Rolls Royce cars: సౌదీ ఫుట్‌బాల్ జట్టుకు రోల్స్ రాయస్ కార్లు.. ఇందులో నిజమెంత?
ABN , First Publish Date - 2022-11-26T21:23:59+05:30 IST
Did prince Salman promise Rolls Royce cars to Saudi football team guru
దోహా: ఫిఫా ప్రపంచకప్‌లో దిగ్గజ జట్టు అర్జెంటినా (Argentina)ను ఓడించి చరిత్ర సృష్టించిన సౌదీ అరేబియా (Saudi Arabia) జట్టుకు ఆ దేశ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ( Mohammed bin Salman) ఖరీదైన రోల్స్ రాయస్ ఫాంటమ్ (Rolls-Royce Phantom) కార్లను బహుమతిగా ఇస్తున్నట్టు వార్తలు హల్‌చల్ చేశాయి. ఆటగాళ్లు ఖతర్ నుంచి సౌదీకి తిరిగి రాగానే ఆటగాళ్లందరికీ అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ కార్లను తలా ఒకటి ఇవ్వాలని సౌదీ రాజకుటుంబం నిర్ణయించినట్టు యూకే మీడియాలో కథనాలు వచ్చాయి. ఒక్కో కారు ధర దాదాపు రూ. 11 కోట్లు. దీంతో ఈ వార్త కాస్తా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. సౌదీ రాజుది పెద్దమనసంటూ ప్రశంసల వర్షం కురిపించారు.
అయితే, ఈ వార్తల్లో నిజం లేదని సౌదీ అరేబియా ఫుట్‌బాల్ ఆటగాడు సలే అల్-షెహరీ (Saleh Al-Shehri) తేల్చి చెప్పాడు. అర్జెంటినాతో జరిగిన మ్యాచ్‌లో సౌదీ అరేబియా 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఇది ప్రపంచకప్ చరిత్రలోనే సంచలనమని కొందరు చెప్పుకొచ్చారు. ఈ విజయంతో సౌదీలో సంబరాలు మొదలయ్యాయి. విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు సౌదీ ప్రభుత్వం సెలవు కూడా ప్రకటించింది.
శుక్రవారం పోలండ్‌తో మ్యాచ్‌కు ముందు జరిగిన మీడియా సమావేశంలో షెహరీ మాట్లాడుతూ.. సౌదీ ప్రిన్స్ తమకు రోల్స్ రాయస్ కార్లను బహుమతిగా ఇస్తున్నట్టు వార్తలు వస్తున్నాయని కానీ, ఆ వార్తలు వాస్తవ దూరమని పేర్కొన్నాడు. ఆ మీడియా సమావేశంలో ఓ జర్నలిస్ట్ మాట్లాడుతూ.. సౌదీ ఆటగాళ్లు రోల్స్ రాయస్ కార్లను బహుమతిగా పొందబోతున్నట్టు తనకు తెలిసిందని, దీనిపై స్పందించగలరా? అని షెహరీని ప్రశ్నించాడు. అంతేకాదు, మీరైతే ఏ రంగు ఎంచుకుంటారని కూడా ప్రశ్నించాడు.
చిరునవ్వుతో స్పందించిన సౌదీ ఆటగాడు.. దురదృష్టవశాత్తు ఈ వార్తలు అబద్ధమని పేర్కొన్నాడు. తాము దేశానికి సేవ చేయాలని అనుకుంటున్నామని, తాము చాలా గొప్ప విజయాన్ని అందుకున్నామని, అదే గొప్ప బహుమతి అని స్పష్టం చేశాడు. కాగా, అర్జెంటినా, సౌదీ జట్ల మధ్య దాదాపు 48 ర్యాంకుల అంతరం ఉంది. ఇక, ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటినా జట్టుకు మూడేళ్లుగా ఓటమన్నదే తెలియదు. అలాంటి జట్టును సౌదీ ఓడించడం సంచలనమైంది.