FIFA-Iran Team: ఫిఫా వరల్డ్ కప్‌లో ఇరాన్ ప్రభుత్వానికి భారీ షాక్..
ABN , First Publish Date - 2022-11-21T20:32:12+05:30 IST
సంప్రదాయం పేరిట మహిళల హక్కులను కాలరాస్తున్న ఇరాన్ ప్రభుత్వానికి ఫిఫా వర్డల్ కప్‌లో భారీ షాక్ తగిలింది.
ఖతార్: సంప్రదాయం పేరిట మహిళల హక్కులను కాలరాస్తున్న ఇరాన్ ప్రభుత్వానికి ఖతార్ వేదికగా ఫిఫా వర్డల్ కప్‌లో(FIFA cup England-Iran Match) భారీ షాక్ తగిలింది. వరల్డ్ కప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో తొలి మ్యాచ్‌కు ముందు ఇరాన్ జాతీయ జట్టు(Iran)..ప్రభుత్వంపై నిరసనగా జాతీయ గీతం(National Anthem) ఆలపించలేదు. ప్రారంభకార్యక్రమంలో ఇరాన్ జట్టు సభ్యులందరూ జాతీయ గీతాలాపనకు బదులు మౌనం దాల్చారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జాతీయ గీతం ఆలపించాలా వద్దా అనేది జట్టు సభ్యులు అందరూ ఉమ్మడిగా నిర్ణయిస్తారని జట్టు కెప్టెన్ అలీరెజా జహాన్ బక్ష అంతకుముందు పేర్కొన్నారు. ఈ క్రమంలో.. ఇరాన్ జట్టు చివరకు జాతీయం గీతం ఆలపించలేదని అంతర్జాతీయ మీడియాలో విస్తృత కథనాలు వెలువడ్డాయి.
తమ హక్కుల కోసం ఇరాన్ మహిళలు గత రెండు నెలలుగా దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్న విషయం తెలిసిందే. హిజాబ్ ధరించని కారణంగా జైలు పాలైన మాసా అమీనీ(Mahsa Amini).. పోలీసు కస్టడీలోనే మృతి చెందడంతో ఇరాన్‌లో ఒక్కసారిగా అగ్గిరాజుకుంది. తొలుత చిన్నపాటి నిరసనల కార్యక్రమాలుగా మొదలైన మహిళల ఆగ్రహ జ్వాల చూస్తుండగానే.. యావత్ దేశాన్ని చుట్టుముట్టింది( Iran Hijab Protests). వేల సంఖ్యలో యువతులు, మహిళలు వీధుల్లో కదనుతొక్కుతూ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. సంప్రదాయం పేరిట తిరోగమన విధానాలను ప్రోత్సహిస్తూ తమ హక్కులను ఉల్లంఘిస్తున్నారని వనితలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మహిళల నిరసన కార్యక్రమాలు ఓ విప్లవాన్ని తలపించేలా ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. 1979 ఇస్లామిక్ విప్లవం తరువాత.. దేశంలో ఈ స్థాయిలో కలకలం రేగడం ఇదే ప్రథమం.
అయితే.. సాంప్రదాయాల్ని కాపాడుకుంటామంటూ ఇరాన్ ప్రభుత్వం నిరసనకారులపై ఉక్కుపాదం మోపుతోంది. దీంతో.. ఇప్పటివరకూ 280 మంది మహిళలు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇక ఇరాన్‌లో పరిస్థితుల పట్ల అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే..మహిళలు మాత్రం ప్రభుత్వాన్ని మొక్కవోని ధైర్యంతో ఢీకొంటూ తమ హక్కుల కోసం ఉద్యమిస్తున్నారు. ఇరాన్‌లోని అన్ని వర్గాల వారి మద్దతు కూడగడుతున్నారు. వారి పోరాటానికి మద్దతుగా ఇరాన్ జాతీయ జట్టు వరల్డ్ కప్‌లో జాతీయ గీతాన్ని ఆలపించేందుకు నిరాకరించింది.