CM Chandrababu: ఆ పరిస్థితి రానీయొద్దు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ABN , Publish Date - Mar 25 , 2025 | 07:13 PM
CM Chandrababu: వేసవి కాలంలో గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలు ఎక్కడైనా సరే తాగునీళ్ల కోసం ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. వేసవి కాలం పూర్తయ్యేవరకు జిల్లాలో తాత్కాలిక కాల్ సెంటర్లు ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కలెక్టర్‌ల సమావేశం ఇవాళ(మంగళవారం) రాష్ట్ర సచివాలయంలో జరిగింది. వేసవి నీటి ఎద్దడిపై సీఎం చంద్రబాబు ఆయా జిల్లాల కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. వేసవి పూర్తయ్యే వరకు జిల్లాల్లో కాల్‌సెంటర్లు పెట్టుకోవాలని.. తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. నీళ్ల సమస్యలపై జీపీఎస్ - రియల్ టైమ్ పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. వేసవిలో ఎక్కడా కూడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
స్టోరేజీ ట్యాంకులను నింపాలి..
వేసవి కాలంలో గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలు ఎక్కడైనా సరే తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీనికోసం వేసవి కాలం పూర్తయ్యేవరకు జిల్లాలో తాత్కాలిక కాల్ సెంటర్లు ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. మంచినీళ్ల సమస్య ఎక్కడైనా తలెత్తినా దాన్ని రియల్ టైమ్‌లో పర్యవేక్షించి పరిష్కరించాలని సీఎం చంద్రబాబు అన్నారు. సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను అన్నింటిని నీటితో నింపాలని సీఎం చంద్రబాబు సూచించారు.
ప్రజలకు తాగునీరు అందించే ఏర్పాట్లకు సంబంధించి ఎక్కడా కూడా నిధులకు కొరత లేదని, జిల్లా కలెక్టర్లు దీనిపైన ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. వేసవి నీటి ఎద్దడి ఎదుర్కోవడంలో హేతుబద్దంగా పనిచేయాలని, అప్పుడే ప్రజలు మన పనులను హర్షిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రం
సచివాలయంలో కలెక్టర్ల కాన్సరెన్స్‌లో వివిధ శాఖలపై ప్రజెంటేషన్లు ఇచ్చారు. 3వ కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ కీలక అంశాలపై చర్చించారు. ఈ కలెక్టర్ల సదస్సు అజెండా, చర్చలను ఈసారి భిన్నంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ప్రాధామ్యాలు, లక్ష్యాలు, సాధించిన ప్రగతి, సంక్షేమ పథకాల అమలు తీరును సీఎం చంద్రబాబు వివరించారు. విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని తీసుకువెళ్లడంలో కలెక్టర్లు కీలకమని ఉద్ఘాటించారు. జిల్లా ఎగ్జిక్యూటివ్‌గా విస్తృత అధికారాలు, బాధ్యతలు కలెక్టర్లకు ఉన్నాయని చెప్పారు. ప్రజల అర్జీల పరిష్కారంలో మరింత చొరవ చూపాలని ఆదేశించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలను చేరుకునేందుకు జిల్లా స్థాయిలో అమలు చేయాల్సిన ప్రణాళికపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ ఏడాది 17 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ పథకాల అమల్లో ఉద్యోగులు, అధికారులు మరింత బాధ్యతగా ఉండాలని ఆదేశించారు. ఈ ఏడాది ఏం చేయాలి... 2029 నాటికి ఏయే లక్ష్యాలను సాధించాలనే అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టత ఇచ్చారు.
స్వర్ణాంధ్ర 2047 విజన్‌పై పీయూష్ కుమార్ ప్రజెంటేషన్
సీఎం ప్రసంగం తర్వాత స్వర్ణాంధ్ర 2047 విజన్‌పై ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్ కుమార్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ఏడాదికి 15 శాతం వృద్ధి సాధనతోనే స్వర్ణాంధ్ర-2047 సాకారం అవుతుందని తెలిపారు. 2047 నాటికి రూ.308 లక్షల కోట్ల ఆర్ధిక వ్యవస్థగా ఏపీ చేరాలనేది లక్ష్యమని అన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.55 లక్షల సాధనకు పది సూత్రాలతో ప్రణాళిక చేశామని చెప్పారు. 60 శాతం పట్టణీకరణ, నిరుద్యోగిత తగ్గించడం…రూ.39.12 లక్షల కోట్ల ఎగుమతులు సాధించడం లక్ష్యాలని వివరించారు. 2029 నాటికి తలసరి ఆదాయం రూ.5,42,985లు అని ప్రకటించారు.
విజన్ యాక్షన్ ప్లాన్‌పై ప్రజెంటేషన్
రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం, మండలం, మున్సిపాలిటీ, సచివాలయం స్థాయిలో ‘విజన్ యాక్షన్ ప్లాన్’ పై పీయూష్ కుమార్ ప్రజెంటేషన్ ఇచ్చారు. జిల్లాల మధ్య తలసరి ఆదాయంలో వచ్చిన మార్పులపై సీఎం చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సత్యసాయి జిల్లాలో తలసరి ఆదాయం రూ.2,19,234 కాగా... అనంతపురం జిల్లాలో రూ. 2,33,521, డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రూ.1,93,763గా ఉందని అన్నారు. కరువు పీడిత ప్రాంతంగా, వెనుకబడిన జిల్లాగా పరిగణించబడే అనంతపురం జిల్లా కోనసీమ కంటే తలసరి ఆదాయంలో ముందుందని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. హార్టికల్చర్, సెరికల్చర్ కారణంగా రాయలసీమ జిల్లాల్లో తలసరి ఆదాయం పెరిగిందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తలసరి ఆదాయం పెరుగుదలకు కారణాలను, బెస్ట్ ప్రాక్టీసెస్‌ను ఇతర జిల్లాల్లో అమలు చేయాలని సీఎం చంద్రబాబు తెలిపారు.
వాట్సాప్ గవర్నెన్స్‌పై ప్రజెంటేషన్
వాట్సాప్ గవర్నెన్స్‌పై ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుతం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మన మిత్ర ద్వారా 210 సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మరో 15 రోజుల్లో వీటిని 350కు పెంచుతామని అధికారులు అన్నారు. వాట్సాప్ ద్వారా డిజిటల్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్‌కు అనూహ్య స్పందన ఉందని... ఈ సేవలను మరింత విస్తృత పరచాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రామాలపై ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఐవీఆర్ఎస్, క్యూఆర్ కోడ్ స్కానింగ్ వంటి విధానాల ద్వారా లబ్ధిదారుల అభిప్రాయాల సేకరిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. 22 ప్రభుత్వ సేవల్లో పాజిటివ్ పర్సెప్షన్‌పై సర్వే చేస్తున్నామని తెలిపారు. ప్రతి వారం నాలుగు సర్వీసులపై సమీక్ష... దాని ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబు అన్నారు.
ఫ్రీ హోల్డ్ లో ఉన్న భూములపై చర్చ..
రెవెన్యూ శాఖపై సీసీఎల్ఏ జయలక్ష్మి ప్రజెంటేషన్ ఇచ్చారు. ఫ్రీ హోల్డ్‌లో ఉన్న భూములు, భూ వివాదాలు, ఫిర్యాదులు, అర్జీలపై సీసీఎల్ఏ నివేదిక ఇచ్చారు. ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో రెవెన్యూ సమస్యలపై అర్జీలు వస్తున్నాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. భూ వివాదలకు కారణాలపై కలెక్టర్ల సదస్సులో గంటపాటు చర్చ జరిగింది. తమ అభిప్రాయాలు, అనుభవాలను మంత్రులు అనగాని సత్యప్రసాద్, పార్థసారధి, జిల్లా కలెక్టర్లు వెల్లడించారు. గత జగన్ ప్రభుత్వం భూ సర్వే పేరుతో అనుసరించిన అస్థవ్యస్థ విధానం వల్ల భూ వివాదాలు పెరిగాయని చెప్పారు. భూ సమస్యలకు, ప్రజల అర్జీలకు పరిష్కారం చూపాల్సిందేనని సీఎం చంద్రబాబు అన్నారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపే విధానాల రూపకల్పనకు వర్క్ షాప్ నిర్వహించాలని సీఎం చంద్రబాబు తెలిపారు. క్షేత్ర స్థాయి పరిస్థితులు తెలిసిన కలెక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగులు, మంత్రులు, నిపుణులు కలిసి నెల రోజుల్లో పరిష్కారం కోసం నివేదికతో రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. దశాబ్దాల పాటు ప్రజల భూ సమస్యలు పరిష్కరించకుండా... వివాదాల్లోనే ఉంచి... ప్రజలకు నష్టం జరిగేలా గత వైసీపీ ప్రభుత్వం వ్యవహారించిందని సీఎం చంద్రబాబు అన్నారు. గరిష్టంగా ఏడాది కాలంలో రాష్ట్రంలో భూ వివాదాలపై ప్రజల అర్జీలను పరిష్కరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ రోజు సాయంత్రం నుంచి జిల్లాల వారీగా కలెక్టర్లు ప్రజెంటేషన్లు ఇవ్వనున్నారు. కలెక్టర్ల సదస్సులో మొదటి రోజు సమావేశంలో భాగంగా వివిధ శాఖల ప్రజెంటేషన్లు ముగిశాయి. అనంతరం లా అండ్ ఆర్డర్‌పై ఎస్పీలు, కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. లా అండ్ ఆర్డర్ అంశంపై సమీక్ష తర్వాత మొదటి రోజు సమావేశం ముగిసింది.
పీఎం సూర్యఘర్ పథకంపై సమీక్ష
కలెక్టర్ల సమావేశంలో పీఎం సూర్య ఘర్ పథకంపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 10 వేల రూఫ్ టాప్ యూనిట్లు ఏర్పాటు చేయాలని అన్నారు. ఆ ప్రకారం ఈ ఏడాది ఏపీలో 20 లక్షల రూఫ్ టాఫ్ సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ విషయంలో ఎమ్మెల్యేలు, కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
2 కిలోవాట్ రూఫ్ టాప్ యూనిట్లు ఏర్పాటు చేసుకునే ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం రూ.60వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.55 వేలను సబ్సిడీగా అందిస్తోందని తెలిపారు. అవసరాలకు వినియోగించుకోగా మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు అందిస్తే యూనిట్‌కు రూ. 2ల 90 పైసల వంతున చెల్లిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఎస్టీ, ఎస్సీలకు 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu On DSC: మెగా డీఎస్సీపై కీలక అప్డేట్.. వచ్చే నెల మొదటి వారంలోనే
Viveka Case Update: వివేకా హత్య కేసు.. అవినాష్ కుట్రను బయటపెట్టిన ఏపీ సర్కార్
Vallabhaneni Vamsi Remand: మరికొన్ని రోజులు జైల్లోనే వంశీ
Read Latest AP News And Telugu News