Daggubati Purandeswari: ఏపీలో వైసీపీ ప్రభుత్వం వద్దని రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు
ABN , Publish Date - Dec 29 , 2023 | 10:12 PM
ఏపీలో వైసీపీ ప్రభుత్వం వద్దని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శక్తి కేంద్ర ప్రముఖుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ..
Daggubati Purandeswari: ఏపీలో వైసీపీ ప్రభుత్వం వద్దని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శక్తి కేంద్ర ప్రముఖుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఏపీలో మరో రెండు, మూడు నెలల్లో ఎన్నికలకు వెళ్తున్నామని, రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త శ్రమించాలని పిలుపునిచ్చారు. శనివారంతో ఏపీలో తన రాష్ట్రవ్యాప్త పర్యటన ముగిసిందన్న ఆమె.. ఏపీ ప్రభుత్వం అభివృద్ధికి తిలోదకాలిస్తోందని, అవినీతి పెద్దఎత్తున పెచ్చుమీరుతోందని ఆరోపణలు గుప్పించారు. ప్రతి కార్యకర్త ఏపీ ప్రజల్ని దృష్టిలో ఉంచుకొని.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా కసరత్తులు చేయాలని కోరారు.
ఇదే సమావేశానికి కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవియా ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తలుగా ఉన్నవాళ్లే రేపటి నాయకులు అవుతారని అన్నారు. నేను, మీరు అందరూ బీజేపీ కార్యకర్తలేనన్న ఆయన.. తాను ఇప్పటివరకూ ఏపీలో ఎంతోమంది కార్యకర్తల్ని కలిశానన్నారు. ఆంద్రప్రదేశ్‌లో బీజేపీ భవిష్యత్ చాలా ఉందని, రాష్ట్రంలో బీజేపీని గెలిపించే సత్తా ప్రతి బీజేపీ కార్యకర్తలో ఉందని పేర్కొన్నారు. వికసిత భారత్ సంకల్ప యాత్రలో తాను పాల్గొన్నానని.. మోదీ గ్యారెంటీ స్కీంలన్నీ ప్రజల్లోకి బాగా వెళ్లాయని చెప్పారు. పేదలకు పథకాలను వారి గుమ్మం ముందు ఉంచేందుకు మోదీ కృషి చేశారన్నారు. గ్రామస్థాయిలో కూడా జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించామన్నారు. రైతులకు, మహిళలకు ఒక్క బటన్ నొక్కగానే డబ్బులు అకౌంట్‌లో వేస్తున్నామన్నారు.
కొవిడ్ కాలంలో ప్రజలకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని తెలుసుకున్న మోదీ ప్రభుత్వం.. ఎంతో రీసెర్చ్ చేసి ఎట్టకేలకు 2020లో మొదటి డోస్ అందించగలిగిందని మన్‌సుఖ్ మాండవియా వెల్లడించారు. ఆరు నెలల క్రితం కూడా తాను విజయనగరం వచ్చానని.. అక్కడి పరిస్థితుల్ని సమీక్షించానని అన్నారు. ఏపీలో బీజేపీ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో పని చేస్తే.. విజయం తప్పకుండా లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.