FIFA World Cup: ఫిఫా వరల్డ్ కప్ ఏర్పాట్ల వెనుక నమ్మలేని నిజాలు.. 6500 మంది వలస కార్మికులు బలి

ABN , First Publish Date - 2022-11-21T21:57:32+05:30 IST

ఎడారి దేశం ఖతార్ (Qatar) వేదికగా ప్రపంచ ఫుట్‌బాల్ పండుగ ‘ఫిఫా వరల్డ్ కప్ (FIFA World) ఆదివారం అంగరంగవైభవంగా మొదలైంది. అట్టహాసంగా నిర్వహించిన ప్రారంభ వేడుకలు అంబరాన్ని తాకాయి.

FIFA World Cup: ఫిఫా వరల్డ్ కప్ ఏర్పాట్ల వెనుక నమ్మలేని నిజాలు.. 6500 మంది వలస కార్మికులు బలి

డారి దేశం ఖతార్ (Qatar) వేదికగా ప్రపంచ ఫుట్‌బాల్ పండుగ ‘ఫిఫా వరల్డ్ కప్ (FIFA World) ఆదివారం అంగరంగవైభవంగా మొదలైంది. అట్టహాసంగా నిర్వహించిన ప్రారంభ వేడుకలు అంబరాన్ని తాకాయి. ప్రతిఒక్కరినీ అబ్బురపరిచాయి. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ లవర్స్‌ని మంత్రముగ్దులను చేసేశాయి. ఇక వరల్డ్ కప్ కోసం ప్రత్యేకంగా నిర్మించిన స్టేడియాలు, సౌకర్యాలు తళతళ్లాడుతున్నాయి. మైదాన ప్రాంగణాలు, వాటి పరిసరాలు ఖతర్ దర్పాన్ని చెప్పకనే చాటిచెబుతున్నాయి. ఈ తరహా ఏర్పాట్ల ద్వారా ప్రపంచ కప్‌కు చిరస్మరణీయ ఆతిథ్యమివ్వబోతున్నట్టు ఏడారి దేశం సంకేతాలిచ్చింది.

అయితే ఈ స్థాయిలో ఫిఫా ప్రపంచకప్‌కు సౌకర్యాలు సంసిద్ధం చేయడానికి ఖతార్‌కు దాదాపు దశాబ్దకాలం పట్టింది. దీని వెనుక లక్షలాది మంది వలస కార్మికుల శ్రమ దాగివుంది. అంతకుమించి వేలాది కార్మికుల ప్రాణ త్యాగం నిలిచివుంది. ఫిఫా వరల్డ్ కప్ 2022 నిర్వహణ హక్కుల దక్కించుకున్న డిసెంబర్ 2010 నాటి నుంచి కిందటేడాది వరకు ఖతార్‌లో మొత్తం 6500 వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్టు రిపోర్టులు చెబుతున్నాయి. ఆయా నిర్మాణ పనుల్లో భాగంగా కార్మికులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. దీనినిబట్టి వలస కార్మికుల భద్రతకు తగిన ఏర్పాట్లు చేయడంలో ఖతార్ విఫలమైనట్టు గణాంకాలు ఎత్తిచూపుతున్నాయి. భారత్, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాలకు చెందిన 6,500లకు పైగా మంది వలస కార్మికులు అక్కడ మృత్యువాతపడ్డారని ‘ ది గార్డియన్ ’ (The Guradian) గతేడాది తన రిపోర్టులో పేర్కొంది. దక్షిణాసియాలోని ఈ 5 దేశాలకు చెందిన కార్మికులు డిసెంబర్ 2010 నుంచి వారానికి సగటున 12 మంది చొప్పున ప్రాణాలు కోల్పోయారని ఆయా ప్రభుత్వాల గణాంకాలు చెబుతున్నాయని విశ్లేషించింది.

భారత్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక దేశాలకు చెందిన డేటా ప్రకారం.. 2011-2020 మధ్య 5,927 మంది వలస కార్మికులు ఖతార్‌లో ప్రాణాలు కోల్పోయారు. ఇక 2010-2020 మధ్య 824 మంది పాకిస్తానీ కార్మికులు చనిపోయినట్టు ఖతార్‌లోని పాకిస్తాన్ ఎంబసీ పేర్కొంది. ఇతర దేశాలకు చెందిన కార్మికుల లెక్కను ఇందులో చేర్చకపోవడంతో ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చనే అంచనాలున్నాయి. ఫిలిప్పీన్స్, కెన్యాల నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు ఖతార్‌కు వలస వెళ్తుంటారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే 2020 చివరి నెలల్లో నమోదైన మరణాలు లెక్కలోకి రాలేదని సమాచారం.

Updated Date - 2022-11-21T22:10:51+05:30 IST