Vijay Devarakonda Liger : లైగర్‌ సినిమాకు మీ పారితోషికం ఎంత?

ABN , First Publish Date - 2022-12-01T02:23:10+05:30 IST

‘‘లైగర్‌ సినిమాలో నటించినందుకు మీకు అందిన పారితోషికం ఎంత? ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన ప్రపంచ బాక్సింగ్‌ వీరుడు మైక్‌టైసన్‌కు

Vijay Devarakonda Liger : లైగర్‌ సినిమాకు మీ పారితోషికం ఎంత?

మైక్‌టైసన్‌కు ఎంతిచ్చారు??

ఇతరులకు చెల్లింపుల సంగతేంటి?

విజయ్‌ దేవరకొండకు ఈడీ ప్రశ్నలు

టైసన్‌కూ నోటీసులిచ్చే చాన్స్‌?

అన్ని ప్రశ్నలకు జవాబు ఇచ్చా: విజయ్‌

హైదరాబాద్‌, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): ‘‘లైగర్‌ సినిమాలో నటించినందుకు మీకు అందిన పారితోషికం ఎంత? ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన ప్రపంచ బాక్సింగ్‌ వీరుడు మైక్‌టైసన్‌కు ఎంతిచ్చారు? ఇతరులకు జరిపిన చెల్లింపుల సంగతేంటి??’’ అంటూ సినీ నటుడు విజయ్‌ దేవరకొండపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. లైగర్‌ చిత్రం నిర్మాణానికి సంబంధించిన పెట్టుబడులపై అందిన ఫిర్యాదు మేరకు ఈడీ విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్‌, సహ నిర్మాత చార్మీని ఈడీ ఇప్పటికే విచారించిన సంగతి తెలిసిందే..! ఈడీ తన దర్యాప్తులో భాగంగా విజయ్‌ దేవరకొండకు ఇటీవల నోటీసులు జారీ చేయగా.. బుధవారం ఆయన తన మేనేజర్‌ అనురాగ్‌తో కలిసి ఈడీ ఎదుట హాజరయ్యారు. ఈ సినిమాలో పెట్టుబడులు.. పారితోషకాలు, చెల్లింపులు, సినిమా వసూళ్లు తదితర అంశాలపై ఆయనను సుదీర్ఘంగా విచారించారు. ఒకప్పటి హెవీ వెయిట్‌ బాక్సింగ్‌ చాంపియన్‌ అయిన మైక్‌టైసన్‌కు కూడా ఈడీ నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయి. లైగర్‌ సినిమాలో రాజకీయ నాయకులు అక్రమ పద్ధతిలో పెట్టుబడులు పెట్టారని ఈడీ ప్రాథమికంగా గుర్తించింది. ఈ కోణంపైనా విజయ్‌ దేవరకొండను ప్రశ్నించినట్లు తెలిసింది.

ఈడీ ప్రశ్నలకు సమాధానాలిచ్చా

ఈడీ విచారణ ముగిసిన తర్వాత విజయ్‌ దేవరకొండ విలేకరులతో మాట్లాడారు. ‘‘ఉదయమే ఈడీ కార్యాలయానికి వచ్చాను. వాళ్లు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాను’’ అని వివరించారు. ప్రేమించే మనుషులున్నప్పుడు లాభాలు.. ఇబ్బందులు కూడా ఉంటాయని వ్యాఖ్యానించారు. ఏ కేసులో విచారించారు? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానాన్ని దాటవేశారు.

Updated Date - 2022-12-01T02:23:13+05:30 IST