Shaheen Shah Afridi: అంత సీన్ లేదు.. అతడున్నా పాకిస్థాన్ ఓడేది: గవాస్కర్
ABN , First Publish Date - 2022-11-13T21:35:47+05:30 IST
ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో పాకిస్థాన్ పోరాడి ఓడింది. ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించలేకపోయినప్పటికీ
మెల్‌బోర్న్: ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో పాకిస్థాన్ పోరాడి ఓడింది. ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించలేకపోయినప్పటికీ తమకున్న బౌలింగ్ బలంతో ఇంగ్లండ్‌ను కాసేపు భయపెట్టింది. అయితే, స్వల్ప లక్ష్యమే కాకవడంతో వికెట్లు కోల్పోయినా పెద్దగా ఒత్తిడి లేకుండానే ఇంగ్లండ్ విజయం సాధించి ప్రపంచకప్‌ను ఎగరేసుకుపోయింది. అయితే, ఈ మ్యాచ్‌లో 2.1 ఓవర్లు వేసిన తర్వాత పాక్ స్టార్ బౌలర్ షహీన్ షా అఫ్రిది (Shaheen Shah Afridi) గాయంతో మైదానం వీడాడు. అతడు కనుక తన కోటా బౌలింగును పూర్తి చేసి ఉంటే తాము గెలిచి ఉండేవారమని మ్యాచ్ అనంతరం పాక్ కెప్టెన్ బాబర్ ఆజం (Babar Azam) అన్నాడు.
అయితే, అంత సీన్ లేదని, షహీన్ అఫ్రిది గాయపడకున్నా పాకిస్థాన్ ఓటమి పాలయ్యేదని టీమిండియా లెజండరీ బ్యాటర్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) చెప్పుకొచ్చాడు. హ్యారీ బ్రూక్ క్యాచ్ పడుతూ గాయపడిన షహీన్ అఫ్రిది మైదానం వీడాడు. ఆ తర్వాత 16వ ఓవర్‌లో తిరిగి వచ్చాడు. ఆ తర్వాత ఒక బంతి మాత్రమే వేయగలిగాడు. దీంతో మిగతా బంతులను ఇఫ్తికార్ అహ్మద్ వేసి కోటాను పూర్తి చేశాడు. అఫ్రిది తన బౌలింగ్ కోటాను పూర్తి చేయలేకపోవడం వల్లే పాకిస్థాన్ ఓడిందని తాను అనుకోవడం లేదని గవాస్కర్ అన్నాడు. అప్పటికే వారు విజయానికి 15-20 పరుగుల దూరంలో ఉన్నారని పేర్కొన్నాడు. వారు (పాక్) కనుక 150-155 పరుగులు చేసి ఉంటే వారి బౌలర్లకు కొంత చాన్స్ లభించి ఉండేదని అభిప్రాయపడ్డాడు. షహీన్ అఫ్రిది మరో 10 బంతులు వేయడం వల్ల పెద్దగా తేడా ఉంటుందని తానైతే అనుకోవడం లేదన్నాడు. మహా అయితే, పాకిస్థాన్‌కు మరో వికెట్ మాత్రమే దక్కి ఉండేదని, ఇంగ్లండ్ గెలుపు మాత్రం పక్కా అని గవాస్కర్ పేర్కొన్నాడు.