Lionel Messi: మెస్సీ మనోడే: కాంగ్రెస్ ఎంపీ
ABN , First Publish Date - 2022-12-19T20:28:01+05:30 IST
అర్జెంటినా (Argentina) సాకర్ దిగ్గజం లియోన్ మెస్సీ(Lionel Messi) పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా
న్యూఢిల్లీ: అర్జెంటినా (Argentina) సాకర్ దిగ్గజం లియోన్ మెస్సీ(Lionel Messi) పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఆదివారం ఫ్రాన్స్ (France)తో జరిగిన ఫైనల్‌లో అద్భుత ఆటతీరుతో మెస్మరైజ్ చేసిన మెస్సీ దేశానికి మూడో ప్రపంచకప్ అందించాడు. మెస్సీపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్న వేళ కాంగ్రెస్ ఎంపీ అబ్దుల్ ఖలీక్ (Abdul Khaleque) ఆయనను ఓన్ చేసుకునే ప్రయత్నంలో తడబడి అభాసుపాలయ్యారు. అర్జెంటినా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనల్ మెస్సీ మనోడేనని, అస్సాంలోనే పుట్టాడని ఖలీక్ ట్వీట్ చేశారు. అంతే, ఆ ట్వీట్ క్షణాల్లోనే వైరల్ అయిపోయింది.
అసోం(Assam)లోని బార్జెటా నియోజకవర్గానికి చెందిన ఖలీక్.. ఫిఫా ప్రపంచకప్ (Fifa World Cup)లో అర్జెంటినా విజయం సాధించిన అనంతరం మెస్సీని అభినందిస్తూ ట్వీట్ చేశారు. మెస్సీకి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూనే.. మెస్సీకి అసోంతో సంబంధాలు ఉన్నందుకు గర్వంగా ఉందని అన్నారు.
కాంగ్రెస్ ఎంపీ ట్వీట్ చూసిన ఓ యూజర్.. మెస్సీకి, అసోంకు ఎలాంటి సంబంధం ఉందని ప్రశ్నించాడు. దానికి ఖలీక్.. మెస్సీ అసోంలో పుట్టాడని రిప్లై ఇచ్చారు. అయితే, ఆ తర్వాత తన తప్పును తెలుసుకున్న ఎంపీ ఖలీక్ ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు. అయినప్పటికీ ఆయన నెటిజన్ల దాడి నుంచి తప్పించుకోలేకపోయారు.
ఖలీక్ ట్వీట్‌కు ఓ యూజర్ స్పందిస్తూ.. ‘అవును సర్.. అతడు నా క్లాస్‌మేట్’ అని సెటైర్ వేశాడు. ‘ప్రపంచకప్ గెలిచాక మెస్సీ, అతడి భార్య అసోం వచ్చారు. మనమెప్పుడూ మన మూలాలు మర్చిపోకూడదు’ అని మరో యూజర్ వ్యంగ్యంగా రాసుకొచ్చాడు. మరికొందరైతే మరికొంత ముందుకెళ్లి ట్వీట్లు చేశారు. తాను అసోంలో పుట్టినట్టు తనకిప్పుడే తెలిసిందని ఒకరంటే, మరో యూజర్ మెస్సీ ఫొటోను పోస్టు చేసి అతడు రెండుసార్లు ఎమ్మెల్యే అని పేర్కొన్నాడు.