FIFA Worldcup2022: ఫిఫా వరల్డ్ కప్ పుణ్యమా అని భారత్‌లో కొందరికి లక్కీ చాన్స్.. కారణం ఇదే..
ABN , First Publish Date - 2022-11-23T16:48:32+05:30 IST
ఎడారి దేశం ఖతార్ (Qatar) వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ 2022 (FIFA world cup2022) ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ లవర్స్‌ని ఉర్రూతలూగిస్తోంది.
చెన్నై: ఎడారి దేశం ఖతార్ (Qatar) వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ 2022 (FIFA world cup2022) ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ లవర్స్‌ని ఉర్రూతలూగిస్తోంది. తమతమ జట్లకు మద్ధతు తెలిపేందుకు ఫ్యాన్స్ తాండోపతండాలుగా అక్కడికి వెళ్తున్నారు. దీంతో దోహా నగర వీధులన్నీ అభిమానులతో కిక్కిరిసిపోతున్నాయి. ఫలితంగా అక్కడి హోటళ్లు, రెస్టారెంట్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. అంతేకాదు ఆహార పదార్థాల గిరాకీ కూడా అమాంతం పెరిగిపోయింది. ఈ పరిణామం అక్కడి హోటళ్లు, రెస్టారెంట్ల యాజమానులకే కాకుండా ఇతర దేశాల నుంచి ఆహార పదార్థాలు ఎగుమతి చేసేవారికి కూడా లక్కీ చాన్స్‌గా మారింది. భారత్ విషయానికి వస్తే తమిళనాడు (Tamilnadu) నుంచి ఖతార్‌కు కోడి గుడ్ల ఎగుమతులు (Eggs Exports) అనూహ్యంగా రెట్టింపు అయ్యాయి. ఈ పరిణామం నమక్కల్ (Namakkal) జిల్లా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న పౌల్ట్రీ యజమానులకు అదృష్టంగా మారింది. తమిళనాడు నుంచి ఖతార్‌కు కోడి గుడ్ల ఎగుమతులు రెట్టింపవ్వడమే ఇందుకు కారణమైంది. కోడిగుడ్ల ఎగుమతి 1.5 కోట్ల నుంచి 2.5 కోట్లకు పెరిగిందని రిపోర్టులు చెబుతున్నాయి. టర్కీ గుడ్ల కంటే ఇక్కడి గుడ్లు తక్కువ రేటుకే లభిస్తుండడంతో వీటికే ఖతార్ ప్రాధాన్యతనిస్తోంది.
‘ది హిందూ’ రిపోర్ట్ ప్రకారం... నమక్కల్ కేంద్రంగా 1,100లకుపైగా పౌల్ట్రీ ఫామ్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. రోజుకు 5.5 కోట్ల నుంచి 6 కోట్ల కోడి గుడ్ల ఉత్పత్తి జరుగుతుంది. ఉత్పత్తిదారులు ఇక్కడి నుంచి కేరళకు 1.50 కోట్ల నుంచి 1.75 కోట్ల గుడ్ల ఎగుమతి, 45 లక్షల గుడ్లు మధ్యాహ్న భోజన పథకానికి, 40 లక్షల గుడ్లు బెంగళూరుకు ఎగుమతి చేస్తారు. ఇక మిగతా గుడ్లను ఇక్కడి నుంచి తమిళనాడులోని ఇతర జిల్లాలు, విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఖతార్ నుంచి డిమాండ్ పెరుగుదల కారణంగా ఎగుమతులు 1.5 కోట్ల గుడ్ల నుంచి ప్రస్తుతం 2 కోట్ల - 2.5 కోట్లకు చేరింది. కాగా డిమాండ్ పెరుగుదల కారణంగా ఒక్కో గుడ్డు రేటు రూ.5.35 నుంచి రూ.6 కు పెరిగింది. ఫలితంగా రిటైల్ గుడ్డు రేటు కూడా రూ.6కు పెరిగే అవకాశాలు లేకపోలేదు. ఫిఫా వరల్డ్ కప్ వల్లే ఇదంతా జరిగింది.