఊరట పొందుతాను. దాన్ని మళ్ళీ చూసువాలన్నా కూడా బిడియం జంకు నాకు. ప్రతిసారీ ఎవరికైనా చూపించాలన్న సిగ్గు ఇది కవిత కాదేమో అని.
8. ఉర్మిళ, కలం పేరు గురించి చెపుతారా.. మీ పేరుతో కాకుండా మరో పేరుతో అంగారక స్వప్నం రావడానికి కారణం?
రామాయణంలో ఊర్మిళా పై నాకు కొంత ఇష్టం. సానుభూతి పాపం యవ్వనంలో జీవితం అంత నిదురలో గడపటం పై నాదైన ఆలోచనతో "ఊర్మిళ నిద్ర" అని పెద్ద కవిత రాశాను. అది ఇప్పుడు లేదు. ఆ కవిత రాసినప్పుడు కలం పేరు ఊర్మిళ అని పెట్టుకున్నాను. కవిత్వానికి మాత్రమే ఆ పేరు. కథలకు మిగతా రచనలు నా పేరు తోనే రాస్తాను.
9. కవిత్వం కాక చెంచిత అనే పేరుతో వ్యాసాలు వస్తున్నాయట కదా.. వాటి గురించి చెపుతారా?
అవును." చెంచిత" పేరుతో వ్యాసాలు పుస్తకంగా వుస్తుంది. అవి వార్త దినపత్రికలో ఆదివారం చెలి స్త్రీల పేజీలో అచ్చు అయినవి. చెంచిత అంటే స్వేచ్ఛగా వుండేది అని నిర్భయంగా జంకు లేకుండా మనగలిగేది. స్త్రీగా నా అనుభవాలు వాస్తవిక సంఘటనలు సామాజిక అంశాలు కథలు సినిమాలు పండగలు సంస్కృతి బంధాలు స్త్రీ పురుష సంబంధాలు ఇలా నా అనుభవంలోకి వచ్చినవి. నా స్పందనలు, ఉద్వేగాలు అన్ని పంచుకున్నవే చెంచిత. ఇది నా పేరు శోభా భట్ తో వస్తుంది.
- శ్రీశాంతి మెహెర్.