Avatar 2: సరికొత్త లోకంలోకి.. ఆ టెక్నాలజీ వచ్చే వరకు ఆగి..

ABN , First Publish Date - 2022-12-04T12:20:05+05:30 IST

ఎక్కడా కనిపించని వింత వింత విరబూసిన పువ్వులు ఆ దీవిలో ఉంటాయి. అక్కడ సీతాకోక చిలుకల్లాంటి మహా పక్షులు కనిపిస్తాయి. స్నేహబంధం కలిగిన వారితో అవి ఎంతో సఖ్యంగా మెలుగుతాయి.

Avatar 2: సరికొత్త లోకంలోకి.. ఆ టెక్నాలజీ వచ్చే వరకు ఆగి..
Avatar 2

ఎక్కడా కనిపించని వింత వింత విరబూసిన పువ్వులు ఆ దీవిలో ఉంటాయి. అక్కడ సీతాకోక చిలుకల్లాంటి మహా పక్షులు కనిపిస్తాయి. స్నేహబంధం కలిగిన వారితో అవి ఎంతో సఖ్యంగా మెలుగుతాయి. వాటిని అధిరోహిస్తే ఎక్కడికి కావాలంటే అక్కడికి చిటికెలో తీసుకుపోతాయి. అక్కడి ప్రజలు నీలం రంగులో, పొడవాటి తోకతో అమాయకంగా, ఆకర్షణీయంగా కనిపిస్తారు. అవును... ఆ అద్భుతాల దీవి పేరు ‘పండోరా’ (Pandora). హాలీవుడ్‌ దిగ్గజ దర్శకుడు జేమ్స్‌ కేమెరాన్‌ (James Cameron) సృష్టించిన ఒక అద్భుత లోకం. పుష్కర కాలం తర్వాత మరోసారి సరికొత్త ‘అవతార్‌’ (Avatar)తో మ్యాజిక్‌ చేయడానికి ప్రేక్షకుల ముందుకు స్తున్నారాయన. ఈసారి ‘పండోరా’ దీవి నుంచి ‘ది వే ఆఫ్‌ వాటర్‌’ అంటూ నీటిలోకి మనల్ని తీసుకెళ్లేందుకు ‘అవతార్‌ 2’ (Avatar 2)తో సిద్ధమయ్యారు. ఇంతకీ ఈ సరికొత్త లోకం ఎలా ఉండబోతోంది?.

‘అవతార్‌’... ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేని ఓ అద్భుతమైన అనుభవం. జేమ్స్‌ కేమెరాన్‌ తన ఊహాశక్తిని తెరపై ఆవిష్కరించిన అరుదైన దృశ్యకావ్యం. ఏళ్ల తరబడి శ్రమించి, సృష్టించిన ఒక అందమైన లోకంలోకి ఆయన ప్రేక్షకుల్ని తీసుకెళ్లి వదిలేశారు. అక్కడి అందాలు, భావోద్వేగాలు వారిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. అంతేనా... స్వార్ధం, ఆక్రమణ... అమాయకత్వం, అస్తిత్వం నడుమ జరిగే పోరాటం ఉత్కంఠభరితంగా సాగి అందర్నీ విస్మయపరిచింది. ప్రపంచవ్యాప్తంగా ‘అవతార్‌’ ఓ క్లాసిక్‌గా ఆబాలగోపాలాన్ని అలరించింది.

నీటి లోపల ఊహా ప్రపంచం..

జేమ్స్‌ ఎప్పుడూ కొత్తగా ఆలోచిస్తారు. సినిమా నిర్మాణం కూడా కొత్తగా నిర్వహిస్తాడు. కథా కథనం అందుకు తగినట్టే కొత్తగా ఉంటుంది. ఆ ఒరవడిలోనే ఇప్పుడు ‘అవతార్‌ 2’ ప్రపంచ వీక్షకుల ముందుకు వస్తోంది. కొత్తదనం అంతటినీ రంగరించి తొలి ‘అవతార్‌’ ఆవిష్కరించిన తర్వాత మళ్లీ కొత్తగా చెప్పడానికి, వినూత్నంగా చూపించడానికీ ఇంకా ఏం మిగిలి ఉంది? ఈ ప్రశ్నకి ‘చాలానే ఉంద’ని ఎన్నో ఇంటర్వ్యూలలో కేమెరాన్‌ చెప్పేశారు. ఈ మధ్యనే విడుదల చేసిన ట్రైలర్‌లో కూడా ‘అవతార్‌ 2’ లోని నవ్యత ఏమిటో తళుక్కుమనిపించారు. ఈ చిత్రానికి ‘ది వే ఆఫ్‌ వాటర్‌’ అని ఒక క్రియా సూచికను జత చేశారు. అంటే ఇందులో కేమెరాన్‌ గతంలో ఎవ్వరూ చూపించని విధంగా నీటి లోపల సినిమాను చిత్రీకరించి ప్రేక్షకులకు ఒక వినూత్న జల ప్రపంచాన్ని చూపిస్తున్నారన్నమాట. ‘అవతార్‌’ కథ మన సౌర కుటుంబంలోని చందమామ లాంటి ‘పండోరా’ అనే (ఊహాజనిత) చిన్న గ్రహంపై జరిగితే, ‘అవతార్‌ 2’ లోని కథ తొలి భాగంలో ప్రధాన పాత్రలైన జేక్‌, నేత్రి కుటుంబం చుట్టూ తిరుగుతుంది. తొలి భాగంలో వీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడి ఒక్కటైతే, రెండవ భాగంలో వారికి ఒక కుటుంబం ఏర్పడుతుంది. భూమిపై ఇప్పటికే మానవ సంబంధాలు బలహీనమవుతున్న నేపథ్యంలో ‘మన కుటుంబమే మనకు పెట్టని కోట’ అని పండోరాలో స్థిర నివాసం ఏర్పరచుకున్న జేక్‌ చేత దర్శకుడు జేమ్స్‌ చెప్పించనున్నారు.

ఎంతో శక్తిమంతమైన అన్‌అబ్‌ టైనియమ్‌ అనే ఖనిజ నిక్షేపాన్ని కాపాడుకోవడానికి పండోరా వాసులు భూగ్రహం నుంచి వచ్చిన మనుషులతో పోరాడితే, రెండవ భాగంలో ఆ కుటుంబం మనుగడ సాగించడానికి పరిసరాలతో పోరాడడం... మొత్తం కుటుంబం అనూహ్యమైన సవాళ్లను ఎదుర్కోవడం... వాటి నుంచి బయటపడేలోగా మళ్లీ భూమి మీద నుంచి వచ్చిన మనుషులు వారిని అటకాయించడం... కుట్రపూరితంగా వచ్చి తమను అంతం చేయాలనుకున్న వారిని ధైర్యంగా ఎదుర్కొని తమ వాళ్లను వీరోచితంగా కాపాడుకోవడం... వంటి ఘటనలను కేమెరాన్‌ రొమాంచితంగా తీశారని హాలీవుడ్‌ సినిమా విమర్శకులు ఇప్పటికే ‘అవతార్‌ 2’కు కితాబులు ఇస్తున్నారు.

avatar4.jpg

ఏళ్ల తరబడి శ్రమించి..

దర్శకుడు కేమెరాన్‌కు వరుస చిత్రాలు చేయడం కొత్త కాదు... నీళ్లలో సినిమా షూటింగులు చేయడమూ కొత్త కాదు. అలాగే రెండవ భాగానికి సంవత్సరాల తరబడి నిరీక్షించడమూ కొత్త కాదు. గతంలో ఆయన ‘టెర్మినేటర్‌’ చిత్రానికి సీక్వెల్‌ తీసినప్పుడు ఏడేళ్లు ఆగాల్సి వచ్చింది. ఇప్పుడు ‘అవతార్‌ 2’ తీయడానికి పన్నెండేళ్లు ఆగాడంటే అందుకు కారణం లేకపోలేదు. మామూలుగా అయితే నీళ్లలో తీసే సినిమాలలో కేబుల్స్‌ వాడడం, ఆ తర్వాత అవి కనిపించకుండా కంప్యూటర్‌లలో చెరిపేయడం వంటి సాంకేతిక ప్రక్రియ చాలా ఉంటుంది. జేమ్స్‌ ఇప్పుడు కొత్తగా చేసింది ఏమంటే సినిమా షూటింగు మొత్తం కేబుల్స్‌ లేకుండా నటీనటులతో పాటు తాను కూడా నీళ్లలో దిగి పూర్తిస్థాయి లైవ్‌ షూటింగ్‌ చేయడం. ఆ తర్వాత కంప్యూటర్‌ జెనెరేటెడ్‌ ఇమేజెస్‌ (సీజీఐ) పనితనం ఎలాగూ ఉండనే ఉంటుంది. ఇదంతా చాలా కష్టమైన, క్లిష్టమైన ప్రక్రియ. ప్రతి ఫ్రేమ్‌నీ జాగ్రత్తగా సరి చూసుకోవాలి. వాటిని మళ్లీ జత పరుచుకోవాలి. అందుకు కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానం ఉంటే చాలదు, ఆ సాంకేతికతని దర్శకుని ఆలోచనల ప్రకారం వినియోగించడంలో శిక్షణ పొందిన నిపుణులు కూడా కావాలి. ఇవన్నీ సమకూర్చుకోవడానికే కేమెరాన్‌కు ఇన్ని సంవత్సరాలు పట్టింది.

మొట్టమొదట ‘అవతార్‌’ గురించి కేమెరాన్‌ ఆలోచించి 80 పేజీల కథ రాసుకున్నప్పుడు, ఆయన మదిలో మెదిలే ఊహలకు అనుగుణంగా కంప్యూటర్‌లతో సృజనాత్మకంగా పనిచేయించగలిగిన సాంకేతికత లేదు. అది 1994 నాటి మాట. అది ఓ అపురూపమైన చలన చిత్రంగా రూపుదాల్చడానికి దాదాపు పదిహేను సంవత్సరాలు పట్టింది. అప్పటికి అది కొత్త. ఆ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ప్రపంచవ్యాప్తంగా అన్ని సినిమాలలోనూ ఇప్పుడు అదే టెక్నాలజీ మామూలైపోయింది. ఒక విధంగా ‘అవతార్‌’ టెక్నాలజీ సినిమా నిర్మాణ రీతులను, సినిమా వీక్షణ అనుభవాన్నీ సమూలంగా మార్చేసింది. ఆ తర్వాత ‘అవతార్‌ 2’ నీటిలో తీయాలని నిర్ణయించుకున్నాక చుట్టూ చూస్తే జేమ్స్‌కి మళ్లీ పాత టెక్నాలజీయే కనిపించింది. అందుకే కేమెరాన్‌ ఈ పరిస్థితిని అతి పెద్ద సవాలుగా తీసుకుని టెక్నాలజీ వచ్చేవరకూ ఆగారు. ఆ సాంకేతిక వికాసంలో తానూ ఓ భాగస్వామి అయ్యారు. ఇది కూడా భవిష్యత్తులో నీటిలో సినిమాని షూట్‌ చేసే పద్ధతిని స్థూలంగా మార్చేస్తుందని హాలీవుడ్‌ విశ్వసిస్తోంది.

ఎన్నెన్నో ప్రయోగాలు..

గతంలో కూడా కేమెరాన్‌ ‘ఎబిస్‌’, ‘టైటానిక్‌’ సినిమాలను నీటిలో తీశారు కానీ ‘‘ఆ టెక్నాలజీ ఇప్పుడు ‘అవతార్‌ 2’ ముందు ఎందుకూ కొరకాదు...’’ అని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. ‘అవతార్‌ 2’లో ఒకవైపు మోషన్‌ పిక్చర్‌ క్యాప్చర్‌, మరోవైపు పెర్ఫార్మెన్స్‌ క్యాప్చర్‌ పద్ధతులు రెండింటినీ ఉపయోగించినట్టు ఈ చిత్ర నిర్మాణంలో పాల్గొన్నవారు చెబుతున్నారు. మొదటిది నీళ్లలో నటిస్తున్న నటీనటుల శరీర కదలికలను మాత్రమే రికార్డు చేస్తే, రెండవది వారి శరీర కదలికలతో పాటు ముఖ కవళికలు, చేతి వేళ్లతో సహా అన్ని రకాల కదలికలనూ రికార్డు చేస్తుందట. ఈ ప్రయోగం ఇప్పటివరకూ ఎవ్వరూ చేయనిదని కేమెరాన్‌ను చిత్ర నిపుణులు ప్రశంసిస్తున్నారు.

‘టైటానిక్‌’లో రోజ్‌గా నటించి ప్రపంచ వ్యాప్తంగా యువతరాన్ని ఆకర్షించిన కేట్‌ విన్‌ స్లెట్‌ ‘అవతార్‌ 2’ లో నటించడం మరో విశేషం. సుమారు పది లక్షల గ్యాలన్ల నీటితో ప్రత్యేకంగా నిర్మించిన కృత్రిమ జలాశయంలో ఈ చిత్రం షూటింగు జరుపుతున్నప్పుడు కేట్‌ చాలాసేపు ఊపిరి బిగపట్టి నటించాల్సి వచ్చిందట. ఇదో రికార్డు అని హాలీవుడ్‌ పత్రికలు శ్లాఘిస్తున్నాయి. అంతకుముందు ఈ రికార్డు ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’లో నటించిన టామ్‌ క్రూజ్‌ పేర ఉంది. ఇంత పెద్ద జలాశయంలో సినిమా షూటింగ్‌ అంటే సముద్రంలో సినిమా షూటింగ్‌ వంటిదని హాలీవుడ్‌ పత్రికలు కీర్తిస్తున్నాయి.

ఏమిటీ ‘అవతార్‌’?..

సృజనాత్మక దర్శకుడు జేమ్స్‌ తన కాల్పనిక శక్తితో, ఓ కొత్త అన్వేషణా దృక్పథంతో భూమికి దూరంగా ‘పండోరా’ అనే ఒక అందమైన గ్రహాన్ని ఊహించి ఆ గ్రహంలోని పరిసరాలు, మనుషులు, జంతువులు, ప్రకృతీ జీవవైవిధ్యాన్ని కాపాడుకుంటూ హాయిగా మనుగడ సాగించడాన్ని కథాంశంగా రాసుకున్నారు. పండోరా గ్రహంలో సాగర సంపద, వన సంపద, ఖనిజ సంపద పుష్కలంగా ఉంది. అసమానమైన జీవ వైవిధ్యం ఉంది. అక్కడి మనుషులు ప్రకృతితో నిరంతరం తాదాత్మ్యం చెందుతూ... ఆకులో ఆకులై, జీవజాలానికి హాని కలగకుండా సఖ్యంగా జీవిస్తూ... ప్రకృతినే ఆరాధిస్తూ తమ అవసరాలను ప్రకృతి ద్వారా తీర్చుకుంటూ మనుగడ సాగిస్తుంటారు. భూగ్రహం మీది మనుషుల్లాగా ఉంటారు కానీ వారికి పెద్ద పెద్ద చెవులు, కళ్లూ ఉంటాయి. తోకతో ఉండే పొడగరులు. శరీరం నీలంగా ఉంటుంది. వారి కళ్లు పసిడి రంగులో మెరుస్తూ ఉంటాయి. ఇవన్నీ దర్శకుడు జేమ్స్‌ కేమెరాన్‌ ఊహల్లో జనించిన ఆకారాలు. వారికి తమదైన సొంత తెలివితేటలు, అయినవారిని కానివారినీ క్షణంలో గుర్తించే విచక్షణ, శత్రువును ఎదుర్కోవలసి వచ్చినప్పుడు ప్రదర్శించవలసిన ధైర్యసాహసాలు... అన్నీ ఉన్నాయి. భూమ్మీద మనుషులకు కన్ను కుట్టేంత ఆదర్శప్రాయమైన జీవనశైలి వారిది. పక్క మనిషి బాగుకోసమే కాదు, తమ పరిసరాల బాగుకోసం కూడా తహతహలాడే సంస్కృతి వారిది. ఆ గ్రహంపై ఓ అద్భుతమైన మహా వృక్షం ఉంది. అది చాలా శక్తిమంతమైనది. దాని క్రింద అన్‌అబ్‌ టైనియమ్‌ అనే ఖనిజ నిక్షేపం ఉంది. సరిగ్గా ఈ సంపదపైనే భూమి మీద ఓ కార్పొరేట్‌ సంస్థ కన్ను పడింది. ఆ శక్తి ఉత్పాదనపై ఏకఛత్రాధిపత్యం సాధించాలన్నది ఆ సంస్థ పన్నాగం. భూ ప్రపంచంలో బొగ్గు నిల్వలు ఏనాడో బూడిదైపోయాయి. చమురు నిక్షేపాలు ఆవిరైపోతున్నాయి. గాలి, నీరు, సౌర వెలుగులు భూమి మీద మనిషి ఇంధన దాహం తీర్చడానికి ఎంత శక్తిని ఇస్తున్నా అది మానవ అవసరాలకు సరిపోవడం లేదు. కొత్త ఇంధన వనరును ఎవరు చేజిక్కించుకుంటే వారే భవిష్య ఇంధన సామ్రాజ్యానికి రారాజులు! ఇదీ ‘అవతార్‌’ ప్రాథమిక కథాంశం.

‘అవతార్‌’ కథ మన కాలం నాటిది కాదు... కాని కథాంశం నేటి పరిస్థితులకే నప్పినట్టు ఉంటుంది. సినిమాలోని కథ రాబోయే శతాబ్దం నాటిది. మరో నూట పాతిక సంవత్సరాల తర్వాత జరిగేది. అప్పటికి భూమి మీద జనాభా రెండు వేల కోట్లు దాటిపోతుంది. ఈ భూమి మీద సహజ సంపద అంతరించిపోతున్న దశ. నిరుద్యోగం, నిత్యదారిద్య్రం ప్రపంచం నలుమూలలా తాండవిస్తున్న దుర్భర పరిస్థితులు. అన్ని సినిమాలలోగానే ఇందులోనూ విలన్లు ఉంటారు, హీరో ఉంటాడు. న్యాయాన్యాయాల మధ్య ఘర్షణ, సంస్కృతుల మధ్య సంఘర్షణ, విలువల మధ్య వైరుధ్యాలు, వాటి చుట్టూ నడిచే రకరకాల ఉత్కంఠభరితమైన ఘటనలు, దుర్ఘటనల తర్వాత... చివరికి భూమి మీద నుంచి వచ్చిన హీరో జేక్‌ సాయంతో పండోరా వాసులు శత్రువును తరిమికొట్టి తమ సంపద చేజారకుండా కాపాడుకుంటారు. ఇప్పుడిక రెండో భాగంలో జేక్‌ (సామ్‌ వర్తింగ్టన్‌), నీత్రీ (జో సల్దానా)లు అడాప్ట్‌ చేసుకున్న టీనేజ్‌ బిడ్డ కిరీ (సిగర్నీ వీవర్‌) కూడా ప్రధాన భూమిక పోషించనుంది.

వసూళ్లపైనే చర్చ..

‘అవతార్‌’ చుట్టూ దర్శకుడు జేమ్స్‌ కేమెరాన్‌ విస్మయం కలిగించే ఒక ‘చిత్ర వలయాన్ని’ నిర్మించేశాడు. చిన్నా పెద్దా ఎవ్వరినీ వదలకుండా అందరిలోనూ కుతూహలం కలిగించే విధంగా ‘డిస్నీ’ సంస్థ ఈ చిత్రాన్ని మార్కెట్‌ చేస్తోంది. రకరకాల అవతార్‌ బొమ్మలు, గేమ్‌లు, ట్రయిలర్లూ, టీజర్లూ, ఇతరత్రా ప్రచార వ్యూహాలూ ఈ ఛత్రం క్రింద నిర్విరామంగా పనిచేస్తుంటాయి. ‘అవతార్‌’ను దాదాపు రెండు వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తే, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 13 వేల 500 కోట్ల రూపాయలను బాక్సాఫీసుల వద్ద కొల్లగొట్టింది. క్లార్క్‌ గేబుల్‌, వివియన్‌ లీ పోటాపోటీగా నటించిన 1939 నాటి ‘గాన్‌ విత్‌ ది విండ్‌’ చిత్రంతో పోల్చితే ఇప్పటి లెక్కల ప్రకారం తొలి ‘అవతార్‌’ ది రెండవ స్థానం. విక్టర్‌ ఫ్లెమింగ్‌ దర్శకత్వం వహించిన ‘గాన్‌ విత్‌ ది విండ్‌’ చిత్రం బాక్సాఫీసు వద్ద సాధించిన విజయాన్ని అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా హాలీవుడ్‌ సినీ పరిశ్రమ లెక్కలు వేసింది. 2014 నాటి ఆర్థిక సూత్రాల ప్రకారం అంచనా వేస్తే ఆ మొత్తం సుమారు 28 వేల కోట్ల రూపాయలకు సమానం! ‘గాన్‌ విత్‌ ది విండ్‌’ ను పక్కన పెడితే రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత విడుదలైన చిత్రాలతో పోలిస్తే తొలి ‘అవతార్‌’ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ రాబడి సాధించిన చిత్రంగా రికార్డు సాధించిందని అంతర్జాతీయ సినిమా పత్రికలు అంచనా వేశాయి. ఈ రికార్డును 2012లో విడుదలైన ‘ఎవెంజర్స్‌’ తాత్కాలికంగా బద్దలు కొడితే, ఆ తర్వాత ‘అవతార్‌’ను చైనాలో విడుదల చేయడంతో మళ్లీ తన రికార్డును తానే బద్దలు కొట్టుకుంది. మరి ఇప్పుడు ‘అవతార్‌ 2’ ఆ బాక్సాఫీసు లెక్కలను తిరగరాస్తుందా? వేచి చూడాలి.

కాల్పానిక ప్రపంచమే కానీ..

‘అవతార్‌’ కేవలం సృజనాత్మకమైన ఒక గ్రాఫిక్‌ మాయాజాలం అనుకుంటే చాలా? ఇందులో మానవ చరిత్రకు, నాగరికతకు, సాంస్కృతిక విధ్వంసానికి సంబంధించిన ముద్రలు ఏమైనా ఉన్నాయా? - ఈ చిత్రానికి సంబంధించి ఇవి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు.

ఒక విధంగా చెప్పాలంటే ‘అవతార్‌’ భూమి మీద కొన్ని శతాబ్దాలపాటు జరిగిపోతున్న అన్యాయాన్ని ఒక ఊహాజనిత గ్రహ జీవితంలో చూపిస్తుంది. అమెరికాలో మూలవాసుల జీవనాన్ని, సంస్కృతినీ, ప్రకృతితో వారి తాదాత్మ్యాన్నీ యూరోపియన్‌ దురాక్రమణదారులు ఒక పద్ధతి ప్రకారం ఎలా విధ్వంసం చేసిందీ ఈ చిత్రం ద్వారా దర్శకుడు గుర్తు చేస్తున్నారు. మానవ చరిత్రలోని చీకటి కోణాలను మళ్లీ మళ్లీ తడమడం ద్వారా ఎక్కడైనా ఒక చిన్న వెలుగు రవ్వ మెరుస్తుందేమోనని ఆయన ఆశ. ‘సర్వేజనా సుఖినోభవంతు’ అనేదే ఆయన ఆదర్శం. ఆ దిశగానే మరికొన్ని ‘అవతార్‌’లను సృష్టించేందుకు కేమెరాన్‌ ఇప్పటికే సన్నాహాలు చేసుకుని, ఆ దిశగా శరవేగంగా దూసుకెళ్తున్నారు.

వరుస సీక్వెల్స్‌ వస్తున్నాయి..

తొలి ‘అవతార్‌’ తర్వాత రెండో భాగానికి జేమ్స్‌ కేమెరాన్‌ పన్నెండేళ్ల సుదీర్ఘ సమయం తీసుకున్నప్పటికీ మిగతావాటి విడుదల తేదీలను ఆయన ముందే ప్రకటించేశారు. ‘అవతార్‌ 2’ ఈ ఏడాది డిసెంబర్‌ 16న ప్రపంచవ్యాప్తంగా సరికొత్త విజువల్‌, సౌండ్‌ ఎఫెక్ట్‌లతో ప్రేక్షకుల మందుకు రాబోతోంది. ఆ తర్వాత రెండేళ్లకి (20-12-2024) మూడవ భాగం, మరో రెండేళ్లకి (18-12-2026) నాల్గవ భాగం, ఆ తర్వాత రెండేళ్లకి (22-12-2028) ఐదవ భాగం... ఇలా విడుదల తేదీలు (అన్నీ డిసెంబర్‌లోనే) ముందే నిర్ణయించేసి ఆ దిశగా ‘అవతార్‌’ పరంపరల నిర్మాణాన్ని కేమెరాన్‌ స్పష్టమైన ప్రణాళికతో శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ‘అవతార్‌ 2’ ఇంకా విడుదల కాలేదు కానీ అప్పుడే అవతార్‌ 3 షూటింగ్‌ పని కూడా చక చకా పూర్తి అయిపోతోందట.

రీ రిలీజ్‌కూ పట్టం..

‘అవతార్‌ 2’ చిత్రాన్ని చూడడానికి ఉపక్రమించే మందు ప్రాథమిక కథను మరోసారి తేలికగా గుర్తు చేసుకోవడానికి వీలుగా తొలి ‘అవతార్‌’ను ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలో ‘పురజనుల కోరికపై’ అన్నట్టు మళ్లీ విడుదల చేశారు. పాత సినిమానే మళ్లీ కొత్తగా చూస్తున్న అనుభూతిని ఇవ్వడం కోసం ఈ చిత్రాన్ని రీమాస్టర్‌ చేసి 4కె 3డి హై డైనమిక్‌ రేంజ్‌లో విడుదల చేశారు. ఇది కూడా మళ్లీ బాక్సాఫీసుల వద్ద కనకవర్షం కురిపించింది. పుష్కరం గడిచిపోయిన సినిమాని ఏదో విశేషం జోడించి గొప్పగా విడుదల చేయాలంటే ఎంతో తెగువ ఉండాలి. అంతటి తెగువ, విజయం పట్ల విశ్వాసం కేమెరాన్‌ ఒక్కడికే సొంతం!

తల్లి కల... కేమెరాన్‌ రూపకల్పన..

‘అవతార్‌’ చిత్రంలో పండోరా గ్రహంపై జీవించే మనుషులు అసాధారణమైన ఎత్తు, నీలి వర్ణంలో ఉండడానికి కారణం ఒక కల! కేమెరాన్‌ తల్లికి చాలా సంవత్సరాల క్రితం ఒక కల వచ్చిందట. అందులో చాలా పొడవైన వ్యక్తులు నీలి వర్ణంలో కనిపించారట. ఆ కలే కేమెరాన్‌ కథలోని జీవులకు రూపం, వర్ణం ఇచ్చింది. సినిమాలో థ్రిల్లింగ్‌గా అనిపించే ఊహ ఏమంటే కాస్త అటుఇటుగా కాంతి వేగంతో ప్రయాణించే రోదసీ వాహనాన్ని మనిషి తయారుచేసుకుంటే పండోరాకు చేరడానికి ఆ వాహనానికి సుమారు ఆరేళ్లు పడుతుంది. ఈ ఆరేళ్లలో అందులో ప్రయాణించేవారి వయసు పెరగకుండా శరీర సహజ ధర్మం మారకుండా జీవవ్యాపారాన్ని స్తంభింపజేస్తారు. గమ్యం చేరిన తర్వాత మళ్లీ వారి శరీర జీవవ్యాపారం పునరుత్తేజం పొందేటట్టు చేస్తారు. ఇటువంటి ప్రక్రియ భవిష్యత్తులో ఏనాటికైనా సాధ్యమేనని శాస్త్రవేత్తలు బలంగా విశ్వసిస్తున్నారు.

ఈ కథాంశంతో చాలామంది సైన్స్‌ ఫిక్షన్‌ రచయితలు నవలలు రాశారు. హెచ్‌ జి వెల్స్‌ ‘ది టైమ్‌ మెషిన్‌’ రాసినప్పుడు జీవవ్యాపారాన్ని స్తంభింపజేయవలసిన అవసరం పడలేదు. ఎందుకంటే ఆ నవలలో స్థలం కొలతతో సంబంధం లేకుండా, కాలం కొలతలోనే ముందుకూ వెనుకకూ ప్రయాణం కాబట్టి వెల్స్‌కి ఆ ఆలోచనే రాలేదు. ఆ ఆలోచన ఆధారంగా కొన్ని సినిమాలూ వచ్చాయి. 1968లో స్టాన్లీ కుబ్రిక్‌ నిర్మించిన ‘ఎ స్పేస్‌ ఒడిస్సీ’, 2014లో క్రిస్టఫర్‌ నొలాన్‌ నిర్మించిన ‘ఇంటర్‌ స్టెలార్‌’ ఈ కోవలోవే. ఇప్పుడు జేమ్స్‌ కేమెరాన్‌ ఆవిష్కరించిన ‘అవతార్‌’ ఈ సైన్స్‌ ఫిక్షన్‌లో మరో అడుగు ముందుకు వేసింది. భూమి మీద ఎంపిక చేసిన మనుషులు మరో గ్రహానికో, మరో సౌర కుటుంబంలోని చందమామ మీదికో ప్రయాణించినప్పుడు ప్రత్యేక జీవ వైద్య వైజ్ఞానిక శాస్త్ర సాంకేతికతతో అక్కడి మనుషుల్లా రూపాంతరం చెందడమే ‘అవతార్‌’!.

‘ది వే ఆఫ్‌ వాటర్‌’కు ముందు..

1975లో స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ ‘జాస్‌’ చిత్రాన్ని ఒక పెద్ద సైజు స్విమ్మింగ్‌పూల్‌లో తీశాడు (అది ఇప్పటికీ లాస్‌ ఏంజిల్స్‌లోని యూనివర్సల్‌ స్టూడియోలో పర్యాటకులకు ఆ రోజులను గుర్తుచేస్తోంది). గతంలో నీటిని బ్యాగ్రౌండ్‌గా తీసుకుని రూపొందించిన సినిమాలు చాలానే ఉన్నాయి. 1956లో దర్శకుడు సెసిల్‌ డీమిలే తీసిన ‘టెన్‌ కమాండ్‌మెంట్స్‌’లో సముద్రం నిలువునా చీలిపోయిన దృశ్యం ఇప్పటికీ ఓ అద్భుతమే. 1972లో వచ్చిన ‘పొసైడన్‌ అడ్వెంచర్‌’ కూడా మరువలేని చిత్రమే. ఇందులో కూడా ‘టైటానిక్‌’లో లాగా పొసైడన్‌ అనే నౌక సముద్రం ఉధ్థృతికి మునిగిపోతుంది. పదిమంది తప్ప అందరూ మృత్యువాత పడతారు. ఇక స్వయానా జేమ్స్‌ కేమెరాన్‌ తీసిన ‘ఎబిస్‌’ కూడా నీళ్లలో తీసిందే. ఈ చిత్రాల కథనం, మరికొన్ని సైన్స్‌ ఫిక్షన్‌ కథలూ అన్నీ కలగలిసి దర్శకుడు జేమ్స్‌ కేమెరాన్‌కు ఉత్తేజాన్నిచ్చాయి. ఫలితంగా ‘అవతార్‌’ పరంపరలు రూపుదిద్దుకుంటున్నాయి.

Updated Date - 2022-12-04T12:20:06+05:30 IST