UCC: ఏపీలో యూసీసీపై అధికార, విపక్షాల పోటాపోటీ సమావేశాలు

ABN , First Publish Date - 2023-07-18T15:15:58+05:30 IST

యూనిఫామ్ సివిల్ కోడ్(యూసీసీ)పై రేపు(బుధవారం) ఏపీలో అధికార, విపక్షాలు పోటాపోటీగా సమావేశాలు నిర్వహించనున్నాయి.

UCC: ఏపీలో యూసీసీపై అధికార, విపక్షాల పోటాపోటీ సమావేశాలు

అమరావతి: యూనిఫామ్ సివిల్ కోడ్(యూసీసీ) (UCC)పై రేపు(బుధవారం) ఏపీలో అధికార, విపక్షాలు పోటాపోటీగా సమావేశాలు నిర్వహించనున్నాయి. యూనిఫామ్ సివిల్ కోడ్‌పై ముస్లిం మత పెద్దల అభిప్రాయాలను తెలుసుకోవాలని నిర్ణయించాయి. రేపు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో 30 మంది ముస్లిం పెద్దలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan reddy) భేటీ కానున్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్‌ను వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో తీసుకొస్తామని ఎన్‌డీఏ ప్రకటించడంతో అధికార, విపక్షాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్‌ను ఢిల్లీ పిలిపించి యూనిఫామ్ సివిల్ కోడ్, ఢిల్లీ ఆర్డినెన్స్‌పై తమకు మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి కోరారు. ఈ నేపథ్యంలోనే బుధవారం క్యాంప్ కార్యాలయంలో మత పెద్దలతో సీఎం భేటీ అవనున్నారు.

మరోవైపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (TDP Chief Chandrababu naidu) తన నివాసంలో మత పెద్దలతో భేటీ కానున్నారు. ఈ భేటీకి సుమారు 120 మంది వరకూ హాజరవుతారని అంచనా. యూనిఫామ్ సివిల్ కోడ్‌పై మత పెద్దల అభిప్రాయాలను టీడీపీ అధినేత తెలుసుకోనున్నారు. ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డ్ ప్రతినిధులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిం ప్రముఖులు, మత పండితులు, మౌలానాలు, ముఫ్తీలు, ప్రజా సంఘాలకు చంద్రబాబు ఆహ్వానం పంపారు. శాసనమండలి మాజీ అధ్యక్షులు ఫారూక్ పేరుతో అధినేత ఆహ్వానాలు పంపించారు. ఇప్పటికే చంద్రబాబును మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నేత ఫారూక్ షుబ్లీ కలిసి యూనిఫామ్ సివిల్ కోడ్‌ను వ్యతిరేకించాలని కోరారు. ఆ సమయంలోనే తాను ముస్లిం మత పెద్దలతో సమావేశమై అభిప్రాయాలు తెలుసుకుంటానని షుబ్లీకి చంద్రబాబు చెప్పారు. ఈ నేపథ్యంలో యూసీసీపై అధికార, విపక్షాల సమావేశాలతో ఏం జరుగబోతోందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

Updated Date - 2023-07-18T15:19:21+05:30 IST