Somuverraju: వైసీపీ సర్కార్‌పై సోమువీర్రాజు ఫైర్
ABN , First Publish Date - 2023-05-04T14:00:37+05:30 IST
వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: వైసీపీ ప్రభుత్వంపై (YCP Government) బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు (BJP state president Somuveerraju) ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మధ్య కుల, మత విద్వేషాలు రెచ్చగొడుతోందని మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. హిందువుల మనోభావాలను దెబ్బ తీయాలని వైసీపీ పనిగా పెట్టుకుందన్నారు. గుంటూరులో అగ్రహారం పేరును తీసేసి.. రాత్రికి రాత్రి ఫాతిమా పేరుతో బోర్డు పెట్టడంలో ఈ ప్రభుత్వం ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. విశాఖ నగరంలో సీతమ్మ కొండ పేరు మార్చడం, ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్ విగ్రహం పెట్టాలని ప్రయత్నం ఈ తరహా సంఘటనలకు ఎవరు సూత్రధారి అంటూ నిలదీశారు. ముస్లింల కోసం చట్టాలు మారుస్తామని ప్రకటిస్తున్నారన్నారు. అదే విధంగా హిందూ ఎస్సీలకు వ్యతిరేకంగా ప్రభుత్వ పోకడలు చూస్తే... హిందువులపై దాడులకు తెగబడే విధంగా వైసీపీ వ్యవహరిస్తోందని వ్యాఖ్యలు చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రజలను విడదీయడం దుర్మార్గమన్నారు. ఇంత నీచంగా ఆలోచన చేసే ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని సోమువీర్రాజు విమర్శలు గుప్పించారు.