bike taxis: మహిళలకు బైక్ ట్యాక్సీ ప్రయాణం సురక్షితమేనా...?
ABN , First Publish Date - 2022-12-08T11:41:56+05:30 IST
మగవారి విషయంలో కంటే ఆడవారికి కార్, బైక్ ట్యాక్సీలు ప్రమాదంగా మారుతున్నాయి.
అత్యవసరమై ప్రయాణం చేయాలన్నా, క్షణాల్లో చేరుకోవాలన్నా మామూలుగా అంతా వాడే రవాణా వ్యవస్థ కాల్ ట్యాక్సీలు, బైక్ ట్యాక్సీలు. ఇప్పటి బిజీ లైఫ్ కి సమయానికి గమ్యాన్ని చేరుకోవాలంటే వీటి మీదనే ఆధారపడుతున్నాం. అయితే మగవారి విషయంలో కంటే ఆడవారికి కార్, బైక్ ట్యాక్సీలు ప్రమాదంగా మారుతున్నాయి. దీని వెనుక డ్రైవర్ల ప్రధాన నిర్లష్యం, విపరీత ప్రవర్తనలతో ప్రయాణీకురాలిని ఇబ్బందుల్లో పడేస్తున్నాయి.. వీటి గురించి మాట్లాడుకుంటే...
గత నెలలో బెంగళూరులో బైక్ ట్యాక్సీ డ్రైవర్‌తో సహా ఇద్దరు వ్యక్తులు కేరళకు చెందిన 23 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం చేసిన ఘటనతోపాటు,. ఈ ఏడాది ప్రారంభంలో, గౌహతిలో మరో మహిళా ప్రయాణీకురాలిని మోటార్‌బైక్ టాక్సీ డ్రైవర్ వేధింపులకు గురి చేశాడు. ఇలాంటి కొన్ని సంఘటనలన్నీ, ప్రజా రవాణా, ప్రదేశాలలో మహిళల భద్రత లోపాన్ని ఎత్తి చూపడమే కాకుండా, ముఖ్యంగా బైక్ టాక్సీల మధ్య సంబంధాన్ని, మహిళల మధ్య సంబంధాన్ని చాలా క్లిష్టంగా మార్చాయి.
గత రెండు సంవత్సరాలలో, దేశంలోని ప్రధాన క్యాబ్ అగ్రిగేటర్లు అనేక స్థానిక ఆపరేటర్లతో పాటు, ప్రయాణీకులకు చౌకైన, మరింత సౌకర్యవంతమైన రవాణా మార్గంగా బైక్ టాక్సీ సేవలను ప్రారంభించాయి. ఈ ప్రయాణాలు మహిళలను ప్రమాదంలో పడేయడానికి ముఖ్యంగా మహిళా రైడర్లు లేకపోవడం, రైడ్ సమయంలో రైడర్, ప్రయాణీకుల మధ్య సరైన ప్రవర్తలేకపోవడం, డ్రైవింగ్ వేగం మొదలైనవి మహిళలు ఈ సేవలను సురక్షితంగా పొందకుండా చేస్తున్నాయి.
డ్రైవర్లపై ట్రాక్ ఉంచాలి...
డ్రైవర్‌ను నియమించుకునే ముందు సరైన పరీక్షలు తీసుకోవడం, మునుపటి రికార్డులను తనిఖీ చేయడం, అతని డ్రైవింగ్‌ను అర్థం చేసుకోవడంతో పాటు అతను ర్యాష్ డ్రైవింగ్ చేయలేదని నిర్ధారించుకోవడం వంటివి బైక్ టాక్సీ కంపెనీలు తీసుకోవలసిన కొన్ని చర్యలు.
మహిళా ప్రయాణీకుల భద్రతకు భరోసాకు మహిళా బైక్ టాక్సీ డ్రైవర్లను ఉంచడం ఒక ముఖ్యమైన చర్య.
అదేవిధంగా, బైక్ ట్యాక్సీలలో ప్రయాణించే మహిళల భద్రతపై ఆందోళనలతో, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌లలో నడుస్తున్న ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్లాట్‌ఫారమ్ మెట్రోరైడ్ మహిళా రైడర్‌లను నియమించే యోచనలో ఉంది. అత్యవసర పరిస్థితుల్లో బైక్ టాక్లీలను వాడే మహిళల్లో చాలా వరకూ ఇబ్బందికి లోనవుతారు. ట్రాఫిక్ రూల్స్ ప్రకారం ప్రయాణించే క్రమంలోనూ, స్పీడ్ బ్రేకర్స్ దాటుతున్నప్పుడు ఇటువంటి సమయాల్లో ఇబ్బంది తప్పదు. కానీ రద్దీ ప్రదేశాల్లో నడుపుతున్నప్పడు డ్రైవ్ చేసేది మగ వ్యక్తి కాకుండా ఆడవారే అయితే ఇటువంటి ఇబ్బందులు ఉండవనేది చాలామంది కస్టమర్ల అభిప్రాయం.
అయితే, బైక్ టాక్సీలు పెద్ద ప్రజా రవాణా వ్యవస్థలో ఒక చిన్న భాగం మాత్రమే, ఇక్కడ మహిళలు ప్రయాణించిన ప్రతిసారీ ఏదో చిక్కులో పడటం అనేది పరిపాటి అయిపోయింది. ఈమధ్య కాలంలో అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ నేతృత్వంలోని పరిశోధనలో ఇది ధృవీకరించబడింది, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ఉపయోగించిన దాదాపు 56 శాతం మంది మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు నివేదికలో తేలింది. భారతీయ నగరాల్లో 9 శాతం మంది మహిళలు మాత్రమే ప్రజా రవాణా పూర్తిగా సురక్షితమైనదని భావిస్తున్నారు. అలాగే, ప్రభుత్వాలు, పట్టణ స్థానిక సంస్థలు రవాణా అధికారులు మహిళలకు రవాణాను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.